టీఆర్‌ఎస్‌వి మాయమాటలు
- తెలంగాణ లెక్చరర్ల ఫోరంసమావేశంలో ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: మాయమాటలు, ఆచరణ సాధ్యంకాని హామీలతో మభ్యపెట్టి టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిందని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌లోని ఒక హోటల్‌లో గురువారం సాయంత్రం జరిగిన తెలంగాణ లెక్చరర్ల ఫోరం సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫోరం అధ్యక్షుడు కత్తి వెంకటస్వామి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇంటికో ఉద్యోగం ఇస్తామని కేసీఆర్ వాగ్దానం చేశారని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాల ప్రకటననే మరిచిపోయారని విమర్శించారు.
దళితులకు మూడెకరాల భూమి, నిరుపేదలకు రెండు పడకగదుల ఇల్లు, ఇంటికో ఉద్యోగం అంటూ ఎన్నో ఆశలు చూపించిన సీఎం కేసీఆర్ ఇప్పుడేం చేస్తున్నారని నిలదీశారు. రాత్రి ఏ ఆలోచన వస్తే ఉదయం లేచి అది చేస్తున్నారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎద్దేవా చేశారు. సామాజిక న్యాయాన్ని అమలుచేసే ఏకైకపార్టీ కాంగ్రెస్ అని, దానిని విద్యావంతులు అర్థంచేసుకోవాలన్నారు. టీఆర్‌ఎస్‌లో ఒక కుటుంబం తప్ప మరెవరూ కనిపించరని, కాంగ్రెస్‌లో సామాన్యులే నాయకులన్నారు. అమరుల త్యాగఫలంతో వచ్చిన తెలంగాణ ఇప్పుడొక కుటుంబ జాగీరుగా మారిపోయిందని ఉత్తమ్ విమర్శించారు. రాష్ట్ర ప్రజల హక్కుల కోసం మరో ఉద్యమం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు.
తమకు హెల్త్‌కార్డులు ఇవ్వాలని, కార్పొరేట్ విద్యా సంస్థల వ్యాపార ధోరణిని అరికట్టేందుకు జీవోను జారీ చేయాలని లెక్చరర్ల ఫోరం కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్; వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లా పట్టభద్రుల నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి రవికుమార్, నవీన్(తీన్మార్ మల్లన్న)లకు తెలంగాణ లెక్చరర్స్ ఫోరం మద్దతు పలకడం అభినందనీయమన్నారు. సమావేశంలో పార్టీ ముఖ్యనేతలు దాసోజు శ్రవణ్‌కుమార్, అద్దంకి దయాకర్‌తో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.