ఆదాయపు పన్ను చెల్లించడం గురుతర బాధ్యత
ఐటీ జాయింట్ కమిషనర్ సత్యానందం
కాకినాడ సిటీ : ఆదాయపు పన్ను చెల్లించడం పన్ను మదుపరుల గురుతరమైన బాధ్యతగా గుర్తించాలని ఆదాయపు పన్ను శాఖ విశాఖ రేంజ్ జాయింట్ కమిషనర్ టి.సత్యానందం అన్నారు. కాకినాడ రోటరీ క్లబ్ సమావేశ హాలులో బుధవారం మూల ఆదాయంపై పన్ను వసూలు (టీడీఎస్) అంశంపై ఉద్యోగులు, వ్యాపారులకు అవగాహన సదస్సును టీడీఎస్ విభాగ అధికారులు నిర్వహిచారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న జాయింట్ కమిషనర్ మాట్లాడుతూ ఆదాయపు పన్ను మదుపరులు సకాలంలో స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం చేపట్టే ప్రాజెక్టులు, పారిశ్రామికాభివృద్ధికి ఖర్చు చేసే రూ.వేల కోట్లను వివిధ శాఖలు అందించాల్సి ఉందన్నారు. ఇందుకు ఆదాయపు పన్నుశాఖ పేద, ధనిక అంతరాన్ని తొలగించి టీడీఎస్ ద్వారా సమతుల్యతను పాటిస్తుందన్నారు. రాజమహేంద్రవరం టీడీఎస్ ఐటీవో జె.శైలేంద్రకుమార్ అధ్యక్షతన జరిగిన ఈకార్యక్రమంలో చార్టర్డ్ అకౌంటెంట్ ఎన్.సురేష్ టీడీఎస్పై అవగాహన కల్పించారు. సదస్సులో ఐటీ అధికారులు, ఉద్యోగులు, వ్యాపారులు, బ్యాంకర్లు పాల్గొన్నారు.