మృత్యుంజయులు
క్షేమంగా తిరిగొచ్చిన మత్స్యకారులు
అచ్యుతాపురం : సముద్రంలో మృత్యువుతో పోరాడి మత్స్యకారులు బుధవారం పూడిమడక తీరానికి క్షేమంగా చేరుకున్నారు. ఈ నెల 14న పూడిమడకకు చెందిన ఉమ్మిడి దుర్గారావు, ఉమ్మిడి మసేను, ఉమ్మిడి దేముడు, మేరుగు తాతారావు, ఎరిపల్లి సత్తియ్య వేటకు వెళ్లారు.
వీరు మంగళవారం రాత్రికి తీరానికి చేరుకోవాలి. సమయం మించిపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. ఎట్టకేలకు బుధవారం ఉదయం మత్స్యకారులు తీరానికి చేరుకున్నారు. వలలు, వేట, భోజన సామగ్రి, డీజిల్, తాగునీరు క్యాన్లు, బట్టలు కోల్పోయారు. కట్టుబట్టలు, పడవతో తీరానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గంటాలమ్మ దేవతే తమను కాపాడిందన్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉందని, బుధవారం ఈదురు గాలులు వీచి పడవ తిరగబడిపోయిందని తెలిపారు. సామగ్రి మొత్తం సముద్రంలో మునిగిపోయాయి.
పడవను పలుమార్లు సరిచేసినా ఫలితం లేకపోయిందన్నారు. ఒక దశలో ప్రాణాలపై ఆశలు వదులుకున్నారు. గంటలపాటు బోర్లా పడిన పడవను పట్టుకొని సేదదీరారు. గాలులు తగ్గడంతో తీరానికి రాగలిగామని వారు తెలిపారు. మత్స్యకారులు తీరానికి చేరుకోవడంతో వారి కుటుంబసభ్యులు ఊపిరి తీసుకున్నారు.