చంద్రబాబు జాలీ ట్రిప్పులు!:శ్రీకాంత్ రెడ్డి
హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజల కష్టాలను మరచిపోయి విదేశాల్లో జాలీ ట్రిప్పులు వేస్తున్నారని వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. చంద్రబాబు కన్నా నీరో చక్రవర్తి నయమన్నచందంగా ఆయన వ్యవహరిస్తున్నారన్నారు. గతంలో సీఎంగా ఉన్న సమయంలో విదేశీ పర్యటనలు చేసి రాష్ట్రానికి ఎన్ని పరిశ్రమలు తెచ్చారని ప్రశ్నించారు. విదేశీ పర్యటనలకు చేసిన ఖర్చుకు సమానంగానైనా విదేశీ పెట్టుబడులు వచ్చాయా? అని అడిగారు.
చంద్రబాబుకు ప్రచారం తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టవన్నారు. విదేశీ పర్యటనలకు కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు విదేశీ పర్యటనలపై కేంద్ర నిఘా సంస్థ ద్వారా దర్యాప్తు జరిపించాలని ఆయన కోరారు. ఏపీని విదేశాలకు తాకట్టుపెడతారన్న భయం ప్రతిఒక్కరికీ ఉందన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు ప్రజలకు మేలుచేసేలా వ్యవహరించాలని శ్రీకాంత్ రెడ్డి కోరారు.
**