అమ్మా.. మమ్మీ..
ఈ నెల 11న జరిగిన మాతృదినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో రకరకాల ఉత్సవాలు జరిపారు. పోటీలు నిర్వహించారు. అయితే, చైనాలోని నాన్‌చాంగ్ సిటీలో ఓ చానల్ నిర్వహించిన పోటీ మాత్రం వాటన్నిటికన్నా భిన్నమైనది. పోటీలో భాగంగా వారు మగాళ్లకు ఓ చాలెంజ్ విసిరారు. ప్రసవం సందర్భంగా మహిళలు అనుభవించే బాధను మీరు భరించగరా? అని అడిగారు. 20 మంది ముందుకొచ్చారు. వారిని ఓ ప్రత్యేకమైన యంత్రానికి అనుసంధానించి ఉన్న.. బెడ్ మీద పడుకోబెట్టి.. ప్రసవం సందర్భంగా అనుభవించే బాధను ఎలక్ట్రిక్ షాకుల ద్వారా వారికి కలిగించారు.
వీటి స్థాయి 50 నుంచి 500గా నిర్ణయించారు. అయితే.. షాకులివ్వడం మొదలుపెట్టగానే.. పురుషులు అమ్మా,.. అంటూ బేర్మన్నారు. 30 సెకన్లు కూడా దాన్ని భరించలేకపోయారు. అమ్మ గొప్పతనాన్ని స్మరిస్తూ.. మాతృమూర్తులకు వందనం చేసి వెనుదిరిగారు. అయితే.. చిత్రంలోని జోనాన్ మాత్రమే 500 స్థాయి షాకులను భరించారు. పోటీ పూర్తయిన తర్వాత ఆయన మాట్లాడుతూ.. ‘నాకు ముగ్గురు పిల్లలు. ప్రసవం సందర్భంగా నా భార్య అనుభవించిన బాధను నేనూ చవిచూడాలనుకున్నా.. ఇది చాలా దారుణమైన బాధ. ఈ అనుభవం తర్వాత నాకు తల్లులందరిపైనా గౌరవం మరింత పెరిగింది’ అని అన్నారు.