భారత్ చరిత్రను రిపీట్ చేసేనా?
లక్నో:జూనియర్ ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్లో మరోసారి చరిత్ర సృష్టించేందుకు భారత్ ఉవ్విళ్లూరుతోంది. 15 ఏళ్ల క్రితం చివరిసారి జూనియర్ వరల్డ్ కప్ హాకీ టైటిల్‌ను సాధించిన భారత్.. ఆ తరువాత ఇంతవరకూ ఆ ట్రోఫీని గెలవలేదు. తాజాగా సొంతగడ్డపై జరుగుతున్న జూనియర్ వరల్డ్ కప్ హాకీ టోర్నీలో ఫైనల్ కు చేరిన భారత జట్టు గత చరిత్రను పునరావృతం చేయాలని భావిస్తోంది. దీనిలో భాగంగా ఆదివారం సాయంత్రం గం.6.00లకు నగరంలోని మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియంలో ఆరంభమయ్యే మ్యాచ్‌లో బెల్జియంతో అమీతుమీ తేల్చుకోవడానికి భారత్ సన్నద్ధమైంది.
జూనియర్ వరల్డ్ కప్ టోర్నీలో స్పెయిన్ ను క్వార్టర్ ఫైనల్ ఓడించిన భారత్.. సెమీ ఫైనల్లో పటిష్టమైన ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. దాంతో హర్జిత్ సింగ్ అండ్ గ్యాంగ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ టైటిల్ వేటలో భారత్ విజయం సాధిస్తుందనే ధీమాతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మన్దీప్ సింగ్, మన్‌ప్రీత్ సింగ్, ఆర్మాన్ ఖురేషీ, సంతా సింగ్‌లతో కూడిన జట్టు భారత యువ జట్టు బలంగా కనిపిస్తోంది. దాంతో 2001 నుంచి భారత్ ఎదురుచూస్తున్న నిరీక్షణకు ఎలాగైనా తెరదించాలని భారత్ భావిస్తోంది.
ఇప్పటివరకూ ఈ టోర్నీలో ఇరు జట్లు ఓటమి అనేది లేకుండా ఫైనల్ పోరుకు అర్హత సాధించాయి. దాంతో తుదిపోరు మరింత ఆసక్తిని రేపుతోంది. ఒకవేళ ఈ టైటిల్ వేటలో భారత్ విజయం సాధించిన పక్షంలో మన జాతీయ క్రీడ హాకీకు ఎంతో కొంత పూర్వ వైభవం వచ్చే అవకాశం ఉంది.