ఫోన్లు అన్లాక్ చేయడం అసాధ్యం: యాపిల్
లాక్, సీజ్ చేసిన యాపిల్ ఐఫోన్లలో స్టోర్ చేసిన డాటాను తిరిగి సేకరించడం అసాధ్యమని ఆ కంపెనీ ప్రతినిధులు అమెరికా న్యాయమూర్తి జస్టిస్ బ్రూక్లిన్కు స్పష్టం చేశారు. ఓ కేసు దర్యాప్తులో భాగంగా సీజ్ చేసిన యాపిల్ కంపెనీ ఫోన్ను అన్లాక్ చేయాల్సిందిగా సంస్థ మేనేజ్మెంట్ను న్యూయార్క్లో ఫెడరల్ కోర్టు జడ్జి బ్రూక్లిన్ కోరారు. ఐఓఎస్8 ఆపరేటింగ్ సిస్టమ్తో సంస్థకు చెందిన 90 శాతం మొబైల్స్ ఉన్నాయని, ఎన్క్రిప్షన్ మెథడ్ చాలా పటిష్టంగా ఉన్నందున అమెరికా న్యాయస్థానం విజ్ఞప్తిని యాపిల్ సంస్థ సున్నితంగా తిరస్కరించాల్సి వచ్చింది.
2014లో ఎన్ఎస్ఏ కాంట్రాక్టర్ ఎడ్వర్డ్ స్నోడెన్ అమెరికాకు సంబంధించి కొన్ని రహస్యాలను బహిర్గతం చేసిన విషయం అందరికి విదితమే. దీంతో అప్రమత్తమైన యాపిల్ సంస్థ ఐఫోన్ నుంచి డాటా సేకరించేందుకు వీలులేకుండా ఉండేలా చేసిందని అమెరికా జడ్జి జేమ్స్ ఓరెన్స్టేన్కు ఐఫోన్ నిర్వాహకులు వివరించారు. కాగా, శుక్రవారం ఈ విషయమై అమెరికా కోర్టులో ఇరువర్గాలు వాదనలు వినిపించనున్నాయి. అయితే లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న ఫోన్ల నుంచి డాటా రిట్రీవ్ చేయడం అంత సులువు కాదంటూ యాపిల్ సంస్థ వాదిస్తోంది. ఫెడరల్ కోర్టు నుంచి సెర్చ్ వారెంట్ జారీ అయినట్లయితే, అక్కడి ప్రభుత్వం ఐఫోన్ డాటాకు సంబంధించి యాపిల్ సంస్థ అధికారులతో చర్చించి సమాచారాన్ని సేకరించే అవకాశం ఉంది.