కీలక దశకు అలిపిరి ఘటన కేసు విచారణ
- సీఎం, మంత్రి బొజ్జలకు 17లోగా సమన్లు
- అదేరోజు హాజరయ్యేలా చూడాలని పోలీసులకు కోర్టు ఆదేశం
తిరుపతి లీగల్: సీఎం చంద్రబాబుపై 2003 అక్టోబర్ ఒకటో తేదీన అలిపిరి సమీపంలో క్లెమోర్ మైన్స్‌తో దాడి జరిగిన కేసు విచారణ వేగవంతమైంది. కేసులో రెండవ సాక్షి, ప్రస్తుత ఏలూరు పోలీసు ట్రైనింగ్ కాలేజ్ డీఎస్పీ కె. రాజేశ్వరరెడ్డి బుధవారం కోర్టుకు హాజరయ్యారు.
ఇదివరలో జడ్జి జారీచేసిన బెయిలబుల్ వారెంట్‌ను రీకాల్ చేసుకున్నారు. సంఘటన జరిగిన సమయంలో సీఎం కాన్వాయ్ పైలట్ ఆఫీసర్‌గా ఉన్న రాజేశ్వరరెడ్డి సంఘటనను కోర్టులో వివరించారు.
కాగా, విచారణ షెడ్యూల్ ప్రకారం సాక్షులను హాజరుపరచకపోవడంపై జడ్జి బుధవారం పోలీసు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసులో 14వ సాక్షిగా ఉన్న సీఎం చంద్రబాబు, 13వ సాక్షిగా ఉన్న మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి సాక్షి సమన్లు ఈ నెల 17వ తేదీలోగా అంద జేసి 17వ తేదీన కోర్టుకు హాజరయ్యేలా చూడాలని జడ్జి ఆదేశించారు. అనంతరం కేసును ఈ నెల 11వతేదీకి వాయిదా వేస్తూ తిరుపతి అదనపు సీనియర్ సివిల్ జడ్జి సదానందమూర్తి ఆదేశాలు జారీ చేశారు.