మెడ్‌టెక్ జోన్ వ్యవహారంలో కొత్త మలుపు
విశాఖపట్నం: విశాఖలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మెడ్ టెక్ జోన్ వ్యవహారం కొత్తమలుపు తిప్పింది. ప్రభుత్వ అవినీతిని బయటపెట్టినవారిపై కేసులు నమోదు అయ్యాయి. మెడ్ టెక్ జోన్ నిర్మాణానికి సంబంధించి రూ.500 కోట్ల విలువైన టెండర్ పనులను రూ.2400 కోట్లకు కట్టబెట్టారని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్యకు కొందరు ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదు చేసిన వాళ్ళు సంస్థ సమాచారాన్ని బయటకు పంపారంటూ మెడ్ టెక్ సీఈఓ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. సంస్థ మాజీ ఇద్దరు ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ వ్యవహారం వైద్య శాఖలో తీవ్ర దుమారం రేపుతోంది. కాగా మెడ్ టెక్ జోన్ నిర్మాణంలో అక్రమాలు జరుగుతున్నాయని ఆ జోన్ మాజీ వైస్ ప్రెసిడెంట్(ప్లానింగ్) జూడిష్ రాజ్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనను ఈరోజు ఉదయం హైదరాబాద్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు అవినీతికి సంబంధించి సంబంధిత మంత్రి కామినేని శ్రీనివాస్ కానీ, ఆ శాఖ ప్రధాన కార్యదర్శిగానీ స్పందించలేదు.