Juggy Vasudev
-
కోయంబత్తూరులోఆది యోగి విగ్రహం ఆవిష్కరణ
-
ప్రపంచశాంతికి యోగా
యోగాతో నేను నుంచి మనంకు ప్రయాణం ► సమాజంలో శాంతియుత సహజీవనం అవసరమన్న ప్రధాని ► కోయంబత్తూరులోఆదియోగి విగ్రహం ఆవిష్కరణ సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రపంచమంతా శాంతిని కోరుకుంటోందని.. అందరూ కోరుకునే శాంతి యోగాతోనే సాధ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. శారీరక, మానసిక ఆరోగ్యాలకు యోగా పాస్‌పోర్టు వంటిదని చెప్పారు. కోయంబత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ ఈషా యోగా కేంద్రంలో 112 అడుగుల ఎత్తున్న నూతనంగా నిర్మించిన ‘ఆదియోగి’ విగ్రహాన్ని ప్రధాని మోదీ శుక్రవారం ఆవిష్కరించారు. ‘అందరూ ఆశిస్తున్న శాంతి యోగాతోనే సాధ్యం. యోగా కళను కాపాడుకోవడం ఎంతో అవసరం. మనిషిలోని శక్తిని యోగా కాపాడుతుంది, జీవం నుంచి శివం వద్దకు తీసుకెళుతుంది. మనస్సు, శరీరం, అంతరాత్మలను ఏకం చేసి నేను అనే స్వార్థం నుంచి మనం అనే నిస్వార్థం వైపు మళ్లించి అందరినీ ఏకం చేస్తుంది. అహం నుంచి నిరహంకార స్థితికి తీసుకెళ్లి జీవాత్మను పరమాత్మగా మారుస్తుంది’ అని మోదీ తెలిపారు. యోగా మనిషిలో నైతిక విలువలను పెంచుతుందని ప్రధాని తెలిపారు. శివుడు సర్వాంతర్యామి! ‘మహాదేవుడైన శివుడు సర్వాంతర్యామి. కాశీ నుంచి కోయంబత్తూరు వరకు ఆయన వ్యాపించి ఉన్నారు. ఇక్కడికి విగ్రహావిష్కరణకు ఎన్నో దేశాల నుంచి వివిధ సంప్రదాయాల వారు వచ్చినా అందరిలోని ఆధ్యాత్మికచింతన ఒక్కటే. శివుని మెడలో సర్పం, వినాయకుని వాహనం ఎలుక, సుబ్రహ్మణ్య స్వామి వద్ద నెమలి జన్మతః పరస్పరం శత్రువులు. అయితే శివైక్యం కావడం వల్ల అన్నీ కలిసి జీవిస్తున్నాయి. ఇదే భారతదేశంలోని శాంతియుత సహజీవనానికి నిదర్శనం. భిన్నధృవాలు కలిగిన మనిషి కూడా విభేదాలు విస్మరించి ఆధ్యాత్మిక చింతనతో ఏకీకృతం కావాలి. పాత ఆలోచనల స్థానంలో కొత్త చింతనలను స్వాగతించడం మన సంప్రదాయం, వాటిని సంస్కరించుకుని దైనందిన జీవితంలోకి తెచ్చుకుంటున్నాం. శివరాత్రి పండగ.. ప్రకృతిని కాపాడుకోవటంతోపాటు ఈ ప్రకృతికి అనుగుణంగా మన కార్యాచరణను రూపొందించుకునే జాగరూకత స్ఫూర్తికి నిదర్శనం’ అని మోదీ అన్నారు. ప్రకృతే దైవం ప్రకృతి, దేవుడు ఒక్కటేనని ప్రధాని మోదీ అన్నారు. అందుకే మన పూర్వీకులు ఈ విషయాన్ని వివిధ రకాల ప్రకృతి ఆరాధన ద్వారా మనకు అందించారన్నారు. అప్పటికీ, ఇప్పటికీ యోగా పద్ధతులు మారాయని.. ఎన్ని మార్పులొచ్చినా యోగాలోని మాధుర్యం మాత్రం తగ్గలేదన్నారు. భవిష్యత్ తరాలు యోగాను అర్థం చేసుకుని ఆచరించేలా ప్రేరేపించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని ప్రధాని తెలిపారు. భిన్నత్వం ఘర్షణకు కారణం కాదని.. అదే మన సంస్కృతిలోని గొప్పదనమని ప్రధాని తెలిపారు. మోదీకి నిరసన దళితుల భూమిని లాక్కుని ఆదియోగి విగ్రహం నిర్మించారని, ఈ కార్యక్రమానికి మోదీ రాకను నిరసిస్తూ ఓ ఎన్జీవో ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నల్ల బెలూన్లను వదిలి నిరసన తెలిపారు. రోడ్లపై ఆందోళనకు దిగిన 500 మంది కార్యకర్తలను కోయంబత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాని మోదీ రైతులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని నిరసనకారులు నినాదాలు చేశారు. మోదీ యోగా సాధన భేష్! అంతకుముందు ఆదియోగి విగ్రహానికి ప్రధాని మోదీ హారతినిచ్చి పుష్పాంజలి ఘటించారు. ఆదియోగి విగ్రహాన్ని ఎనిమిది నెలల్లో నిర్మించినట్లు ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు జగ్గీ వాసుదేవ్ వెల్లడించారు. యోగాను నిత్యం సాధన చేసే మోదీని ఆయన ప్రశంసించారు. ధ్యానలింగ మండపంలో కాసేపు మోదీ యోగాసనంలో కూర్చున్నారు. ‘ఆదియోగ’ అనే పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా యువకులు చేసిన యోగానృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అంతకుముందు, కోయంబత్తూరుకు చేరుకున్న మోదీకి తమిళనాడు గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు, ముఖ్యమంత్రి కే పళనిస్వామి స్వాగతం పలికారు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ , కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ , పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ, పలువురు బీజేపీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
చంద్రబాబుతో నేడు జగ్గీ వాసుదేవ్ భేటీ
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జగ్గీ వాసుదేవ్ ఆదివారం భేటీ కానున్నారు. హైదరాబాద్ మదీనగూడలోని చంద్రబాబు ఫాంహౌస్‌లో సుమారు గంటకు పైగా ఈ భేటీ జరుగుతుందని పార్టీ వర్గాల సమాచారం. ఈ భేటీలో చంద్రబాబు కుటుంబ సభ్యులు కూడా పాల్గొంటారని తెలిసింది. గతేడాది జనవరి చివరివారంలో ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, సివిల్ సర్వీసెస్ అధికారులకు యోగా శిక్షణ ఇచ్చారు. జగ్గీ వాసుదేవ్ సంస్థలు ఏర్పాటుచేసేందుకు అనువుగా కృష్ణా జిల్లాలో 400 ఎకరాల భూమిని ఇచ్చేందుకూ సంసిద్ధత వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. నేడు బీసీ సబ్‌ప్లాన్‌పై చంద్రబాబు సమావేశం : సీఎం చంద్రబాబు ఆదివారం టీడీపీలోని బీసీ ప్రజా ప్రతినిధులతో బీసీ ఉప ప్రణాళికపై సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఉదయం 10 గంటలకు లేక్‌వ్యూ అతిథి గృహంలో జరిగే ఈ సమావేశంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారు. చంద్రబాబును కలిసిన అల్లు అరవింద్ : సీఎంను సినీ నిర్మాత అల్లు అరవింద్ శనివారం కలిశారు. తన బావ, కాంగ్రెస్ ఎంపీ కొణిదెల చిరంజీవి కుమార్తె శ్రీజ వివాహానికి హాజరుకావాలని కోరుతూ వివాహ ఆహ్వాన పత్రికను చంద్రబాబుకు అందజేశారు. అందుకు ఆయన అంగీకరించారు. -
కర్మ విచ్ఛేదనం ఎలా?
కర్మ అంటే పని లేదా చర్య అని అర్థం. పుట్టిన క్షణం నుంచీ, ఈ క్షణం వరకూ, మీ కుటుంబ స్థితిగతులు,మీ ఇంటి వాతావరణం, మీ స్నేహితుల మనస్తత్వాలు, మీరు చేసిన- చెయ్యని పనులు, ఇవన్నీ మిమ్మల్ని ప్రభావితం చేస్తున్నాయి. ప్రతీ ఆలోచన, ప్రతీ ఉద్వేగం, ప్రతిచర్యా, మీలో గతంలో ముద్రింపబడి ఉన్న భావనల నుండే జనిస్తుంది. అవన్నీ ఇప్పుడు మీరు ఎవరూ అనేది నిర్ణయిస్తాయి. మీరు ఆలోచించే విధానం, అనుభూతి చెందే విధానం, అసలు జీవితాన్ని అర్థం చేసుకొనే విధానమే మీరు ఇంతకు ముందు స్వీకరించిన వాటిని ఎలా మీలో ఇముడ్చుకున్నారనే దానిని బట్టి ఉంటుంది. దీనినే మనం కర్మ అంటాం. ఆధునిక భాషలో చెప్పాలంటే, అది మీలోని సాఫ్ట్వేర్. ప్రస్తుతం ఏ సాఫ్ట్వేర్ ఆధారంగా అయితే మీరు పని చేస్తున్నారో అదే కర్మ. మీ శారీరక వ్యవస్థ అంతా, అంటే మీ దేహం, బుద్ధి, శక్తి, భావోద్వేగాలు, అన్నీ ముందుగానే, మీరు స్వీకరించిన వాటి ఫలితంగా ప్రోగ్రామై ఉన్నాయి. వాటన్నిటి సంక్లిష్ట సమ్మేళనమే మీ కర్మ. మీలోని సార్ ఏవిధంగా ఉంటే, అదేవిధంగా మీ శరీరం, బుద్ధి, భావాలు పనిచేస్తాయి. మీలోని అంతర్గత శక్తి కూడా అదే దిశగా ప్రవహిస్తుంది. మీకెలాటి కర్మ ఉన్నా, అది ఒక పరిమితమైన సంభావ్యతే (అవకాశమే). మిమ్మల్ని ఒక వ్యక్తిగా పరిమితున్ని చేసేది అదే. మీ వ్యక్తిత్వం మీ కర్మల నుండి జనించే పరిమళం. మీ కర్మలో కుళ్ళిపోయిన చేప ఉంటే, మీరు ఆ దుర్వాసననే కలిగి ఉంటారు. మీ కర్మలో పువ్వుల సుగంధం ఉంటే, మీరు ఆ పరిమళాన్నే కలిగి ఉంటారు. మీలో ఎలాంటి భావనలు కోపం- ద్వేషం, ప్రేమ-ఆనందం- ఇలా ఎలాంటి భావనలైతే ముద్రింపబడి ఉన్నాయో, వాటికి అనుగుణంగానే మీ వ్యక్తిత్వం ఉంటుంది. సామాన్యంగా ప్రతీ మనిషి, వీటన్నిటి సమ్మేళనమే! మీరు మీ వంక చూసుకున్నా, మీ చుట్టూ ఉన్న మనుషులను చూసినా, ఒక్కో సందర్భంలో వారు ఎంతో అద్భుతంగా అనిపిస్తారు, వారే మరొక సందర్భంలో చాలా అసహ్యకరంగా అనిపిస్తారు. ఎందుకంటే ప్రతి క్షణం, మీ కర్మలోని ఒక భాగం వ్యక్తీకరించబడుతుంది. ఈ కర్మ నిర్మాణాన్ని మీరు అలాగే జరగనిస్తే, ఒక నిర్ణీత స్థితి తరువాత, మీకు స్వేచ్చ అనేదే లేకుండాపోతుంది. మీరు చేసేదంతా, జరిగిపోయిన విషయాలచే శాసించబడినదవుతుంది! కాబట్టి, మీరు మోక్షం దిశగా ప్రయాణించాలి అంటే, మొదట చెయ్యవలసింది, కర్మ బంధనాన్ని వదులు చేసి, ఆ సంకెళ్ళను తెంచుకోవడమే! లేకపోతే, ఏ పురోగతీ ఉండదు. ఇందుకు మొదటి సులభోపాయం, శారీరకంగా కర్మను విచ్ఛేదనం చెయ్యడం. ఉదయాన్నే ఎనిమిది గంటలకు లేవడం మీ కర్మ అయినట్లయితే, మీరు ఐదు గంటలకే అలారం పెట్టుకుని లేవండి. మీ శారీరక కర్మ అందుకు అంగీకరించదు. అయినా, మీరు నేను నిద్ర లేవాల్సిందే అని తీర్మానించుకోండి. అలా మీరు నిద్ర లేచినా మీ శరీరం ముందుగా కాఫీ అడుగుతుంది. కాని, మీరు దానికి చన్నీళ్ళ స్నానం ఇవ్వండి. ఇలా జాగృత స్థితిలో ఉంటూ, మీరు చెయ్యడం వల్ల, మీరు పూర్వపు కర్మలను తెంచగలుగుతారు. ఏది చెయ్యాలనిపిస్తుందో, అది కర్మ నుంచే జనిస్తుంది. మీకు ఇష్టం లేనివి సహజంగా మీరు నిరాకరిస్తారు కనుక, కొంతకాలం మీకు ఇష్టం లేనివి చేసి చూడండి. ఇంకా సూక్ష్మమయిన, ప్రభావవంతమయిన పద్ధతులు ఉన్నాయి. నేను మీకు చెబుతున్నది అత్యంత మొరటు విధానం. మీ మనసు, దేహం కోరుకునేవి అన్నీ తెంచుకోండి. మీకు ఇష్టం లేనివి ఎరుకతోనే చేయగలరు. మీకు ఇష్టం ఉన్నవి మీరు పరాకుగా అయినా చెయ్యగలరు కదా? ఒకవేళ మీరు మీ శత్రువుతో మాట్లాడాలి అనుకోండి. అప్పుడు మీరు ప్రతీ మాట ఆచి-తూచి , ప్రతీ అడుగూ ఆలోచించి వేస్తారు. కాని, స్నేహితులతో మాట్లాడేటప్పుడు నోటికి వచ్చిందల్లా ఆలోచించకుండానే మాట్లాడేస్తారు. మీ శత్రువును మీరు సహించలేరు. అతన్ని చూడగానే, మీలో ఎన్నో మార్పులు కలుగుతాయి. అయినా, మీరు వెళ్లి అతనితో మాట్లాడండి. ఇది కర్మను విచ్చేదనం చేసే మార్గం. ఇలా జాగృతస్థితిలో ఉంటూ, మీకు ఇష్టం లేని పనులను చెయ్యడం వల్ల, మీరు గత కర్మ బంధనాలను క్రమంగా తెంచుకోగలుగుతారు. ప్రేమాశీస్సులతో, సద్గురు జగ్గీ వాసుదేవ్ -
శివరాత్రి సాధనతో అణువణువునా ఆనందం
సద్గురు జగ్గీ వాసుదేవ్ సాక్షి పాఠకులకు నిత్యజీవితంలో ఎదురయ్యే వివిధ సమస్యలకు, ఆయా సందర్భాలలో కలిగే వివిధ సందేహాలకు సద్గురు జగ్గీవాసుదేవ్ సమాధానాలిస్తారు. మీరు చేయవలసిందల్లా మీ సందేహాలను స్పష్టంగా కవర్ లేదా పోస్ట్‌కార్డ్ మీద రాసి పంపడమే! చాంద్రమానం ప్రకారం అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశి నెలలోని మిగతా రాత్రుల కన్నా చిమ్మచీకటితో ఉండే రాత్రి.ఈ రాత్రిని శివరాత్రిగా పరిగణిస్తారు. మనం శివ అన్నప్పుడు, ఒక అంశంలో ఆదియోగి గురించి మాట్లాడుతున్నాం. ఇంకొక అంశంలో, శివ అంటే ఏదిలేదో అది అని అంటున్నాం. ఉన్నది అంటే సృష్టి. లేనిది అంటే శివ. సృష్టి అంతా శూన్యం నుండే వచ్చిందని ఈ రోజున ఆధునిక శాస్త్రం కూడా చెబుతోంది. ప్రతిదీ శూన్యం నుండి వచ్చి తిరిగి శూన్యంలోకి పోతుంది. శూన్యం అనేది సృష్టికి ఆధారం. అందుకని మనం శివుడిని సృష్టికి ఆధారంగా భావిస్తాం. అంటే ఏది లేదో అదే ఉన్నదానికి ఆధారం. సృష్టి అతిసూక్ష్మమైనది. విస్తారమైన శూన్యం బ్రహ్మాండమైనది. సృష్టి అంతా శివుని ఒడిలో జరుగుతున్నట్లు మనం ఎప్పటి నుంచో చెబుతూ ఉన్నాము. మనం శివుడిని నల్లని వాడని పిలుస్తాం. విశేషమేమిటంటే, నేటి ఆధునిక శాస్త్రవేత్తలు కూడా జగత్తులో ప్రతీదానిని తనలో ఇముడ్చుకొని ఉంచుకునే దానిని ఒక అంధకార శక్తిగా అభివర్ణిస్తున్నారు. దానిని మరొకలాగా వర్ణించడానికి వీలులేక, దాని తత్వాన్ని గ్రహించలేక వారు దానిని ఒక అంధకార శక్తిగా పిలుస్తున్నారు. వారు శివ అనడం ఒక్కటే తక్కువ. సంవత్సరంలోని 12 శివరాత్రులలో మహాశివరాత్రి చాలా విశిష్టమైనది. ఈ రాత్రి ఉత్తర భూగోళంలో మానవ వ్యవస్థలోని శక్తులు పయనించుటకు వీలుగా ఉంటాయి. ఈ రోజు మనం ఆధ్యాత్మికతలో పురోగమించడానికి, ఉన్నత శిఖరాలకు చేరడానికి ప్రకృతి పరిపూర్ణంగా సహకరిస్తుంది. దానిని ఉపయోగించుకొని ప్రయోజనం పొందటానికి మన సాంప్రదాయంలో ఈ పండుగను ఏర్పాటు చేశారు. ఇది రాత్రంతా జరుపుకునే పండుగ. మనం ఈ రాత్రంతా మేల్కొని, నడుము నిటారుగా ఉంచి స్థిరంగా కూర్చోవాలి. దానితో పాటు ఈ రోజు ఉప్పొంగే శక్తులను మరింతగా ఉపయోగించుకోడానికి యోగాలో ఒక సాధన ఉన్నది. అదే మంత్రసాధన. మహాశక్తిమంతులను చేసే మంత్ర సాధన ఈ మహాశివరాత్రి నాడు మనం ఒక మంత్రాన్ని ఉచ్చరిస్తాము. మనం మంత్రం అన్నప్పుడు మంత్రార్థం కంటే మంత్రమూలాన్ని తెలుసుకోవాలి.మంత్రమూలం శబ్ధం. శబ్ధం అంటే ‘ప్రకంపనలు’. ఆ ప్రకంపనలే మనకు ముక్తిని కలిగిస్తాయి. ఈ ప్రకంపనలే మనలను మన ప్రస్తుత శారీరక, మానసిక స్థితుల నుండి ఉన్నత శిఖరాలకు తీసుకు వెళతాయి. ఈ ప్రకంపనలే పంచేంద్రియాలకు అతీతమైన వాటిని మనం గ్రహించేలా చేస్తాయి. ఆ విధంగా అవి మనలను మోక్ష స్థానానికి తీసుకెళతాయి. ఈ మంత్రాలను కేవలం నోటితో ఉచ్చరిస్తే సరిపోదు. మన శరీరంలోని ప్రతి అణువూ ఈ మంత్రంతో నిండిపోవాలి. అపుడే మనకు దాని శక్తి ఏమిటో తెలుస్తుంది. నోటితో మాత్రమే మంత్రం ఉచ్చరిస్తే, కొంత ఆరోగ్యం, ఆనందం కలగవచ్చు. కాని మంత్రమహిమ నిజంగా తెలియాలంటే, మన శరీరంలోని అణువణువూ ఈ మంత్ర ప్రకంపనలతో నిండిపోవాలి. ఆ శక్తి మనలో ప్రతిధ్వనించాలి. పళనిస్వామి అనే యోగి జీవితంలో జరిగిన సంఘటన ఇందుకు ఒక చక్కని ఉదాహరణ. ఆయన తన జీవితమంతా ‘శంభో’ అనే మంత్రసాధనతో గడిపేవాడు. అన్నివేళలా... ఆఖరకు కాలకృత్యాలు తీర్చుకునేటప్పుడు కూడా ‘శంభో’ అనే మంత్రోచ్చారణ చేయడం గమనించిన ఒకరు గ్రామ పెద్దలకు తెలియజేశారు. ఇది విని ఎంతో కోపగ్రస్థులైనగ్రామ పెద్దలు వెంటనే పళనిస్వామిని గ్రామసభకు పిలిచి ఇకపై ఆయన ‘శంభో’ అనే మంత్రాన్ని ఎక్కడా, ఎప్పుడూ ఉచ్చరించరాదని శాసించారు. ఆ మంత్రోచ్చారణకు ఆయన అనర్హుడని తీర్మానించారు. పళనిస్వామి ‘శంభో’ మంత్రోచ్చారణ మానివేశాడు. అయినా ‘శంభో’ శబ్ధం ఆగిపోలేదు. ఆ ప్రదేశమంతా ‘శంభో’ అన్న శబ్దంతో మారుమోగిపోయింది. పళనిస్వామి దేహంలోని అణువణువు నుండి బిగ్గరగా ‘శంభో’ మంత్రోచ్చారణ రాసాగింది. అపుడు వారు పళనిస్వామి పాదాలపై పడి, ‘ఇలాంటి నియమాలు సామాన్యులకే గానీ, మానవాతీతులైన మీకు కాదు. మీ ఇష్టం వచ్చినప్పుడు మంత్రోచ్చారణ చేసుకోండి’’ అని చెప్పారు. ఈ ఉదాహరణ వలన మన శరీరంలోని అణువణువూ మంత్రోచ్ఛారణతో నిండిపోతే, దాని శక్తి ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఈ మహాశివరాత్రి కేవలం జాగరణ రాత్రి కాకుండా, మిమ్మల్ని సచేతనత్వం, ఎరుకలతో నింపేది కావాలని, ప్రకృతి ఈ రోజు మనకు ఇచ్చే ఈ మహత్తర అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షిస్తాను. మీరందరూ ఈ రాత్రి మంత్ర సాధన చేసి, ఉప్పొంగే శక్తుల సహాయంతో ‘శివ’ అన్న శబ్దంలోని పారవశ్యాన్నీ, రమణీయతనూ తెలుసుకుంటారని ఆశిస్తాను. ప్రేమాశీస్సులతో, సద్గురు ఈశా ఫౌండేషన్ వారు ప్రతి సంవత్సరం బ్రహ్మాండంగా నిర్వహించే మహాశివరాత్రి వేడుకల్లో పాల్గొనాలనుకుంటే http://mahashivarathri.org/ ని సందర్శించండి! జగ్గీ వాసుదేవ్