కర్మ విచ్ఛేదనం ఎలా? | How to amputation ritual? | Sakshi
Sakshi News home page

కర్మ విచ్ఛేదనం ఎలా?

Published Thu, Mar 5 2015 11:25 PM | Last Updated on Sat, Sep 2 2017 10:21 PM

కర్మ విచ్ఛేదనం ఎలా?

కర్మ విచ్ఛేదనం ఎలా?

కర్మ అంటే పని లేదా చర్య అని అర్థం.  పుట్టిన క్షణం నుంచీ, ఈ క్షణం వరకూ, మీ కుటుంబ స్థితిగతులు,మీ ఇంటి వాతావరణం, మీ స్నేహితుల మనస్తత్వాలు, మీరు చేసిన- చెయ్యని పనులు, ఇవన్నీ మిమ్మల్ని ప్రభావితం చేస్తున్నాయి. ప్రతీ ఆలోచన, ప్రతీ ఉద్వేగం, ప్రతిచర్యా, మీలో గతంలో ముద్రింపబడి  ఉన్న భావనల నుండే జనిస్తుంది. అవన్నీ ఇప్పుడు మీరు ఎవరూ అనేది నిర్ణయిస్తాయి. మీరు ఆలోచించే విధానం, అనుభూతి చెందే విధానం, అసలు జీవితాన్ని అర్థం చేసుకొనే విధానమే మీరు ఇంతకు ముందు స్వీకరించిన వాటిని ఎలా మీలో ఇముడ్చుకున్నారనే దానిని బట్టి ఉంటుంది. దీనినే మనం కర్మ అంటాం.

ఆధునిక భాషలో చెప్పాలంటే, అది మీలోని సాఫ్ట్‌వేర్. ప్రస్తుతం ఏ సాఫ్ట్‌వేర్ ఆధారంగా అయితే మీరు పని చేస్తున్నారో అదే కర్మ. మీ శారీరక వ్యవస్థ అంతా, అంటే మీ దేహం, బుద్ధి, శక్తి, భావోద్వేగాలు, అన్నీ ముందుగానే, మీరు స్వీకరించిన వాటి ఫలితంగా ప్రోగ్రామై ఉన్నాయి. వాటన్నిటి సంక్లిష్ట సమ్మేళనమే మీ కర్మ. మీలోని సార్ ఏవిధంగా ఉంటే, అదేవిధంగా మీ శరీరం, బుద్ధి, భావాలు పనిచేస్తాయి. మీలోని అంతర్గత శక్తి కూడా అదే దిశగా ప్రవహిస్తుంది.

మీకెలాటి కర్మ ఉన్నా, అది ఒక పరిమితమైన సంభావ్యతే (అవకాశమే). మిమ్మల్ని ఒక వ్యక్తిగా పరిమితున్ని చేసేది అదే. మీ వ్యక్తిత్వం మీ కర్మల నుండి జనించే పరిమళం. మీ కర్మలో కుళ్ళిపోయిన చేప ఉంటే, మీరు ఆ దుర్వాసననే కలిగి ఉంటారు. మీ కర్మలో పువ్వుల సుగంధం ఉంటే, మీరు ఆ పరిమళాన్నే కలిగి ఉంటారు. మీలో ఎలాంటి భావనలు  కోపం- ద్వేషం, ప్రేమ-ఆనందం- ఇలా ఎలాంటి భావనలైతే ముద్రింపబడి  ఉన్నాయో, వాటికి అనుగుణంగానే మీ వ్యక్తిత్వం ఉంటుంది. సామాన్యంగా ప్రతీ మనిషి, వీటన్నిటి సమ్మేళనమే! మీరు మీ వంక చూసుకున్నా, మీ చుట్టూ ఉన్న మనుషులను చూసినా, ఒక్కో సందర్భంలో వారు ఎంతో అద్భుతంగా అనిపిస్తారు, వారే మరొక సందర్భంలో చాలా అసహ్యకరంగా అనిపిస్తారు. ఎందుకంటే ప్రతి క్షణం, మీ కర్మలోని ఒక భాగం వ్యక్తీకరించబడుతుంది. ఈ కర్మ నిర్మాణాన్ని మీరు అలాగే జరగనిస్తే, ఒక నిర్ణీత స్థితి తరువాత, మీకు స్వేచ్చ అనేదే లేకుండాపోతుంది. మీరు చేసేదంతా, జరిగిపోయిన విషయాలచే శాసించబడినదవుతుంది! కాబట్టి, మీరు మోక్షం దిశగా ప్రయాణించాలి అంటే, మొదట చెయ్యవలసింది, కర్మ బంధనాన్ని వదులు చేసి, ఆ సంకెళ్ళను తెంచుకోవడమే! లేకపోతే, ఏ పురోగతీ  ఉండదు.

ఇందుకు మొదటి సులభోపాయం, శారీరకంగా కర్మను విచ్ఛేదనం చెయ్యడం. ఉదయాన్నే ఎనిమిది గంటలకు లేవడం మీ కర్మ అయినట్లయితే, మీరు ఐదు గంటలకే అలారం పెట్టుకుని లేవండి. మీ శారీరక కర్మ అందుకు అంగీకరించదు. అయినా, మీరు నేను నిద్ర లేవాల్సిందే అని తీర్మానించుకోండి. అలా మీరు నిద్ర లేచినా మీ శరీరం ముందుగా కాఫీ అడుగుతుంది. కాని, మీరు దానికి చన్నీళ్ళ స్నానం ఇవ్వండి. ఇలా జాగృత స్థితిలో ఉంటూ, మీరు చెయ్యడం వల్ల, మీరు పూర్వపు కర్మలను తెంచగలుగుతారు.

ఏది చెయ్యాలనిపిస్తుందో, అది కర్మ నుంచే జనిస్తుంది. మీకు ఇష్టం లేనివి సహజంగా మీరు నిరాకరిస్తారు కనుక, కొంతకాలం మీకు ఇష్టం లేనివి చేసి చూడండి. ఇంకా సూక్ష్మమయిన, ప్రభావవంతమయిన పద్ధతులు ఉన్నాయి. నేను మీకు చెబుతున్నది అత్యంత మొరటు విధానం. మీ మనసు, దేహం కోరుకునేవి అన్నీ తెంచుకోండి. మీకు ఇష్టం లేనివి ఎరుకతోనే చేయగలరు. మీకు ఇష్టం ఉన్నవి మీరు పరాకుగా అయినా చెయ్యగలరు కదా?

ఒకవేళ మీరు మీ శత్రువుతో మాట్లాడాలి అనుకోండి. అప్పుడు మీరు ప్రతీ మాట ఆచి-తూచి , ప్రతీ అడుగూ ఆలోచించి వేస్తారు. కాని, స్నేహితులతో మాట్లాడేటప్పుడు నోటికి వచ్చిందల్లా ఆలోచించకుండానే మాట్లాడేస్తారు. మీ శత్రువును మీరు సహించలేరు. అతన్ని చూడగానే, మీలో ఎన్నో మార్పులు కలుగుతాయి. అయినా, మీరు వెళ్లి అతనితో మాట్లాడండి. ఇది కర్మను విచ్చేదనం చేసే మార్గం. ఇలా జాగృతస్థితిలో ఉంటూ, మీకు ఇష్టం లేని పనులను చెయ్యడం వల్ల, మీరు గత కర్మ బంధనాలను క్రమంగా తెంచుకోగలుగుతారు.
 ప్రేమాశీస్సులతో,
 సద్గురు  జగ్గీ వాసుదేవ్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement