వారధి నిర్మాణ పనుల్లో ‘నేనెంత’ అనుకోలేదు ఉడుత. ‘నేను కూడా కొంత’ అనుకొని పనుల్లోకి దిగింది. వయనాడ్ సహాయ శిబిరాల్లో తలదాచుకుంటున్న బాధితులకు అండగా నిలవడానికి, తమ వంతు సహాయం అందించడానికి స్థాయి భేదాలు లేకుండా ఎంతోమంది మహిళలు వస్తున్నారు. శిబిరంలోని మహిళలకు బట్టలు కుట్టి ఇవ్వడం నుంచి పరిసరాల శుభ్రత వరకు దీక్షతో పనిచేస్తున్నారు...
శృతికి చారమాలలో చాలా మంది బంధువులు ఉన్నారు. కొండచరియలు విరిగిపడిన సంఘటనలో కొందరు చనిపోయారు. మరికొందరు మెప్పడిలోని సహాయ శిబిరంలో ఉన్నారు. కొంతమంది మహిళలు స్నానం చేయడానికి శృతి ఇంటికి వచ్చినప్పుడు తమకు ఇచ్చిన దుస్తులకు సంబంధించిన సమస్యల గురించి చెప్పుకున్నారు. ఆల్ట్రేషన్‌కు అవకాశం లేకపోవడంతో తమకు సరిపోయే ఒకే జత దుస్తులనే వాడాల్సి వస్తోంది. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకొని స్నేహితురాలి దగ్గర కుట్టుమిషన్ తీసుకొని నిర్వాసిత కుటుంబాల సహాయ శిబిరానికి బయలుదేరింది శృతి.
ప్రతి గదికి వెళ్లి ‘నేను రెండు రోజులు ఇక్కడే ఉంటాను. దుస్తుల సైజ్ సర్దుబాటు సమస్యలు ఉంటే నాకు చెప్పండి’ అని అడిగింది. ఇక ఆరోజు నుంచి చిరిగిపోయిన దుస్తులు, సైజు సరిగా లేని దుస్తులను సరి చేసే పని మొదలైంది.టైలరింగ్ వల్ల జరిగిన మరో మేలు ఏమిటంటే మనసును దారి మళ్లించడం. ఈ శిబిరంలో కొద్దిమంది టైలరింగ్ పని తెలిసిన వారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో రమ్య మనోజ్ ఒకరు.
‘భయపెట్టే జ్ఞాపకాల నుంచి బయటపడడానికి టైలరింగ్ అనేది చికిత్సామార్గంలా ఉపయోగపడింది. చాలా రోజులుగా మేము శిబిరంలో ఖాళీగా ఉన్నాం. ప్రతిరోజూ విషాద జ్ఞాపకాలు నన్ను వెంటాడుతూనే ఉండేవి. మెషిన్‌పై ఆల్ట్రేషన్ పనులు మొదలు పెట్టిన తరువాత నాకు ఎంతో ఉపశమనం లభించింది’ అంటుంది రమ్య మనోజ్.శృతి, రమ్య... మొదలైన వారిని దృష్టిలో పెట్టుకొని సహాయ శిబిరానికి కుట్టుమిషన్‌లను ఒక స్వచ్ఛంద సంస్థ విరాళంగా ఇవ్వనుంది.
‘మొదటిసారి ఇక్కడికి వచ్చినప్పుడు రెండు రోజులు ఉండాలనుకున్నాను. ఇప్పుడు మాత్రం శిబిరం ఉన్నంతవరకు రోజూ వచ్చి పోవాలనుకుంటున్నాను’ అంటుంది శృతి.సహాయ శిబిరానికి శృతి రోజూ రావాలనుకోవడానికి కారణం కేవలం టైలరింగ్ పనులు కాదు. ఇప్పుడు అక్కడ ఆమె ఎంతోమంది బాధితులకు ఓదార్పునిస్తోంది. బాధితులు విషాద జ్ఞాపకాల నుంచి బయటపడడానికి సినిమాల నుంచి ఆటల వరకు ఎన్నో విషయాలు మాట్లాడుతుంటుంది.
‘శిబిరానికి శృతి రావడానికి ముందు మా మాటల్లో బాధలు, కష్టాలు, చేదు జ్ఞాపకాలు మాత్రమే ఉండేవి. అయితే శృతి మమ్మల్ని అటువైపు వెళ్లనివ్వకుండా రకరకాల విషయాలు మాట్లాడుతుంటుంది. ధైర్యం చెబుతుంటుంది’ అంటుంది సహాయ శిబిరంలో తలదాచుకుంటున్న ఆశ.
హరిత కర్మ సేన ఆల్ ఉమెన్ గ్రూప్
పునరావాస శిబిరాల్లో తలదాచుకుంటున్న వారిలో కొందరు జ్వరం, దగ్గులాంటి సమస్యలతో బాధ పడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని పునరావాస శిబిరం పరిసరప్రాంతాల్లో అపరిశుభ్రత ఆనవాలు లేకుండా చేస్తున్నారు. పునరావాస శిబిరాలుగా మారిన పాఠశాలలు శుభ్రంగా కనిపించడానికి కారణం హరిత కర్మ సేన–ఆల్ ఉమెన్ గ్రూప్. భోజనాల తరువాత టేబుళ్లు, నేలను శానిటైజ్ చేస్తున్నారు. క్రిములు పెరగకుండా, వ్యాధులు వ్యాప్తి చెందకుండా, సహాయ శిబిరం చుట్టుపక్కల ప్లాస్టిక్, ఆహార వ్యర్థాలు కనిపించకుండా చూస్తున్నారు.
కేరళలో మొత్తం 1018 హరిత కర్మ సేన యూనిట్‌లు పని చేస్తున్నాయి. పట్టణప్రాంతాల్లో 4,678, గ్రామీణప్రాంతాల్లో 26, 546 మంది మహిళలు పనిచేస్తున్నారు. ‘వేస్ట్ ఫ్రీ కేరళ’ నినాదాన్ని భుజాల కెత్తుకున్న హరిత కర్మ సేన కలెక్టింగ్, ట్రాన్స్‌పోర్టింగ్, ప్రాసెసింగ్, రీసైకిలింగ్, వేస్ట్ మెటీరియల్స్ డిస్పోజల్ అండ్ మేనేజ్‌మెంట్‌కు సంబంధించి వివిధ సంస్థలతో కలిసి పనిచేస్తోంది. ‘సమాజానికి ఉపయోగపడే మంచి పని చేస్తున్నాను అనే భావన మనసులో ఉండడం వల్ల కావచ్చు ఎంత పని చేసినా శ్రమగా అనిపించదు’ అంటుంది హరిత కర్మ సేన సభ్యురాలు ఉద్విత.
Comments
Please login to add a commentAdd a comment