ప్రపంచశాంతికి యోగా
యోగాతో నేను నుంచి మనంకు ప్రయాణం
► సమాజంలో శాంతియుత సహజీవనం అవసరమన్న ప్రధాని
► కోయంబత్తూరులోఆదియోగి విగ్రహం ఆవిష్కరణ
సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రపంచమంతా శాంతిని కోరుకుంటోందని.. అందరూ కోరుకునే శాంతి యోగాతోనే సాధ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. శారీరక, మానసిక ఆరోగ్యాలకు యోగా పాస్‌పోర్టు వంటిదని చెప్పారు. కోయంబత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ ఈషా యోగా కేంద్రంలో 112 అడుగుల ఎత్తున్న నూతనంగా నిర్మించిన ‘ఆదియోగి’ విగ్రహాన్ని ప్రధాని మోదీ శుక్రవారం ఆవిష్కరించారు. ‘అందరూ ఆశిస్తున్న శాంతి యోగాతోనే సాధ్యం. యోగా కళను కాపాడుకోవడం ఎంతో అవసరం.
మనిషిలోని శక్తిని యోగా కాపాడుతుంది, జీవం నుంచి శివం వద్దకు తీసుకెళుతుంది. మనస్సు, శరీరం, అంతరాత్మలను ఏకం చేసి నేను అనే స్వార్థం నుంచి మనం అనే నిస్వార్థం వైపు మళ్లించి అందరినీ ఏకం చేస్తుంది. అహం నుంచి నిరహంకార స్థితికి తీసుకెళ్లి జీవాత్మను పరమాత్మగా మారుస్తుంది’ అని మోదీ తెలిపారు. యోగా మనిషిలో నైతిక విలువలను పెంచుతుందని ప్రధాని తెలిపారు.
శివుడు సర్వాంతర్యామి!
‘మహాదేవుడైన శివుడు సర్వాంతర్యామి. కాశీ నుంచి కోయంబత్తూరు వరకు ఆయన వ్యాపించి ఉన్నారు. ఇక్కడికి విగ్రహావిష్కరణకు ఎన్నో దేశాల నుంచి వివిధ సంప్రదాయాల వారు వచ్చినా అందరిలోని ఆధ్యాత్మికచింతన ఒక్కటే. శివుని మెడలో సర్పం, వినాయకుని వాహనం ఎలుక, సుబ్రహ్మణ్య స్వామి వద్ద నెమలి జన్మతః పరస్పరం శత్రువులు. అయితే శివైక్యం కావడం వల్ల అన్నీ కలిసి జీవిస్తున్నాయి. ఇదే భారతదేశంలోని శాంతియుత సహజీవనానికి నిదర్శనం.
భిన్నధృవాలు కలిగిన మనిషి కూడా విభేదాలు విస్మరించి ఆధ్యాత్మిక చింతనతో ఏకీకృతం కావాలి. పాత ఆలోచనల స్థానంలో కొత్త చింతనలను స్వాగతించడం మన సంప్రదాయం, వాటిని సంస్కరించుకుని దైనందిన జీవితంలోకి తెచ్చుకుంటున్నాం. శివరాత్రి పండగ.. ప్రకృతిని కాపాడుకోవటంతోపాటు ఈ ప్రకృతికి అనుగుణంగా మన కార్యాచరణను రూపొందించుకునే జాగరూకత స్ఫూర్తికి నిదర్శనం’ అని మోదీ అన్నారు.
ప్రకృతే దైవం
ప్రకృతి, దేవుడు ఒక్కటేనని ప్రధాని మోదీ అన్నారు. అందుకే మన పూర్వీకులు ఈ విషయాన్ని వివిధ రకాల ప్రకృతి ఆరాధన ద్వారా మనకు అందించారన్నారు. అప్పటికీ, ఇప్పటికీ యోగా పద్ధతులు మారాయని.. ఎన్ని మార్పులొచ్చినా యోగాలోని మాధుర్యం మాత్రం తగ్గలేదన్నారు. భవిష్యత్ తరాలు యోగాను అర్థం చేసుకుని ఆచరించేలా ప్రేరేపించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని ప్రధాని తెలిపారు. భిన్నత్వం ఘర్షణకు కారణం కాదని.. అదే మన సంస్కృతిలోని గొప్పదనమని ప్రధాని తెలిపారు.
మోదీకి నిరసన
దళితుల భూమిని లాక్కుని ఆదియోగి విగ్రహం నిర్మించారని, ఈ కార్యక్రమానికి మోదీ రాకను నిరసిస్తూ ఓ ఎన్జీవో ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నల్ల బెలూన్లను వదిలి నిరసన తెలిపారు. రోడ్లపై ఆందోళనకు దిగిన 500 మంది కార్యకర్తలను కోయంబత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాని మోదీ రైతులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని నిరసనకారులు నినాదాలు చేశారు.
మోదీ యోగా సాధన భేష్!
అంతకుముందు ఆదియోగి విగ్రహానికి ప్రధాని మోదీ హారతినిచ్చి పుష్పాంజలి ఘటించారు. ఆదియోగి విగ్రహాన్ని ఎనిమిది నెలల్లో నిర్మించినట్లు ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు జగ్గీ వాసుదేవ్ వెల్లడించారు. యోగాను నిత్యం సాధన చేసే మోదీని ఆయన ప్రశంసించారు. ధ్యానలింగ మండపంలో కాసేపు మోదీ యోగాసనంలో కూర్చున్నారు. ‘ఆదియోగ’ అనే పుస్తకాన్ని విడుదల చేశారు.
ఈ కార్యక్రమం సందర్భంగా యువకులు చేసిన యోగానృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అంతకుముందు, కోయంబత్తూరుకు చేరుకున్న మోదీకి తమిళనాడు గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు, ముఖ్యమంత్రి కే పళనిస్వామి స్వాగతం పలికారు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ , కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ , పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ, పలువురు బీజేపీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.