శివరాత్రి సాధనతో అణువణువునా ఆనందం | Playing definitely a pleasure to siva | Sakshi
Sakshi News home page

శివరాత్రి సాధనతో అణువణువునా ఆనందం

Published Thu, Feb 12 2015 11:06 PM | Last Updated on Mon, Oct 8 2018 7:04 PM

శివరాత్రి సాధనతో  అణువణువునా ఆనందం - Sakshi

శివరాత్రి సాధనతో అణువణువునా ఆనందం

సద్గురు  జగ్గీ వాసుదేవ్
 
సాక్షి పాఠకులకు నిత్యజీవితంలో ఎదురయ్యే వివిధ సమస్యలకు, ఆయా సందర్భాలలో కలిగే వివిధ సందేహాలకు సద్గురు జగ్గీవాసుదేవ్ సమాధానాలిస్తారు. మీరు చేయవలసిందల్లా మీ సందేహాలను స్పష్టంగా కవర్ లేదా పోస్ట్‌కార్డ్ మీద
రాసి పంపడమే!
 
చాంద్రమానం ప్రకారం అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశి నెలలోని మిగతా రాత్రుల కన్నా చిమ్మచీకటితో ఉండే రాత్రి.ఈ రాత్రిని శివరాత్రిగా పరిగణిస్తారు. మనం శివ అన్నప్పుడు, ఒక అంశంలో ఆదియోగి గురించి మాట్లాడుతున్నాం. ఇంకొక అంశంలో, శివ అంటే ఏదిలేదో అది అని అంటున్నాం. ఉన్నది అంటే సృష్టి. లేనిది అంటే శివ. సృష్టి అంతా శూన్యం నుండే వచ్చిందని ఈ రోజున ఆధునిక శాస్త్రం కూడా చెబుతోంది. ప్రతిదీ శూన్యం నుండి వచ్చి తిరిగి శూన్యంలోకి పోతుంది. శూన్యం అనేది సృష్టికి ఆధారం. అందుకని మనం శివుడిని సృష్టికి ఆధారంగా భావిస్తాం. అంటే ఏది లేదో అదే ఉన్నదానికి ఆధారం.

సృష్టి అతిసూక్ష్మమైనది. విస్తారమైన శూన్యం బ్రహ్మాండమైనది. సృష్టి అంతా శివుని ఒడిలో జరుగుతున్నట్లు మనం ఎప్పటి నుంచో చెబుతూ ఉన్నాము. మనం శివుడిని నల్లని వాడని పిలుస్తాం. విశేషమేమిటంటే, నేటి ఆధునిక శాస్త్రవేత్తలు కూడా జగత్తులో ప్రతీదానిని తనలో ఇముడ్చుకొని ఉంచుకునే దానిని ఒక అంధకార శక్తిగా అభివర్ణిస్తున్నారు. దానిని మరొకలాగా వర్ణించడానికి వీలులేక, దాని తత్వాన్ని గ్రహించలేక వారు దానిని ఒక అంధకార శక్తిగా పిలుస్తున్నారు. వారు శివ అనడం ఒక్కటే తక్కువ.

సంవత్సరంలోని 12 శివరాత్రులలో మహాశివరాత్రి చాలా విశిష్టమైనది. ఈ రాత్రి ఉత్తర భూగోళంలో మానవ వ్యవస్థలోని శక్తులు పయనించుటకు వీలుగా ఉంటాయి. ఈ రోజు మనం ఆధ్యాత్మికతలో పురోగమించడానికి, ఉన్నత శిఖరాలకు చేరడానికి ప్రకృతి పరిపూర్ణంగా సహకరిస్తుంది. దానిని ఉపయోగించుకొని ప్రయోజనం పొందటానికి మన సాంప్రదాయంలో ఈ పండుగను ఏర్పాటు చేశారు. ఇది రాత్రంతా జరుపుకునే పండుగ. మనం ఈ రాత్రంతా మేల్కొని, నడుము నిటారుగా ఉంచి స్థిరంగా కూర్చోవాలి. దానితో పాటు ఈ రోజు ఉప్పొంగే శక్తులను మరింతగా ఉపయోగించుకోడానికి యోగాలో ఒక సాధన ఉన్నది. అదే మంత్రసాధన.
 
మహాశక్తిమంతులను చేసే మంత్ర సాధన

ఈ మహాశివరాత్రి నాడు మనం ఒక మంత్రాన్ని ఉచ్చరిస్తాము. మనం మంత్రం అన్నప్పుడు మంత్రార్థం కంటే మంత్రమూలాన్ని తెలుసుకోవాలి.మంత్రమూలం శబ్ధం. శబ్ధం అంటే ‘ప్రకంపనలు’. ఆ ప్రకంపనలే మనకు ముక్తిని కలిగిస్తాయి. ఈ ప్రకంపనలే మనలను మన ప్రస్తుత శారీరక, మానసిక స్థితుల నుండి ఉన్నత శిఖరాలకు తీసుకు వెళతాయి. ఈ ప్రకంపనలే పంచేంద్రియాలకు అతీతమైన వాటిని మనం గ్రహించేలా చేస్తాయి. ఆ విధంగా అవి మనలను మోక్ష స్థానానికి తీసుకెళతాయి. ఈ మంత్రాలను కేవలం నోటితో ఉచ్చరిస్తే సరిపోదు. మన శరీరంలోని ప్రతి అణువూ ఈ మంత్రంతో నిండిపోవాలి. అపుడే మనకు దాని శక్తి ఏమిటో తెలుస్తుంది. నోటితో మాత్రమే మంత్రం ఉచ్చరిస్తే, కొంత ఆరోగ్యం, ఆనందం కలగవచ్చు. కాని మంత్రమహిమ నిజంగా తెలియాలంటే, మన శరీరంలోని అణువణువూ ఈ మంత్ర ప్రకంపనలతో నిండిపోవాలి. ఆ శక్తి మనలో ప్రతిధ్వనించాలి.

పళనిస్వామి అనే యోగి జీవితంలో జరిగిన సంఘటన ఇందుకు ఒక చక్కని ఉదాహరణ. ఆయన తన జీవితమంతా ‘శంభో’ అనే మంత్రసాధనతో గడిపేవాడు. అన్నివేళలా... ఆఖరకు కాలకృత్యాలు తీర్చుకునేటప్పుడు కూడా ‘శంభో’ అనే మంత్రోచ్చారణ చేయడం గమనించిన ఒకరు గ్రామ పెద్దలకు తెలియజేశారు. ఇది విని ఎంతో కోపగ్రస్థులైనగ్రామ పెద్దలు వెంటనే పళనిస్వామిని గ్రామసభకు పిలిచి ఇకపై ఆయన ‘శంభో’ అనే మంత్రాన్ని ఎక్కడా, ఎప్పుడూ ఉచ్చరించరాదని శాసించారు. ఆ మంత్రోచ్చారణకు ఆయన అనర్హుడని తీర్మానించారు. పళనిస్వామి ‘శంభో’ మంత్రోచ్చారణ మానివేశాడు. అయినా ‘శంభో’ శబ్ధం ఆగిపోలేదు. ఆ ప్రదేశమంతా ‘శంభో’ అన్న శబ్దంతో మారుమోగిపోయింది. పళనిస్వామి దేహంలోని అణువణువు నుండి బిగ్గరగా ‘శంభో’ మంత్రోచ్చారణ రాసాగింది. అపుడు వారు పళనిస్వామి పాదాలపై పడి, ‘ఇలాంటి నియమాలు సామాన్యులకే గానీ, మానవాతీతులైన మీకు కాదు. మీ ఇష్టం వచ్చినప్పుడు మంత్రోచ్చారణ చేసుకోండి’’ అని చెప్పారు. ఈ ఉదాహరణ వలన మన శరీరంలోని అణువణువూ మంత్రోచ్ఛారణతో నిండిపోతే, దాని శక్తి ఎలా ఉంటుందో తెలుస్తుంది.

ఈ మహాశివరాత్రి కేవలం జాగరణ రాత్రి కాకుండా, మిమ్మల్ని సచేతనత్వం, ఎరుకలతో నింపేది కావాలని, ప్రకృతి ఈ రోజు మనకు ఇచ్చే ఈ మహత్తర అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షిస్తాను. మీరందరూ ఈ రాత్రి మంత్ర సాధన చేసి, ఉప్పొంగే శక్తుల సహాయంతో ‘శివ’ అన్న శబ్దంలోని పారవశ్యాన్నీ, రమణీయతనూ తెలుసుకుంటారని ఆశిస్తాను.
 ప్రేమాశీస్సులతో,
 సద్గురు
 ఈశా ఫౌండేషన్ వారు ప్రతి సంవత్సరం బ్రహ్మాండంగా నిర్వహించే మహాశివరాత్రి వేడుకల్లో పాల్గొనాలనుకుంటే http://mahashivarathri.org/ ని సందర్శించండి!
 
 జగ్గీ వాసుదేవ్
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement