ఈ భాషలన్నీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కొట్టిన పిండి!
సాక్షి , కామారెడ్డి: ‘ఆ ఎమ్మెల్యే మరాఠీ మాట్లాడే గ్రామాలకు వెళ్లినప్పుడు కనిపించిన వారినల్లా ‘కసే అహత్’ అంటూ మరాఠీలో వారి యోగ క్షేమాలు తెలుసుకుంటారు. కన్నడ మాట్లాడే గ్రామాలకు వెళితే ‘నీవు హేగిద్దిరే’ అంటూ కన్నడలో మాట్లాడి వారి కష్టసుఖాలను కనుక్కుంటారు. అలాగే తెలుగు మాట్లాడే గ్రామాలకు వెళితే ‘బాగున్నరా..’ అంటూ తెలుగులో మాట్లాడతారు. ఆయనే బహు భాషల సమ్మేళనమైన కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం ఎమ్మెల్యే హన్మంత్ సింధే. ఆయనకు పలు భాషలు వచ్చు. అందుకే నియోజకవర్గంలో ఏ భాషవాళ్లు కలిస్తే వారి భాషలో మాట్లాడతారు. నియోజకవర్గంలో గిరిజనుల జనాభా కూడా ఎక్కువే. లంబాడీ భాషలో కూడా ఆయన అనర్గళంగా మాట్లాడతారు. అలాగే అధికారుల దగ్గరకు వెళ్లినపుడు ఇంగ్లీషు భాషను ఉపయోగిస్తారు. హిందీ మాట్లాడే అవకాశం ఉంటే హిందీలో మాట్లాడతారు.
మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న జుక్కల్ నియోజకవర్గంలో ప్రజలు తెలుగు, కన్నడ, మరాఠీ భాషలు మాట్లాడతారు. దీంతో అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా వారితో ఆయా భాషల్లో మాట్లాడాల్సిందే. ఇంజనీరింగ్ విద్యనభ్యసించిన ఎమ్మెల్యే హన్మంత్ సింధేకు తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషలతో పాటు కన్నడ, మరాఠీ భాషలు కూడా వచ్చు. దీంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు ఏ భాష మాట్లాడితే ఎమ్మెల్యే కూడా వారికి అర్థమయ్యే భాషలో మాట్లాడతారు. జుక్కల్ మండలంలోని సోపూర్ గ్రామం దాటితే కర్ణాటక రాష్ట్రం వస్తుంది. దీంతో జుక్కల్ మండలంలోని పలు గ్రామాల ప్రజలు చాలా వరకు కన్నడనే మాట్లాడతారు. అలాగే మద్నూర్, బిచ్కుంద మండలాల్లోని గ్రామాలు మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉంటాయి. ఇక్కడ చాలా వరకు మరాఠీ మాట్లాడుతారు. పలు గ్రామాల్లో మరాఠీ మీడియం స్కూళ్లు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.
ఇలా జుక్కల్ నియోజకవర్గం మూడు భాషల సంగమంలా ఉంటుంది. ఎమ్మెల్యే సింధే ఎన్నికల సమయంలో ప్రచారంతో పాటు గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రారంభోత్సవాలు చేయడానికి వెళ్లినప్పుడు అక్కడి ప్రజలకు అర్థమయ్యేలా కన్నడ, మరాఠీ భాషలు మాట్లాడుతారు. ప్రతి సభలో ఆయన మూడు భాషలలో మాట్లాడి ఆకట్టుకుంటారు. దీంతో ప్రజలు కూడా ఆయనంటే అభిమానం చూపిస్తారు. ఎమ్మెల్యే వివిధ భాషల్లో మాట్లాడడాన్ని కొత్తవారు ఆసక్తిగా చూస్తుంటారు.
చదవండి:
నభూతో నకాశీ.. మెప్పించిన చిత్రకళ
‘పల్లాను గెలిపిస్తే సీఎం గ్లాస్లో సోడా పోశాడు’