ఖైరతాబాద్ గణేశుడికి మల్లిబాబు లడ్డూ లేనట్లే!
వినాయక చవితి వస్తోందంటే చాలు.. జంటనగరాలతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చి ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకుంటారు. 58 అడుగుల ఎత్తుండే భారీ వినాయకుడి చేతిలో 6 టన్నుల వరకు బరువుండే అతిపెద్ద లడ్డూను చూసి మురిసిపోతారు. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం తాపేశ్వరం గ్రామానికి చెందిన మల్లిబాబు తయారుచేసే ఈ లడ్డూ.. ఇక మీదట ఖైరతాబాద్ గణేశుడికి రాబోదట. గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు ఈసారి స్థానికంగానే ఈ లడ్డూను తయారుచేయించాలని భావిస్తున్నట్లు సమాచారం. గత ఐదేళ్లుగా పీవీవీఎస్ మల్లికార్జున రావు (మల్లిబాబు) ఈ లడ్డూను తయారుచేసి, ఖైరతాబాద్ గణేశుడికి ఉచితంగా పంపుతున్నాడు. వేలాది మంది భక్తులు వచ్చి ఈ లడ్డూ ప్రసాదాన్ని తీసుకుంటారు. నిమజ్జనం రోజున నిర్వాహకులు దీన్ని పంచుతారు. గత సంవత్సరం మల్లిబాబు 6000 కిలోల (6 టన్నుల) లడ్డూ పంపారు. ఉత్సవ కమిటీ వాళ్లు వచ్చిన భక్తులను నియంత్రించలేకపోవడంతో ఎవరికి తోచినంత వాళ్లు పట్టుకుపోయారు. ఈసారి మల్లిబాబు నుంచి లడ్డూ తీసుకోవడం లేదని, దానికి బదులు ఇక్కడే చేయిస్తామని, అలాగే లడ్డూ బరువును కూడా 5 టన్నులే ఉంచాలని నిర్ణయించామని కమిటీ వ్యవస్థాపక సభ్యుడు సుదర్శన్ తెలిపారు. నగరం నుంచి గానీ, తెలంగాణ జిల్లాల నుంచి గానీ ఎవరైనా లడ్డూ స్పాన్సర్ చేస్తామంటే పరిశీలిస్తామని, తుది నిర్ణయం మాత్రం కమిటీయే తీసుకుంటుందని ఆయన అన్నారు.
2010లో మల్లిబాబు తొలిసారి 500 కిలోల లడ్డూ ఇచ్చారు. ప్రతియేటా బరువు పెంచుతున్నారు. 2011లో దాన్ని 2,400 కిలోలకు, 2015లో 6,000 కిలోలకు పెంచారు. 2013లో 5,000 కిలోల లడ్డూ ఇచ్చినా, భారీ వర్షం తర్వాత దాని మీద టార్పాలిన్ కప్పడంతో అది పాడైపోయింది. దాంతో లడ్డూను కూడా హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జన చేసేశారు. ఈ భారీ లడ్డూ తయారీకి మల్లిబాబుకు రూ. 18 లక్షలు ఖర్చవుతుంది. కమిటీ నిర్ణయం తనకు శరాఘాతంలా తగిలిందని మల్లిబాబు అన్నారు. ఇప్పటివరకు తనకు మాత్రం ఏమీ చెప్పలేదని, తనకు మాత్రం ఖైరతాబాద్ లడ్డూతో చాలా అనుబంధం ఉందని చెప్పారు. గణేశుడి ఆశీస్సులతో తన వ్యాపారం ప్రతియేటా రెట్టింపు అవుతోందని, ఇప్పుడు తనకు తూర్పుగోదావరి జిల్లాలో 200కు పైగా స్వీటు షాపులు ఉన్నాయని తెలిపారు. ఈసారి అమరావతి ప్రాంతంలో పెట్టే వినాయకుడికి భారీ లడ్డూ అందించే విషయమై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును సంప్రదిస్తానని అన్నారు.