మొదలైన ‘నైరుతి’ పురోగమనం
సాక్షి, అమరావతి: నైరుతి రుతుపవనాలు పురోగ మించడానికి అనువైన వాతావరణం నెలకొన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి గాలులు నిలకడగా ఉండడం, ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవులు, అండమాన్ సముద్రంలో వర్షాలు పడడం వల్ల రుతుపవనాల పురోగమనానికి అవకాశం ఏర్పడినట్లు పేర్కొంది.
ఈ నేపథ్యంలో రుతుపవనాలు వచ్చే 3, 4 రోజుల్లో దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవులు మరికొన్ని ప్రాంతాల్లో మరింత ముందుకు వెళ్లేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు తెలిపింది. వచ్చే 24 గంటల్లో రుతుపవనాలు ఈ ప్రాంతాల్లోనే కొంతవరకు విస్తరించే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో రుతుపవనాలు జూన్ మొదటి వారంలో కేరళలోకి ప్రవేశిస్తాయని అంచనా వేస్తున్నారు. అప్పటివరకు ఎండల తీవ్రత కొనసాగనుంది.
చాగలమర్రిలో 46.2 డిగ్రీల ఉష్ణోగ్రత
రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం ఎండల తీవ్రత ఉండగా రాయలసీమ జిల్లాల్లో దాని ప్రభావం ఎక్కువగా కనిపించింది. నంద్యాల జిల్లా చాగలమర్రిలో 46.2 డిగ్రీలు, వైఎస్సార్ జిల్లా సిద్ధవటంలో 45.2, పల్నాడు జిల్లా రొంపిచర్లలో 44.9 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
3 మండలాల్లో తీవ్రవడగాడ్పులు, 25 మండలాల్లో వడగాడ్పులు వీచినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శనివారం 23 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. గుంటూరు, ఎన్టీఆర్, పల్నాడు, వైఎస్సార్ జిల్లాల్లోని పలు మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు తెలిపింది. అక్కడక్కడ కొన్నిచోట్ల పిడుగులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.
విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయాన్ని సందర్శించిన తెలంగాణ అధికారి
తాడేపల్లిలోని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయాన్ని శుక్రవారం తెలంగాణలోని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ – డిజాస్టర్ మేనేజ్మెంట్ డైరెక్టర్ ఎన్.ప్రకాష్‌రెడ్డి సందర్శించారు. సంస్థ అవలంబిస్తున్న సాంకేతికతల గురించి ఎండీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆయనకు వివరించారు.
స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్లో 24/7 వాతావరణాన్ని పర్యవేక్షించే విధానాన్ని తెలిపారు. తుపాన్లు, వరదలు, వడగాలులు, భారీవర్షాలు, పిడుగుపాటు హెచ్చరిక సమాచారాన్ని జిల్లా యంత్రాంగానికి, ప్రజలకు పంపించే వ్యవస్థను వివరించారు. వాతావరణ పరిశోధన విభాగాల్లోని వివిధ అంశాలను ప్రకాష్‌రెడ్డి అడిగి తెలుసుకున్నారు.
ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వినియోగిస్తున్న టెక్నాలజీని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకాష్‌రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సి.నాగరాజు, వాతావరణ నిపుణులు ఎం.ఎం అలీ, ఇన్చార్జి సీహెచ్ శాంతిస్వరూప్ పాల్గొన్నారు.