junior linemen
-
ఉద్యోగాలు ఇప్పిస్తామంటే నమ్మొద్దు: రఘుమారెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ సంస్థలో ఉద్యోగాలు ఇప్పిస్తామని ప్రలోభాలకు గురిచేసి డబ్బులు వసూలు చేసే దళారులు, సంస్థ సిబ్బంది మాటలు నమ్మి మోసపోవద్దని అభ్యర్థులకు సంస్థ సీఎండీ రఘుమారెడ్డి సూచించారు. జూనియర్ లైన్మెన్ (జేఎల్ఎం) నియామకంలో నిర్ణిత అర్హతలు ఉండి, స్తంభాలు ఎక్కే (పోల్ క్లైంబింగ్) పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థుల నుంచి మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ అనుసరించి అత్యంత పారదర్శకంగా ఎంపిక జరుగుతుందని శనివారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. మెరిట్, రూల్ మాఫ్ రిజర్వేషన్స్‌ను ప్రామాణికంగా తీసుకుని అర్హులైన అభ్యర్థులకు ఈనెల 28 నుంచి వివిధ జిల్లా/సర్కిల్ కేంద్రాల్లో సర్టిఫికెట్స్ వెరిఫికేషన్, పోల్ క్లైంబింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని సంస్థ వెబ్సైట్లో పొందుపరిచామన్నారు. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో 1,553 జూనియర్ లైన్మెన్ పోస్టులకు ఈ ఏడాది నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. -
టీఎస్ఎస్పీడీసీఎల్లో 1,601 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు
సాక్షి, హైదరాబాద్: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్) 48 అసిస్టెంట్ ఇంజనీర్(ఎలక్ట్రికల్), 1,553 జూనియర్ లైన్మెన్ పోస్టుల భర్తీకి గురువారం వేర్వేరు నియామక ప్రకటనలు జారీ చేసింది. విద్యార్హతలు, వయోపరిమితి, దరఖాస్తుల స్వీకరణ తదితర వివరాలతో ఈ నెల 15 లేదా ఆ తర్వాత పూర్తి స్థాయి నియామక ప్రకటనను సంస్థ వెబ్సైట్ల(www.tssouthernpower.com లేదా tssouthern-power.cgg.gov.in)) లో పొందుపరచనున్నారు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హతలు కలిగిన వారు ఏఈ(ఎలక్ట్రికల్) పోస్టులకు అర్హులు కానున్నారు. జూనియర్ లైన్మెన్ పోస్టులకు పదో తరగతితోపాటు ఎలక్ట్రికల్/వైర్‌మెన్ ట్రేడ్లలో ఐటీఐ లేదా ఎలక్ట్రికల్ ట్రేడ్‌లో ఇంటర్ వొకేషనల్ కోర్సు చేసి ఉండాలి. గతేడాది 1,000 జేఎల్ఎం పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసి నిర్వహించిన రాతపరీక్షలో అక్రమాలు జరిగినట్టు గుర్తించడంతో ఆ నోటిఫికేషన్‌ను పూర్తిగా రద్దుచేశారు. కొత్తగా మళ్లీ నోటిఫికేషన్ జారీ చేస్తామని గతంలో ఇచ్చిన హామీ మేరకు పోస్టుల సంఖ్యను 1,553కి పెంచి తాజాగా సంస్థ యాజమాన్యం నోటిఫికేషన్ జారీ చేసింది. -
జూనియర్ లైన్మెన్ పేపర్ లీక్.. ఐదుగురు అధికారుల సస్పెన్షన్
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ జూనియర్ లైన్మెన్ పేపర్ లీక్‌పై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. లీక్‌లో ఐదుగురు విద్యుత్ అధికారులు ఉన్నట్లు ప్రభుత్వం తేల్చింది. వీరిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. చదవండి: తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు, జీహెచ్ఎంసీ అత్యవసర భేటీ దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో జూనియర్ లైన్ మెన్ పోస్టుల భర్తీ కోసం జులై 17,2022 న రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ రాత పరీక్షలో విద్యుత్ సంస్థలకు చెందిన ఐదు మంది ఉద్యోగుల ప్రమేయంతో మాల్ ప్రాక్టీస్ జరిగినట్లు తేలింది. మొహమ్మెద్ ఫిరోజ్ ఖాన్, సపావత్ శ్రీనివాస్, కేతావత్ దస్రు, షైక్ సాజన్, మంగళగిరి సైదులను ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది. -
వాళ్లుండాల్సింది ఫీల్డ్‌లోనే.. సచివాలయాల్లో కాదు..
సాక్షి, అమరావతి: గ్రామ సచివాలయ వ్యవస్థ అందుబాటులోకి వచ్చిన తర్వాత విద్యుత్ అంతరాయాలు 37.44% మేర తగ్గాయని ఇంధనశాఖ తెలిపింది. గ్రామ సచివాలయ వ్యవస్థలో పనిచేస్తున్న జూనియర్ లైన్మెన్లు రాష్ట్ర విద్యుత్ సంస్థల ఉద్యోగులేనని, వారికి డిస్కమ్‌లే వేతనాలు చెల్లిస్తున్నాయని స్పష్టం చేశారు. వాళ్లంతా సచివాలయాల్లో అందుబాటులో ఉండటం లేదన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. వాళ్లు ఫీల్డ్‌కు వెళ్లి పనిచేయాల్సిన అవసరం ఉంటుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నియమించిన 7 వేల మంది జూనియర్ లైన్మెన్ల పనితీరుపై వదంతుల నేపథ్యంలో ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ గురువారం మీడియాకు వాస్తవాలను వివరించారు. కరెంట్ పోతే క్షణాల్లో... ►జూనియర్ లైన్మెన్లకు గ్రామ సచివాలయంతో సంబంధం ఉన్నా.. విధివిధానాలన్నీ విద్యుత్ సంస్థల నిబంధనల మేరకే ఉంటాయి. ►ఒక్కో జూనియర్ లైన్మెన్కు 1500 విద్యుత్ కనెక్షన్ల నిర్వహణ బాధ్యత అప్పగించాం. 30 నుంచి 40 ట్రాన్స్ఫార్మర్లు పర్యవేక్షించాలి. 10 కి.మీ. పరిధి వరకు లైన్‌పై చెట్లు పడ్డా, జంపర్లు తెగిపోయినా వాళ్లే బాగుచేస్తారు. ►ట్రాన్స్ఫార్మర్ కాలిపోయినా, చెడిపోయినా, వినియోగదారుల మీటర్లు ఆగిపోయినా కొత్తవి బిగించడం వారి విధుల్లో భాగం. ►ఫీల్డ్‌లో పనిచేయడంతో గ్రామ సచివాలయానికి హాజరు కాలేకపోతున్నారు. ఈ కారణంగా వాళ్లు పనిచేయడం లేదనే ప్రచారం జరుగుతోంది. ఇది వాస్తవం కాదు. ►విద్యుత్‌కు సంబంధించిన ఏ సమస్య గ్రామ సచివాలయానికి వచ్చినా అధికారులు ఫోన్లో జూనియర్ లైన్మెన్ను సంప్రదిస్తారు. ఫిర్యాదు వచ్చిన వెంటనే కరెంట్ సమస్యలను పరిష్కరించాలి. దారికొచ్చిన అంతరాయాలు ►గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పడిన తర్వాత ఎక్కువ గంటలు కరెంట్ పోయిందనే ఫిర్యాదులు క్రమంగా తగ్గుతున్నాయి. 2018–19లో 6,98,189 విద్యుత్ అంతరాయాల ఫిర్యాదులొస్తే 2019–20లో వీటి సంఖ్య 4,36,781గా నమోదైంది. అంటే.. దాదాపు 2.60 లక్షల ఫిర్యాదులు తగ్గాయి. ప్రజలకు అందుబాటులో ఉంటున్నా.. ఐటీఐ పూర్తిచేసి ఎల్రక్టీషియన్‌గా ప్రైవేట్ పనులు చేసేవాడిని. గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసిన తర్వాత జూనియర్ లైన్‌మన్‌గా ఉద్యోగం వచ్చింది. విద్యుత్ సమస్య వస్తే గ్రామ సచివాలయం నుంచి ఫోన్లో మెసేజ్ వస్తోంది. వెంటనే ఫీల్డ్‌కు వెళ్లి విద్యుత్ అంతరాయాలు లేకుండా చూస్తున్నా. ఎక్కువ సమయం ఫీల్డ్‌లోనే ఉంటున్నా. గ్రామ సచివాలయానికి వెళ్లలేకపోతున్నా. –అజయ్‌కుమార్, జూనియర్ లైన్‌మన్, గోపినేనిపాలెం, వత్సవాయి మండలం, కృష్ణా జిల్లా -
ఎలక్ట్రీషియన్ల ప్రాణాలకు బాధ్యులెవరు?
సాక్షి, నిజామాబాద్: విద్యుత్‌శాఖలో పని చేస్తున్న ఉద్యోగులకు రూ.లక్షల్లో జీతాలు ఉన్నాయి. ఇతర శాఖల్లో లేని జీతాలు విద్యుత్ సంస్థలో ఉన్నాయి. జూనియర్ లైన్మెన్ నుంచి జిల్లాస్థాయి అధికారులకు వరకు జీతాలు సంతృప్తిగా కల్పించింది. కొంతమంది క్షేత్రస్థాయిలో సక్రమంగా పనులు చేయకుండా ప్రైవేట్ వ్యక్తులతో పనులు చేయించి కాలం వెళ్లదీస్తున్నారు. పైరవీలు, ఆమ్యాయాలు వచ్చేవి. ఉన్నచోట అందినకాడికి దండుకుంటూ క్షేత్రస్థాయిలో పని చేసేవారికి కూలీల మాదిరిగా చెల్లించి, దర్జాగా జీవనం సాగిస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఈ ఆనవాయితీ నడుస్తోంది. అకారణంగా కరెంట్ షాక్‌లతో మరణిస్తున్న ప్రైవేట్ ఎలక్ట్రిషీయన్‌లకు నిండా ముంచుతూ కుటుంబాలను రోడ్డున పడేస్తున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. మచ్చుకు కొన్ని సంఘటనలు.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని డీ–2 సెక్షన్ పరిధిలో ఎల్లమ్మగుట్ట కాలనీకి చెందిన షఫీ అనే వ్యక్తి ప్రైవేట్ ఎలక్ట్రిషీయన్‌గా పని చేస్తున్నాడు. ఈనెల 21న పోచమ్మగల్లీ ప్రాంతంలో విద్యుత్ స్తంభం ఎక్కి మరమ్మతులు చేస్తుండగా కిందపడి మరణించాడు. ఈ విషయంలో కరెంట్ షాక్ ఏ విధంగా తలిగింది, మరణానికి కారణాలు ఏంటి అనేదానిపై విచారణ చేయాల్సి ఉంది. సంబంధిత విద్యుత్‌శాఖ అధికారులు సైతం దీనిపై విచారణ చేస్తున్నామని చెప్పారు. పోలీస్ స్టేషన్లో మాత్రం నిజామాబాద్ ఒకటోటౌన్లో పోలీసు కేసు నమోదు చేశారు. నవీపేట్ మండలంలోని నాళేశ్వర్ గ్రామానికి చెందిన పోశెట్టి అనే మెకానిక్‌ను సంబంధిత లైన్మెన్ హైమద్ గత నెల 23న విద్యుత్ స్తంభానికి వీధిలైట్లు పెట్టేందుకు తీసుకెళ్లాడు. స్తంభంపై లైట్లు బిగిస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు కిందపడడంతో తీవ్ర గాయలపాలయ్యాడు. చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈనెల 19న మృతి చెందాడు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. అధికారిస్థాయి వరకూ అదే తీరు.. జిల్లాలో ఎక్కడ చూసినా విద్యుత్ మరమ్మతులు అధికారులకు తెలియకుండా కొంతమంది క్షేత్రస్థాయిలో ప్రైవేట్ ఎలక్ట్రిషీయన్‌లతో పనులు చేయిస్తున్నారు. కొంతమంది బయటకు పొక్కకుం డా నయానో భయానో సమర్పించి ప్రైవేట్ ఎలక్ట్రిషీయన్ల కుటుంబాల గొంతు నొక్కేస్తున్నా రు. ఈ తంతు కిందిస్థాయి సిబ్బంది నుంచి అధి కారిస్థాయి వరకు కొనసాగుతోంది. ఎవరి పనులు వారు చేస్తే ప్రైవేట్ ఎలక్ట్రిషీయన్లు మరణించే వారు కాదు. రెగ్యులర్ ఉద్యోగులు రూ.లక్షల్లో జీతాలు తీసుకుంటూ ప్రైవేట్ ఎల క్ట్రిషీయన్లతో పని చేయిస్తూ పబ్బం గడుపుతున్నారు. గ్రామాల్లో సైతం చాలా చోట్ల ప్రైవేట్ వ్యక్తులతో పనులు చేస్తున్న సంఘటనలు కొక్కొ ల్లలుగా ఉన్నాయి. పనులు చేయించుకోని కూలి డబ్బులు ఇచ్చి చేతులు దులిపేస్తున్నారు. ప్రమాద వశాత్తు మరణిస్తే వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నా యి. వారిని ఆదుకునేవారు కరువ య్యారు. విద్యుత్‌శాఖ రూ.5లక్షల నష్టపరిహారం ఇస్తోంది. పోలీసులు సైతం విచారణ చేపట్టాలి.. ప్రైవేట్ ఎలక్ట్రిషీయన్‌లతో విద్యుత్ సిబ్బంది పనులు చేయించుకుంటున్నారు. వారు మరణిస్తే మాత్రం సంబంధిత విద్యుత్ అధికారులు రంగంలోకి దిగి సిబ్బందికి అండగా ఉంటూ చిన్నపాటీ కేసులు నమోదు చేయించి మామ అనిపిస్తున్నారు. పోలీస్స్టేషన్లలో నమోదవుతున్న కేసుల విషయంలో లోతుగా విచారణ చేపట్టితే విద్యుత్ సిబ్బంది పాత్ర ఎంత వరకు ఉందో తెలుస్తుంది. నాలేశ్వర్ గ్రామంలో మరణించిన పోశెట్టి విషయంలో సంబంధిత లైన్మెన్పై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. డీ–2 సెక్షన్ పరిధిలో ఈనెల 19న మరణించి షఫీ విషయంలో ఎవరి పాత్ర ఎంతో ఉందో విచారణ చేయాలి. ఏ కారణం చేత విద్యుత్ స్తంభం ఎక్కాడో, ఎవరు ఫోన్ చేశారో అనే విషయాలపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టితే అసలు నిజాలు బయటకు వస్తాయి. ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం జిల్లాలో చాలా చోట్ల ప్రైవేట్ ఎలక్ట్రిషీయన్‌లతో క్షేత్రస్థాయిలో విద్యుత్ పనులు చేయిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. ప్రైవేట్ ఎక్ట్రిషీయన్లు విద్యుత్ మరమ్మతులు చేస్తుండగా మరణించడం బాధాకరం. మా విద్యుత్ సిబ్బంది ప్రైవేట్ వ్యక్తులతో పనులు చేయించవద్దు. ప్రైవేట్ ఎలక్ట్రిషీయన్లు సంబంధిత విద్యుత్ సిబ్బంది కారణంగా మరణించినట్లు ఫిర్యాదులు అందింతే శాఖపరమైన చర్యలు తీసుకుంటాం. అవసరమైతే పరిహారం సదురు ఉద్యోగుల జీతాల నుంచే చెల్లించేలా చూస్తాం. – సుదర్శనం, విద్యుత్‌శాఖ ఎస్ఈ -
కరెంట్ లైన్ ఉమెన్లు వస్తున్నారు!
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ శాఖ చరిత్రలో జూనియర్ లైన్మెన్(జేఎల్ఎం)గా మహిళలను సైతం నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. విధి నిర్వహణలో భాగంగా కనీసం 20 అడుగుల ఎత్తు ఉన్న విద్యుత్ స్తంభాలను అలవోకగా ఎక్కి మరమ్మతులు చేయడం జేఎల్‌ఎంల ప్రధాన బాధ్యత. కఠోర శారీరక శ్రమతో కూడి ఉండటంతో పాటు ప్రమాదకరమైన బాధ్యతలు గల ఈ వృత్తిని స్వీకరించేందుకు ఒకప్పుడు పురుషులూ ముందుకు రాకపోయేవారు. విద్యుత్ సంస్థలు ఇప్పటివరకు జేఎల్‌ఎంలుగా పురుష అభ్యర్థులనే నియమిస్తూ వస్తున్నాయి. తాజాగా జేఎల్ఎం పోస్టులకు మహిళా అభ్యర్థుల నుంచి అనూహ్య స్పందన లభించడం విద్యుత్ సంస్థల యాజమాన్యాలను పునరాలోచనలో పడేసింది. 2,553 జేఎల్ఎం పోస్టుల భర్తీకి ఉత్తర టీఎస్ఎన్పీడీసీఎల్ గత నెల 16న నోటిఫికేషన్ జారీ చేయగా, దరఖాస్తు గడువు ఈ నెల 19తో ముగియనుంది. 50 వరకు దరఖాస్తులు.. జేఎల్ఎం పోస్టులకు సుమారు 50 మంది వరకు మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, టీఎస్ఎన్పీడీసీఎల్ యాజమాన్యం తిరస్కరించింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన హుమేరా అంజుమ్‌తోపాటు మరో ఆరుగురు మహిళలు దరఖాస్తుల తిరస్కరణను వ్యతిరేకిస్తూ హై కోర్టును ఆశ్రయించారు. ఎంపిక ప్రక్రియలో పాల్గొనేందుకు అవకాశం కల్పించాలని హైకోర్టు ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఫలితాలను విడుదల చేయరాదని కోరింది. హైకోర్టు ఆదేశాలతో నియామక ప్రక్రియలో మహిళా అభ్యర్థుల దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. పోల్ క్లైంబింగ్లో విజయం సాధిస్తేనే.. నియామక ప్రక్రియలో భాగంగా తొలుత నిర్వహించే రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తదుపరిగా విద్యుత్ స్తంభాలను ఎక్కడంలో ఉన్న నైపుణ్యాన్ని పరీక్షించేందుకు శారీరక పరీక్షనూ నిర్వహించనున్నారు. పోల్ క్లైంబింగ్ పరీక్షలో విజయం సాధించిన అభ్యర్థులనే జేఎల్ఎం పోస్టులకు అర్హులుగా పరిగణిస్తారు. జేఎల్ఎం పోస్టుల భర్తీలో మహిళా అభ్యర్థులకు అనుకూలంగా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. విద్యుత్ సంస్థలు నియామక నిబంధనలను మార్చుకుని జేఎల్ఎం పోస్టుల భర్తీలో 33 1/3 శాతం మహిళా రిజర్వేషన్లను అమలు చేస్తాయా? అమలు చేస్తే పోస్టుల నియామకంలో భాగంగా మహిళా అభ్యర్థులు విద్యుత్ స్తంభం ఎక్కి అర్హతను నిరూపించుకోవాల్సిందేనా? లేక మినహాయింపు ఇస్తారా? అనే అంశాలపై విద్యుత్ సంస్థల యాజమాన్యాలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. హైకోర్టు తీర్పు ఆధారంగానే.. కోర్టు మధ్యంతర ఆదేశాల మేరకు ఏడుగురు పిటిషనర్ల దరఖాస్తులే స్వీకరించి నియామక ప్రక్రియలో పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తామని టీఎస్ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాల్‌రావు ‘సాక్షి’కి తెలిపారు. జూనియర్ లైన్మెన్లు విధి నిర్వహణలో భాగంగా విద్యుత్ స్తంభాలను ఎక్కాల్సి వస్తుందని, అందుకే మహిళా అభ్యర్థులను ఈ పోస్టులకు పరిగణనలోకి తీసుకోలేదని పేర్కొన్నారు. ఎప్పటిలాగా ఈ పోస్టుల భర్తీలో నిబంధనలను అనుసరిస్తున్నామని, హైకోర్టు తుది తీర్పు వచ్చే వరకు వేచి చూస్తామని తెలిపారు. -
విద్యుదాఘాతంతో జేఎల్ఎం మృతి
తండ్రి మరణంతో ఆరు నెలల క్రితమే ఉద్యోగంలో చేరిన సమీర్ హన్మకొండ అర్బన్ : విద్యుదాఘాతంతో ఓ జూనియర్ లైన్ మెన్ (జేఎల్ఎం)మృతి చెందాడు. ఈ సంఘటన శనివారం ఉదయం హన్మకొండ సుబేదారిలోని రామకృష్ణ కాలనీలో చోటు చేసుకుంది. బంధువులు కథనం ప్రకారం.. వరంగల్ చార్‌బౌలికి చెందిన ఎం.డీ.సమీర్‌సోయాబ్ (26) తన తండ్రి అబ్బాస్ ఆగస్టు్టలో మృతిచెందడంతో కారుణ్య నియమకంలో భాగంగా కాజీపేట సబ్‌స్టేన్ పరిధిలో జూనియర్ లైన్ మెన్ ద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం సుమారు 8 గంటలకు రామకృష్ణ కాలనీలో విద్యుత్ సరఫరా కావడం లేదని స్థానికులు సమాచారం ఇచ్చారు. దీంతో ఆయన కాలనీలోని విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ వద్ద ఫీజులు సరిచేసినా∙విద్యుత్ సరçఫరా కాలేదు. మరోసారి చెక్ చేస్తున్న క్రమంలో ఆకస్మాత్తుగా విద్యుత్ సరఫరా అయింది. దీంతో విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే స్థానికులు విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అధికారులు ట్రాన్స్ ఫార్మర్ వద్దకు చేరుకుని సుబేదారి పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతుడి తల్లి్లకి సమాచారం అందించారు. తల్లి్ల తస్లీం ఫిర్యాదు మేరకు పోస్టుమర్టం నిమిత్తం ఎంజీఎంకు తరలించి పంచనామ నిర్వహించారు. కాగా, సమీర్‌తో విద్యుత్ సమస్య ఉందని చెప్పితే వెంటనే పరిష్కారం కోసం ప్రయత్నించే వాడని స్థానికులు పేర్కొన్నారు. రాత్రి 11గంటలకు తల్లికి చివరి ఫోన్ అధికారులు ఇచ్చిన సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న సమీర్‌తల్లి తస్లీమా రోదనలు మిన్నంటాయి. రాత్రి 11గంలకు నాకు ఫోన్ చేసి తిన్నా అమ్మా.. అన్నావు...ఉదయం 10గంటలకు వస్తానన్నావు... నాకు చెప్పకుండా ఎందుకు వెళ్లావు బేటా... నువ్వులేని ఇంట్లో నేను ఎలా ఉండాలి ..ఇక నేనెవరి కోసం బతకాలంటూ రోదించిన తీరు అందరిని కంటతడి పెట్టించింది. ప్రమాదం ఎలా జరిగింది..? రామకృష్ణకాలనీలో శుక్రవారం ఒక ఇంట్లో శుభకార్యం జరిగింది. ఈ సందర్భంగా టెంట్ వేసే క్రమంలో కర్ర తగిలి విద్యత్ సరఫరాకు అంతరాయం జరిగిందని స్థానికులు తెలిపారు. విషయంపై ఎన్పీడీసీఎల్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆ సమయంలో శుక్రవారం నైట్‌డ్యూటీలో ఉన్న సమీర్ శనివారం ఉదయం మరమ్మతులు చేయడానికి వెళ్లాడు. ఈ సమయంలో సాధ్యమైనంత వరకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకునే పనులు చేస్తారు. అయితే సమీర్ షాక్‌కు గురైన సమయంలో పక్కనే ఉన్న 11కేవీ లైన్ కు విద్యుత్ సరఫరా అవుతున్నట్లు అధికారులు గుర్తించారు. దానికి సాంకేతిక లోపం వల్ల విద్యత్ సరఫరా అయిందా.. లేక హడావుడిలో బంద్ చేకుండా పనిచేయడం వల్ల ఇలా జరిగిందా అన్న విషయం తెలియలేదు. విద్యుదాఘాతంతో జేఎల్ఎం మృతి కాజీపేట : అధికారుల నిర్లక్ష్యంతో మృతి చెందిన జూనియర్ లైన్ మెన్ ఎండీ సమీర్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కాజీపేట ఆర్ఈసీ విద్యుత్ సబ్‌స్టేన్ ఎదుట సమీర్ బంధు, మిత్రులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై సమాచారం అందుకున్న కాజీపేట సీఐ రమేష్‌కుమార్ ఆందోళనకారులకు సభ్యులకు నచ్చ చెప్పడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. దీంతో ట్రాన్స్ కో ఏడీఈ మధుసూధన్ ఘటన స్థలానికి చేరుకుని సమీర్ కుటుంబానికి ప్రభుత్వం నుంచి సహాయం అందించడానికి డిపార్ట్మెంట్ సిద్ధంగా ఉందని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు.