సాక్షి, నిజామాబాద్: విద్యుత్‌శాఖలో పని చేస్తున్న ఉద్యోగులకు రూ.లక్షల్లో జీతాలు ఉన్నాయి. ఇతర శాఖల్లో లేని జీతాలు విద్యుత్ సంస్థలో ఉన్నాయి. జూనియర్ లైన్‌మెన్ నుంచి జిల్లాస్థాయి అధికారులకు వరకు జీతాలు సంతృప్తిగా కల్పించింది. కొంతమంది క్షేత్రస్థాయిలో సక్రమంగా పనులు చేయకుండా ప్రైవేట్ వ్యక్తులతో పనులు చేయించి కాలం వెళ్లదీస్తున్నారు. పైరవీలు, ఆమ్యాయాలు వచ్చేవి. ఉన్నచోట అందినకాడికి దండుకుంటూ క్షేత్రస్థాయిలో పని చేసేవారికి కూలీల మాదిరిగా చెల్లించి, దర్జాగా జీవనం సాగిస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఈ ఆనవాయితీ నడుస్తోంది. అకారణంగా కరెంట్ షాక్‌లతో మరణిస్తున్న ప్రైవేట్ ఎలక్ట్రిషీయన్‌లకు నిండా ముంచుతూ కుటుంబాలను రోడ్డున పడేస్తున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి.
మచ్చుకు కొన్ని సంఘటనలు..
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని డీ–2 సెక్షన్ పరిధిలో ఎల్లమ్మగుట్ట కాలనీకి చెందిన షఫీ అనే వ్యక్తి ప్రైవేట్ ఎలక్ట్రిషీయన్‌గా పని చేస్తున్నాడు. ఈనెల 21న పోచమ్మగల్లీ ప్రాంతంలో విద్యుత్ స్తంభం ఎక్కి మరమ్మతులు చేస్తుండగా కిందపడి మరణించాడు. ఈ విషయంలో కరెంట్ షాక్ ఏ విధంగా తలిగింది, మరణానికి కారణాలు ఏంటి అనేదానిపై విచారణ చేయాల్సి ఉంది. సంబంధిత విద్యుత్‌శాఖ అధికారులు సైతం దీనిపై విచారణ చేస్తున్నామని చెప్పారు. పోలీస్ స్టేషన్‌లో మాత్రం నిజామాబాద్ ఒకటోటౌన్‌లో పోలీసు కేసు నమోదు చేశారు. నవీపేట్ మండలంలోని నాళేశ్వర్ గ్రామానికి చెందిన పోశెట్టి అనే మెకానిక్‌ను సంబంధిత లైన్‌మెన్ హైమద్ గత నెల 23న విద్యుత్ స్తంభానికి వీధిలైట్లు పెట్టేందుకు తీసుకెళ్లాడు. స్తంభంపై లైట్లు బిగిస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు కిందపడడంతో తీవ్ర గాయలపాలయ్యాడు. చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈనెల 19న మృతి చెందాడు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి.
అధికారిస్థాయి వరకూ అదే తీరు..
జిల్లాలో ఎక్కడ చూసినా విద్యుత్ మరమ్మతులు అధికారులకు తెలియకుండా కొంతమంది క్షేత్రస్థాయిలో ప్రైవేట్ ఎలక్ట్రిషీయన్‌లతో పనులు చేయిస్తున్నారు. కొంతమంది బయటకు పొక్కకుం డా నయానో భయానో సమర్పించి ప్రైవేట్ ఎలక్ట్రిషీయన్‌ల కుటుంబాల గొంతు నొక్కేస్తున్నా రు. ఈ తంతు కిందిస్థాయి సిబ్బంది నుంచి అధి కారిస్థాయి వరకు కొనసాగుతోంది. ఎవరి పనులు వారు చేస్తే ప్రైవేట్ ఎలక్ట్రిషీయన్‌లు మరణించే వారు కాదు. రెగ్యులర్ ఉద్యోగులు రూ.లక్షల్లో జీతాలు తీసుకుంటూ ప్రైవేట్ ఎల క్ట్రిషీయన్‌లతో పని చేయిస్తూ పబ్బం గడుపుతున్నారు. గ్రామాల్లో సైతం చాలా చోట్ల ప్రైవేట్ వ్యక్తులతో పనులు చేస్తున్న సంఘటనలు కొక్కొ ల్లలుగా ఉన్నాయి. పనులు చేయించుకోని కూలి డబ్బులు ఇచ్చి చేతులు దులిపేస్తున్నారు. ప్రమాద వశాత్తు మరణిస్తే వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నా యి. వారిని ఆదుకునేవారు కరువ య్యారు. విద్యుత్‌శాఖ రూ.5లక్షల నష్టపరిహారం ఇస్తోంది.
పోలీసులు సైతం విచారణ చేపట్టాలి..
ప్రైవేట్ ఎలక్ట్రిషీయన్‌లతో విద్యుత్ సిబ్బంది పనులు చేయించుకుంటున్నారు. వారు మరణిస్తే మాత్రం సంబంధిత విద్యుత్ అధికారులు రంగంలోకి దిగి సిబ్బందికి అండగా ఉంటూ చిన్నపాటీ కేసులు నమోదు చేయించి మామ అనిపిస్తున్నారు. పోలీస్‌స్టేషన్‌లలో నమోదవుతున్న కేసుల విషయంలో లోతుగా విచారణ చేపట్టితే విద్యుత్ సిబ్బంది పాత్ర ఎంత వరకు ఉందో తెలుస్తుంది. నాలేశ్వర్ గ్రామంలో మరణించిన పోశెట్టి విషయంలో సంబంధిత లైన్‌మెన్‌పై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. డీ–2 సెక్షన్ పరిధిలో ఈనెల 19న మరణించి షఫీ విషయంలో ఎవరి పాత్ర ఎంతో ఉందో విచారణ చేయాలి. ఏ కారణం చేత విద్యుత్ స్తంభం ఎక్కాడో, ఎవరు ఫోన్ చేశారో అనే విషయాలపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టితే అసలు నిజాలు బయటకు వస్తాయి.
ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం
జిల్లాలో చాలా చోట్ల ప్రైవేట్ ఎలక్ట్రిషీయన్‌లతో క్షేత్రస్థాయిలో విద్యుత్ పనులు చేయిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. ప్రైవేట్ ఎక్ట్రిషీయన్‌లు విద్యుత్ మరమ్మతులు చేస్తుండగా మరణించడం బాధాకరం. మా విద్యుత్ సిబ్బంది ప్రైవేట్ వ్యక్తులతో పనులు చేయించవద్దు. ప్రైవేట్ ఎలక్ట్రిషీయన్‌లు సంబంధిత విద్యుత్ సిబ్బంది కారణంగా మరణించినట్లు ఫిర్యాదులు అందింతే శాఖపరమైన చర్యలు తీసుకుంటాం. అవసరమైతే పరిహారం సదురు ఉద్యోగుల జీతాల నుంచే చెల్లించేలా చూస్తాం.
– సుదర్శనం, విద్యుత్‌శాఖ ఎస్‌ఈ
Comments
Please login to add a commentAdd a comment