Private electrician
-
విద్యుత్ స్తంభంపైనే ఆగిన ఊపిరి
ఆదిలాబాద్ రూరల్: ఓ ఇంటికి విద్యుత్ సరఫరాలో సమస్య తలెత్తడంతో మరమ్మతులు చేసేందుకు కరెంట్ స్తంభం ఎక్కిన ప్రైవేటు ఎలక్ట్రీషియన్.. దానిపైనే షాక్‌కు గురై మృతిచెందాడు. ఆదిలాబాద్ జిల్లా రాములుగూడలో ఈ ఘటన జరిగింది. ఆదిలాబాద్ రూరల్ మండలం యాపల్‌గూడ గ్రామ పంచాయతీ పరిధిలోని రాములుగూడ గ్రామానికి చెందిన దడంజే మోతీరాం (35) కొన్నేళ్లుగా ప్రైవేట్ ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్నాడు. ఆదివారం ఓ ఇంటికి విద్యుత్ సరఫరా లేకపోవడంతో మోతీరాంను పిలిచారు. ఆయన వచ్చి సరఫరాను పునరుద్ధరించేందుకు విద్యుత్ స్తంభం ఎక్కాడు.అయితే పైనుంచి వెళ్తున్న త్రీఫేజ్ విద్యుత్ తీగలు తగలడంతో షాక్‌కుగురై అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మోతీరాం మృతితో ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు ఘటనాస్థలికి చేరుకుని ఆందోళన చేశారు. తమకు పరిహారం చెల్లించే వరకు మృతదేహాన్ని కిందకు దించొద్దని డిమాండ్ చేశారు. విద్యుత్ అధికారులు అక్కడికి రావడం ఆలస్యం కావడంతో మోతీరాం మృతదేహం స్తంభంపైనే నాలుగు గంటలపాటు ఉండిపోయింది. పోలీసులు, విద్యుత్ అధికారులు బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.మోతీరాం కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా మోతీరాం మృతికి.. తమకు ఎలాంటి సంబంధం లేదని మండల విద్యుత్ శాఖ అధికారి తిరుపతిరెడ్డి తెలిపారు. విద్యుత్ స్తంభంపైకి ఎక్కిన మోతీరాం తమ లైన్‌మన్, జూనియర్ లైన్‌మన్‌కు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని పేర్కొన్నారు. -
ఎలక్ట్రీషియన్ల ప్రాణాలకు బాధ్యులెవరు?
సాక్షి, నిజామాబాద్: విద్యుత్‌శాఖలో పని చేస్తున్న ఉద్యోగులకు రూ.లక్షల్లో జీతాలు ఉన్నాయి. ఇతర శాఖల్లో లేని జీతాలు విద్యుత్ సంస్థలో ఉన్నాయి. జూనియర్ లైన్మెన్ నుంచి జిల్లాస్థాయి అధికారులకు వరకు జీతాలు సంతృప్తిగా కల్పించింది. కొంతమంది క్షేత్రస్థాయిలో సక్రమంగా పనులు చేయకుండా ప్రైవేట్ వ్యక్తులతో పనులు చేయించి కాలం వెళ్లదీస్తున్నారు. పైరవీలు, ఆమ్యాయాలు వచ్చేవి. ఉన్నచోట అందినకాడికి దండుకుంటూ క్షేత్రస్థాయిలో పని చేసేవారికి కూలీల మాదిరిగా చెల్లించి, దర్జాగా జీవనం సాగిస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఈ ఆనవాయితీ నడుస్తోంది. అకారణంగా కరెంట్ షాక్‌లతో మరణిస్తున్న ప్రైవేట్ ఎలక్ట్రిషీయన్‌లకు నిండా ముంచుతూ కుటుంబాలను రోడ్డున పడేస్తున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. మచ్చుకు కొన్ని సంఘటనలు.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని డీ–2 సెక్షన్ పరిధిలో ఎల్లమ్మగుట్ట కాలనీకి చెందిన షఫీ అనే వ్యక్తి ప్రైవేట్ ఎలక్ట్రిషీయన్‌గా పని చేస్తున్నాడు. ఈనెల 21న పోచమ్మగల్లీ ప్రాంతంలో విద్యుత్ స్తంభం ఎక్కి మరమ్మతులు చేస్తుండగా కిందపడి మరణించాడు. ఈ విషయంలో కరెంట్ షాక్ ఏ విధంగా తలిగింది, మరణానికి కారణాలు ఏంటి అనేదానిపై విచారణ చేయాల్సి ఉంది. సంబంధిత విద్యుత్‌శాఖ అధికారులు సైతం దీనిపై విచారణ చేస్తున్నామని చెప్పారు. పోలీస్ స్టేషన్లో మాత్రం నిజామాబాద్ ఒకటోటౌన్లో పోలీసు కేసు నమోదు చేశారు. నవీపేట్ మండలంలోని నాళేశ్వర్ గ్రామానికి చెందిన పోశెట్టి అనే మెకానిక్‌ను సంబంధిత లైన్మెన్ హైమద్ గత నెల 23న విద్యుత్ స్తంభానికి వీధిలైట్లు పెట్టేందుకు తీసుకెళ్లాడు. స్తంభంపై లైట్లు బిగిస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు కిందపడడంతో తీవ్ర గాయలపాలయ్యాడు. చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈనెల 19న మృతి చెందాడు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. అధికారిస్థాయి వరకూ అదే తీరు.. జిల్లాలో ఎక్కడ చూసినా విద్యుత్ మరమ్మతులు అధికారులకు తెలియకుండా కొంతమంది క్షేత్రస్థాయిలో ప్రైవేట్ ఎలక్ట్రిషీయన్‌లతో పనులు చేయిస్తున్నారు. కొంతమంది బయటకు పొక్కకుం డా నయానో భయానో సమర్పించి ప్రైవేట్ ఎలక్ట్రిషీయన్ల కుటుంబాల గొంతు నొక్కేస్తున్నా రు. ఈ తంతు కిందిస్థాయి సిబ్బంది నుంచి అధి కారిస్థాయి వరకు కొనసాగుతోంది. ఎవరి పనులు వారు చేస్తే ప్రైవేట్ ఎలక్ట్రిషీయన్లు మరణించే వారు కాదు. రెగ్యులర్ ఉద్యోగులు రూ.లక్షల్లో జీతాలు తీసుకుంటూ ప్రైవేట్ ఎల క్ట్రిషీయన్లతో పని చేయిస్తూ పబ్బం గడుపుతున్నారు. గ్రామాల్లో సైతం చాలా చోట్ల ప్రైవేట్ వ్యక్తులతో పనులు చేస్తున్న సంఘటనలు కొక్కొ ల్లలుగా ఉన్నాయి. పనులు చేయించుకోని కూలి డబ్బులు ఇచ్చి చేతులు దులిపేస్తున్నారు. ప్రమాద వశాత్తు మరణిస్తే వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నా యి. వారిని ఆదుకునేవారు కరువ య్యారు. విద్యుత్‌శాఖ రూ.5లక్షల నష్టపరిహారం ఇస్తోంది. పోలీసులు సైతం విచారణ చేపట్టాలి.. ప్రైవేట్ ఎలక్ట్రిషీయన్‌లతో విద్యుత్ సిబ్బంది పనులు చేయించుకుంటున్నారు. వారు మరణిస్తే మాత్రం సంబంధిత విద్యుత్ అధికారులు రంగంలోకి దిగి సిబ్బందికి అండగా ఉంటూ చిన్నపాటీ కేసులు నమోదు చేయించి మామ అనిపిస్తున్నారు. పోలీస్స్టేషన్లలో నమోదవుతున్న కేసుల విషయంలో లోతుగా విచారణ చేపట్టితే విద్యుత్ సిబ్బంది పాత్ర ఎంత వరకు ఉందో తెలుస్తుంది. నాలేశ్వర్ గ్రామంలో మరణించిన పోశెట్టి విషయంలో సంబంధిత లైన్మెన్పై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. డీ–2 సెక్షన్ పరిధిలో ఈనెల 19న మరణించి షఫీ విషయంలో ఎవరి పాత్ర ఎంతో ఉందో విచారణ చేయాలి. ఏ కారణం చేత విద్యుత్ స్తంభం ఎక్కాడో, ఎవరు ఫోన్ చేశారో అనే విషయాలపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టితే అసలు నిజాలు బయటకు వస్తాయి. ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం జిల్లాలో చాలా చోట్ల ప్రైవేట్ ఎలక్ట్రిషీయన్‌లతో క్షేత్రస్థాయిలో విద్యుత్ పనులు చేయిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. ప్రైవేట్ ఎక్ట్రిషీయన్లు విద్యుత్ మరమ్మతులు చేస్తుండగా మరణించడం బాధాకరం. మా విద్యుత్ సిబ్బంది ప్రైవేట్ వ్యక్తులతో పనులు చేయించవద్దు. ప్రైవేట్ ఎలక్ట్రిషీయన్లు సంబంధిత విద్యుత్ సిబ్బంది కారణంగా మరణించినట్లు ఫిర్యాదులు అందింతే శాఖపరమైన చర్యలు తీసుకుంటాం. అవసరమైతే పరిహారం సదురు ఉద్యోగుల జీతాల నుంచే చెల్లించేలా చూస్తాం. – సుదర్శనం, విద్యుత్‌శాఖ ఎస్ఈ -
కాటేసిన కరెంట్
డిచ్పల్లి, న్యూస్‌లైన్: డిచ్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఘన్పూర్ గ్రామంలో సోమవారం రాత్రి విద్యుత్ స్తంభం ఎక్కిన యువకుడు విద్యుదాఘాతానికి గురై స్తంభంపైనే మృతిచెందాడు. ప్రత్యక్ష సాక్షులు, స్థాని కుల వివరాల ప్రకారం... మండల వ్యవసాయశాఖలో పనిచేసే కిషన్ ఇంట్లో విద్యుత్ సర ఫరాలో అంతరాయం ఏర్పడింది. దీంతో స్థానిక జేఎల్ఎంకు ఆయ న ఫోన్ చేశాడు. జేఎల్ఎం స్తంభం ఎక్కి విద్యుత్ సరఫరా సరిచేయాల్సి ఉండగా, స్థానిక యువ కుడు, ప్రైవేటు ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న హమాలీ శ్రీనివాస్ (23)ను పిలిచి స్తంభంపైకి ఎక్కించాడు. సబ్‌స్టేషన్ నుంచి ఎల్సీ తీసుకుని స్తంభం ఎక్కి విద్యుత్ సర్వీస్ వైరును సరిచేస్తుం డగా, అదే స్తంభానికి పైనున్న 11 కేవీ విద్యుత్ వైర్లు శ్రీనివాస్ చేతికి తగిలి విద్యుదాఘాతానికి గురయ్యాడు. దీంతో కిందనున్న విద్యుత్ వైర్లపై పడి విలవిల్లాడుతూ కొట్టుకోసాగాడు. వెంటనే స్థానికులు గమనించి ట్రాన్స్‌కో అధికారులకు సమాచారం అందజేశారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో సంఘటన స్థలానికి చేరుకున్నారు. ట్రాన్స్‌కో అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో శ్రీనివాస్ మృతదేహాన్ని కిందికి దించారు. అప్పటికే అక్కడికి చేరుకున్న 108 సిబ్బంది శ్రీనివాస్‌లో ప్రాణం ఉందేమోనని ప్రయత్నించినా లాభం లేకపోయింది. వేలాది రూపాయలు జీతం తీసుకుంటున్న ట్రాన్స్‌కో సిబ్బంది తాము చేయాల్సిన పనిని ఇతరుల చేత చేయిస్తూ అమాయకుల ప్రాణాలతో ఆటలాడుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న ఎస్సై చంద్రశేఖర్ ఘటనా స్థలం వద్దకు చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. ట్రాన్స్‌కో ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి వచ్చి తగిన నష్టపరిహారం ఇవ్వాలని, అప్పటి వరకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించేది లేదని బాధిత కుటుంబీకులు, గ్రామస్తులు అందోళనకు దిగారు. పది రోజుల క్రితమే మృతుడి తండ్రి హమాలీ సాయిలు అనారోగ్యంతో మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపారు.అంతలోనే కొడుకు మృతిచెందడంతో ఆ కుటుం బంలో పుట్టెడు విషాదం నెలకొంది. శ్రీనివాస్‌కు తల్లి భూదవ్వ, అన్న సాగర్, అక్కలు సుమలత, కళావతి ఉన్నారు.