దీపిక ‘హ్యాట్రిక్’
మస్కట్ (ఒమన్): జూనియర్ మహిళల ఆసియా కప్ హాకీ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు వరుసగా రెండో విజయం నమోదు చేసింది. మలేసియా జట్టుతో సోమవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ రెండో లీగ్ మ్యాచ్‌లో జ్యోతి సింగ్ నేతృత్వంలోని భారత జట్టు 5–0 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. భారత్ తరఫున ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దీపిక మూడు గోల్స్‌తో ‘హ్యాట్రిక్’ నమోదు చేసింది. దీపిక 37వ, 39వ, 48వ నిమిషాల్లో గోల్స్ చేసింది. వైష్ణవి ఫాల్కే (32వ నిమిషంలో), కనిక సివాచ్ (38వ నిమిషంలో) ఒక్కో గోల్ అందించారు. మ్యాచ్ మొత్తంలో భారత జట్టుకు ఎనిమిది పెనాల్టీ కార్నర్లు... రెండు పెనాలీ స్ట్రోక్‌లు లభించాయి. ఇందులో మూడు పెనాల్టీ కార్నర్లను, ఒక పెనాల్టీ స్ట్రోక్‌ను భారత జట్టు గోల్స్‌గా మలిచింది. మిగతా ఐదు పెనాల్టీ కార్నర్లను, మరో పెనాల్టీ స్ట్రోక్‌ను భారత్ లక్ష్యానికి చేర్చి ఉంటే విజయం తేడా మరింత భారీగా ఉండేది. మరో మ్యాచ్‌లో దక్షిణ కొరియా 7–2 గోల్స్ తేడాతో చైనీస్ తైపీ జట్టును ఓడించింది. ఐదు జట్లున్న గ్రూప్ ‘ఎ’లో రెండేసి విజయాలు సాధించిన భారత్, చైనా జట్ల ఖాతాలో ఆరు పాయింట్ల చొప్పున ఉన్నాయి. అయితే చైనా చేసిన గోల్స్ (27) సంఖ్యకంటే భారత్ చేసిన గోల్స్ (17) తక్కువగా ఉండటంతో చైనా టాప్ ర్యాంక్‌లో, భారత్ రెండో ర్యాంక్‌లో ఉన్నాయి. బుధవారం జరిగే మూడో లీగ్ మ్యాచ్‌లో చైనాతో భారత్ తలపడుతుంది.