టీఆర్ఎస్ నేత ఘరానా మోసం
కరీంనగర్: తన కొడుక్కు ఉద్యోగం కోసం ఓ టీఆర్ఎస్ నాయకుడి చుట్టూ తిరిగాడు.. అడిగినంత డబ్బు కూడా ముట్టజెప్పాడు.. ఎంతకూ ఉద్యోగం రాకపోవడంతో చివరకు మోసపోయానని తెలుసుకున్నాడు.. దీంతో అతను గుండెపోటుతో మృతిచెందాడు. ఈ హృదయ విదారక సంఘటన కరీంనగర్ నగరంలోని జ్యోతినగర్లో చోటుచేసుకుంది. వన్నారంనకు చెందిన కొప్పుల సత్యనారాయణ కొడుకు బీఎస్సీ(అగ్రికల్చరల్) చదివి ఉద్యోగం లేక ఖాళీగా ఉంటున్నాడు. దాంతో అతనికి ఉద్యోగం వేయించాలని టీఆర్ఎస్ నాయకుడు జూపాక సుదర్శన్ చుట్టూ తిరిగాడు. అతడు రూ.5 లక్షలు అడిగాడు.
నాలుగు లక్షలు ఇచ్చినా ఎంతకూ ఉద్యోగం వేయించకపోవడంతో మోసపోయామని తెలుసుకున్నాడు. మనోవేదన చెందిన అతను చివరకు గుండెపోటుతో ఆదివారం రాత్రి మృతిచెందాడు. కాగా, సత్యనారాయణ మృతికి కారణమంటూ సుదర్శన్ ఇంటిముందు శవంతో మృతుని కుటుంబీకులు, బంధువులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఈ వ్యవహారంపై ఆరా తీస్తున్నారు.