తప్పిన ముంపు!
►మారనున్న జూరాల డిజైన్
►శ్రీశైలం నుంచి కృష్ణాజలాలు
►8 ముంపు గ్రామాలకు విముక్తి
►గండేడ్‌లో రిజర్వాయర్ లేనట్లే!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు ముంపు గ్రామాలకు శుభవార్త. జూరాల నుంచి కృష్ణాజలాలను తరలించాలనే ప్రతిపాదనను ప్రభుత్వం పక్కనపెట్టింది. శ్రీశైలం నుంచి వరద నీటిని తీసుకురావాలనే కొత్త ప్రతిపాదనను తెరమీదకు తెచ్చింది. దీంతో గతంలో జూరాల ప్రాజెక్టుతో ముంపు బారిన పడే అవకాశమున్న ఎనిమిది గ్రామాలకు ఊరట లభించింది. యేటా సగటున 25 రోజులపాటు దాదాపు వరద సమయంలో 70 టీఎంసీల నీరు దిగువకు తరలిస్తుండడంతో ఈ జలాలను రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల సాగు, తాగునీటి అవసరాలను తీర్చడానికి ఉపయోగించాలని నీటి పారుదల శాఖ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.
ఈ ప్రతిపాదనను పరిశీలించిన తెలంగాణ ప్రభుత్వం కూడా డిజైన్‌కు దాదాపుగా ఆమోదముద్ర వేసే సమయంలో ముంపు ప్రభావిత గ్రామాల్లో నిర్వాసితుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడం.. ఒకరిద్దరు రైతులు చనిపోవడంతో పునరాలోచనలో పడింది. ఈ నేపథ్యంలో ముంపును తగ్గించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించింది. ఈ క్రమంలోనే తాజాగా శ్రీశైలం నుంచి పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీటిని తీసుకురావాలనే నిర్ణయానికి వచ్చింది. గతంలో ప్రతిపాదించిన ఆయకట్టులో ఎలాంటి మార్పు లేకపోయినా.. ముంపు గ్రామాలకు మాత్రం మినహాయింపు లభించింది.
2.84 లక్షల ఎకరాల స్థిరీకరణ!
తాజా డిజైన్‌తో జిల్లాలో 2.84 లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత డిజైన్ చేసిన గండేడ్ రిజర్వాయర్ నిర్మాణ ప్రతిపాదనను తాజాగా ఉపసంహరించుకుంది. దీంతో ఈ రిజర్వాయర్ వల్ల మునిగే 8 గ్రామాలకు ఓదార్పు లభించింది. సాల్వీడ్, ఘనాపూర్, అంతారం, పుట్టపహాడ్, పెద్దవార్వాల్, చిన్నవార్వాల్, రుసుంపల్లి, గాదిర్యాల్ గ్రామాలకు ముంపు నుంచి విముక్తి కలుగనుంది. అలాగే ఈ ప్రాంతంలో ముంపు బారిన పడే 14 వేల ఎకరాలు కొత్త ఆయకట్టు పరిధిలోకి రానున్నాయి.
కాగా, వట్టెం, కార్వేనిలో కొత్తగా రిజర్వాయర్లను నిర్మించాలని నీటిపారుదలశాఖ నిర్ణయించింది. దీనివల్ల ముంపు ప్రభావం గతంతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుందని తేల్చిచెప్పింది. అయితే ఈ నెల 25న దీనిపై సమగ్ర నివేదిక వచ్చాకే ముంపు ప్రాంతం, ఆయకట్టు మార్పులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇదిలావుండగా, కొందురు మండలం లక్ష్మీదేవిపల్లిలో ప్రతిపాదించిన రిజర్వాయర్ నిర్మాణంలో మార్పులుండకపోవచ్చని నీటిపారుదలశాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు.