పార్టీల ఆఫీసుల్లో పెళ్లిళ్లు చేయొద్దు: కేరళ హైకోర్టు
కొచ్చి: రాజకీయ పార్టీల కార్యాలయాల్లో జరిగే పెళ్లిళ్లను చట్టప్రకారమైనవిగా అంగీకరించబోమని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ ఆంటోనీ డొమినిక్, జస్టిస్ అనిల్ కె నరేంద్రన్లతో కూడిన బెంచ్ ఈ మేరకు రూలింగ్ ఇచ్చింది. తన కూతురి ఆచూకీ కోసం ఓ తండ్రి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ను విచారించిన న్యాయస్థానం ఈ ఆదేశాలు వెలువరించింది.
ఫిర్యాదుదారుడి కుమార్తె ఫిబ్రవరి 10 నుంచి కనిపించకుండా పోయింది. కుట్టానాడ్ ప్రాంతంలోని నెడిముడిలో ఉన్న స్థానిక సీపీఎం పార్టీ కార్యాలయంలో 19న ఆమె పెళ్లి చేసుకుంది. దీనిపై యువతి తండ్రి కోర్టును ఆశ్రయించారు. రాజకీయ పార్టీల ఆఫీసుల్లో జరిగే వివాహాలను అంగీకరించబోమని న్యాయస్థానం స్పష్టం చేసింది. వీటిని చట్టవిరుద్ధమైనవిగా పరిగణిస్తామని పేర్కొంది.