‘మధ్యవర్తిత్వం’తోనే సత్వర న్యాయం
ఖర్చు అసలే ఉండదు.. సమయం ఆదా: జస్టిస్ చంద్రయ్య
సాక్షి, హైదరాబాద్: సత్వర న్యాయం పొందేందుకు మధ్యవర్తిత్వమే అత్యుత్తమ పరిష్కార మార్గమని, దీనిని కక్షిదారులందరూ వినియోగించుకోవాలని హైకోర్టు న్యాయమూర్తి, తెలంగాణ న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ జి.చంద్రయ్య కోరారు. ఏళ్ల తరబడి పరిష్కారానికి నోచుకోని ఎన్నో కేసులు మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారం అయ్యాయని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుత తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ దిలీప్ బి.బొసాలే పేదలపాలిట ఆశాదీపమని, మధ్యవర్తిత్వాన్ని ప్రోత్సహించేందుకు ఆయన నేతృత్వంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. మంగళవారం హైకోర్టులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ న్యాయసేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి ఎ.వెంకటేశ్వరరెడ్డి కూడా పాల్గొన్నారు.
మధ్యవర్తిత్వాన్ని ప్రోత్సహించేందుకు న్యాయసేవాధికార సంస్థ తీసుకుంటున్న చర్యలను జస్టిస్ చంద్రయ్య వివరించారు. మధ్యవర్తిత్వం ద్వారా కక్షిదారులపై ఎటువంటి ఆర్థికభారం పడదని, అంతేకాక పరిష్కారం త్వరతగతిన,సామరస్యపూర్వకంగా లభిస్తుందన్నారు. న్యాయవాదులు లేనప్పుడు కక్షిదారులే స్వయంగా మధ్యవర్తిత్వం ద్వారా కేసులను పరిష్కరించుకోవచ్చునన్నారు. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై నగరాల్లో మధ్యవర్తిత్వం విజయవంతమైందని వివరించారు. మధ్యవర్తులుగా వ్యవహరించే వ్యక్తులకు మధ్యవర్తిత్వం - రాజీ ప్రాజెక్టు కమిటీ శిక్షణ ఇచ్చిందని, తెలంగాణలో 162 శిక్షణ పొందిన మధ్యవర్తులు, 15 మంది జడ్జీలు ఉన్నారని ఆయన తెలిపారు. మధ్యవర్తులకు శిక్షణ ఇచ్చేందుకు కొందరు వ్యక్తులను ఎంపిక చేసి ఢిల్లీలో శిక్షణ ఇప్పించడం జరిగిందన్నారు. అపరిష్కృతంగా ఉన్న కేసులను లోక్ అదాలత్‌ల ద్వారా కూడా పరిష్కరించుకోవచ్చునని, ఇందుకు కక్షిదారులు పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేదన్నారు.