‘మిషన్ కాకతీయ’ చరిత్రాత్మకం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో చెరువుల పునరుద్ధరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘మిషన్ కాకతీయ’ కార్యక్రమానికి హైకోర్టు కితాబునిచ్చింది. ఈ కార్యక్రమం చరిత్రాత్మకమైందని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ నూతి రామ్మోహనరావు, జస్టిస్ బి.శివశంకరరావులతో కూడిన ధర్మాసనం అభివర్ణించింది. ఈ కార్యక్రమాన్ని 30 ఏళ్ల క్రితమే చేపట్టాల్సి ఉందన్న ధర్మాసనం, ఇప్పటికైనా యుద్ధ ప్రాతిపదికన ఈ కార్యక్రమాన్ని చేపట్టి నిరాటంకంగా పనులు సాగి స్తున్న తెలంగాణ ప్రభుత్వాన్ని తాము అభినందిస్తున్నామంది.
గతంలోనే ఇటువంటి కార్యక్రమం చేపట్టి ఉన్నట్లయితే.. ఎన్నో చెరువులు కబ్జా బారిన పడకుండా ఉండేవని, అలాగే కాలుష్యం బారిన పడకుండా ఉండేవని ధర్మాసనం పేర్కొంది. ప్రతి సం వత్సరం వాతావరణపరిస్థితుల్లో తీవ్ర మార్పులు చోటు చేసుకుంటున్నాయని, వానాకాలంలో కూడా వర్షాలు పడని పరిస్థితులను చూడాల్సి వస్తోందని వ్యాఖ్యానిం చింది. రాబోయే కాలంలో జల వనరుల విషయంలో గడ్డు పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుందని, వాటిని అధిగమించాలంటే మిషన్ కాకతీయ వంటి కార్యక్రమాల ద్వా రా చెరువులకు జీవకళ తీసుకురావాలని అభిప్రాయపడింది.
రోజు రోజుకూ అడుగంటిపోతున్న భూగర్భ జలాలను పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని వేగవంతం చేసి, చెరువులు, నీటి కుంటలు నీటితో కళకళలాడేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇదే సమయంలో కబ్జా చెరలో ఉన్న చెరువులు, నీటి కుంటలకు విముక్తి కలిగించాలని, అప్పుడే మిషన్ కాకతీయ లక్ష్యం నెరవేరినట్లవుతుందని అన్నారు.
రంగారెడ్డి జిల్లా, చందానగర్ పరిధిలోని లింగంకుంట చెరువులో ఆక్రమణలపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు, చెరువులో ఆక్రమణలను తొలగిం చాలని ఆదేశించింది. అయినప్పటికీ చెరువులో సీవరేజీ ప్లాంట్ నిర్మాణం చేస్తుండటంతో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలైంది. ఈ వ్యాజ్యాన్ని శుక్రవారం జస్టిస్ నూతి రామ్మోహనరావు నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది.