పాఠ్యాంశంగా పూలే జీవితం
► ఆయన పేరుతో బీసీ స్టడీ సర్కిళ్లు..
► జిల్లా కేంద్రాల్లో బీసీ భవన్ల ఏర్పాటుకు కృషి
► శాసనమండలి చైర్మన్ ఎ. చక్రపాణియాదవ్
కర్నూలు(అర్బన్): అంటరానితనం, అవిద్య, అస్పృశ్యతకు వ్యతిరేకంగా ఉద్యమాలు నడిపిన జ్యోతిరావు పూలే అణగారిన వర్గాల గుండెల్లో ఆరాధ్యుడిగా నిలిచి పోయారని శాసనమండలి చైర్మన్ ఎ. చక్రపాణియాదవ్ కొనియాడారు. పూలే 190వ జయంతి సందర్భంగా సోమవారం స్థానిక బిర్లాగేట్ సమీపంలోని ఆయన విగ్రహం వద్ద వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో ముందుగా నేతలు, అధికారులు, ప్రజా సంఘాల నాయకులు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
చక్రపాణియాదవ్ మాట్లాడుతూ అప్పట్లో సంపన్న వర్గాలు, అగ్రకులాలకే పరిమితమైన విద్యను పూలే.. అణగారిన వర్గా ల వారు, ముఖ్యంగా మహిళలకు చేరువ చేశారన్నారు. తన సతీమణి సావిత్రీబాయిని విద్యార్థినిగా స్వీకరించి చదువు చెప్పి దేశంలోనే తొలి మహిళా టీచర్‌గా తీర్చి దిద్దారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి పూలే జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేరుస్తామన్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లోని బీసీ స్టడీ సర్కిళ్లకు పూలే పేరు పెట్టే విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని, అన్ని జిల్లాల్లో బీసీ భవన్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
పూలే బాటలో సాగుదాం: గౌరు చరితారెడ్డి, ఎమ్మెల్యే
జ్యోతిరావు పూలే బాల్య వివాహాలు, కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టారని, వితంతు వివాహాలను ప్రోత్సహించారని ఎమ్మెల్యే గౌరుచరిత కొనియాడారు. అందరూ ఆయన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు.
బీసీల అభ్యున్నతికి ఎనలేని కృషి : సీహెచ్ విజయమోహన్, కలెక్టర్
వెనుకబడిన కులాల అభ్యున్నతికి పూలే ఎంతో కృషి చేశారని కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ అన్నారు. ఆయన స్ఫూర్తిగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల వారి అభ్యున్నతికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్, జేసీ-2 ఎస్ రామస్వామి, దక్షిణాది రాష్ట్రాల ఖాదీ బోర్డు చైర్మన్ చంద్రమౌళి, బీసీ సంక్షేమ శాఖ అధికారి బి. సంజీవరాజు, బీసీ కార్పొరేషన్ ఈడీ లాలా లజపతిరావు, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ ప్రసాదరావు, జిల్లా గిరిజన సంక్షేమాధికారి కె. మల్లికార్జునుడు, టీడీపీ కర్నూలు పార్లమెంట్ ఇన్చార్జీ బీటీ నాయుడు, బీసీ సంక్షేమ సంఘం, యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు నక్కలమిట్ట శ్రీనివాసులు, ఎం రాంబాబు, రజక సంఘం రాయలసీమ కన్వీనర్ వాడాల నాగరాజు, దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షుడు దాశెట్టి శ్రీనివాసులు, బీసీ,ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.