ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించాలి
ఒంగోలు టౌన్ : ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి కే అరుణ కోరారు. ఉగ్రవాదాన్ని విస్మరిస్తే మానవాళికి ముప్పు తప్పదని హెచ్చరించారు. ఇటీవల పాకిస్థాన్లోని పెషావర్లో జరిగిన మారణకాండపై ఆనందమయి సాహిత్య సాంస్కృతిక సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక మల్లయ్యలింగం భవనంలో నిరసన కవితాక్షరాల కార్యక్రమం నిర్వహించారు.
ముఖ్య అతిథిగా పాల్గొన్న అరుణ మాట్లాడుతూ పాకిస్థాన్లోని పెషావర్ సైనిక్ స్కూలుపై తాలిబన్లు దాడిచేసి 143 మందిని పొట్టనపెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి దాడులకు ప్రయత్నించేవారిని ప్రభుత్వాలు ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించరాదన్నారు. పెషావర్ ఘటనను లౌకికవాదులు ముక్తకంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు. రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడు బీ హనుమారెడ్డి మాట్లాడుతూ పెషావర్ వంటి ఘటనలను కవులు, కళాకారులు గొంతెత్తి నినదించాలని కోరారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని దేశాలు చర్యలు తీసుకోవాలన్నారు. హిందూ ధర్మప్రచార మండలి జిల్లా అధ్యక్షుడు అళహరి చెంచలరావు మాట్లాడుతూ పెషావర్ ఘటనతో ఉగ్రవాదులు ప్రపంచానికి మరో సవాల్ విసిరారన్నారు. ఈ సందర్భంగా పలువురు కవులు అక్షరాల ద్వారా నిరసన ధ్వనులు వినిపించారు.
కార్యక్రమంలో రిటైర్డు డిప్యూటీ కలెక్టర్ షంషేర్ అహ్మద్, ఆనందమయి అధ్యక్షుడు పొన్నూరు వేంకటశ్రీనివాసులు, ఉపాధ్యాయుడు సింహాద్రి జ్యోతిర్మయి, సహజకవి శనగపల్లి సుబ్బారావు, పాటల రచయిత ఆళ్ల వెంకటేశ్వర్లు, గాయకుడు ఎంవీ అప్పారావు, కవులు అన్ను విజయకుమారి, కొలకలూరి స్వరూపరాణి, శ్రీరామకవచం సాగర్, నాదెండ్ల జ్వాలాఉమామహేశ్వరశర్మ, గంగిశెట్టి నరసింహారావు, చింతలపాటి సుబ్రహ్మణ్యశర్మ, చుండూరి శ్రీనివాసరావు, ఆర్వీఎస్ భరద్వాజ, కే బాదరయ్య, వై.కొండారెడ్డి, రామయ్యచౌదరి, రాధారమణగుప్త, జాలాది ప్రసాద్, ఎంఎల్ కాంతారావు, ఈలపాట అర్లయ్య, కారటి చినవెంకయ్య, కోవూరి కోటయ్య, మల్లవరపు రాజేశ్వరరావు, మొగిలి దేవప్రసాద్, రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.