K kannababu
-
బ్రాండింగ్ ‘చేప’ట్టిన సర్కారు.. ‘ఫిష్ ఆంధ్ర’కు ప్రమోషన్
సాక్షి, అమరావతి: ’ఫిష్ ఆంధ్ర’ బ్రాండింగ్‌ను మరింతగా ప్రోత్సహించేందుకు మత్స్య శాఖచర్యలు చేపట్టింది. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న ఒడిదుడుకులతో ఆక్వా రంగంలో తరచూ తలెత్తుతున్న సంక్షోభం దృష్ట్యా కేవలం ఎగుమతులపైనే ఆధారపడకుండా స్థానిక వినియోగంపైనా దృష్టి సారించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకు అనుగుణంగా మత్స్య ఉత్పత్తుల తలసరి వినియోగం పెంచడం.. తద్వారా ఆక్వా రైతులు, మత్స్యకారులకు అండగా నిలబడటమే లక్ష్యంగా ముందుకెళుతోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో లభించే సముద్ర, రైతులు పండించే మత్స్య ఉత్పత్తులను ‘ఫిష్ ఆంధ్ర’ పేరిట హబ్‌లు, అవుట్‌లెట్స్, కియోస్క్‌ల ద్వారా మత్స్య శాఖ విక్రయిస్తోంది. వీటిని బ్రాండింగ్ చేసేందుకు ప్రత్యేకంగా యూట్యూబ్ చానల్‌తో పాటు ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, టెలిగ్రామ్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రమోట్ చేయనుంది. డోర్ డెలివరీ కోసం ప్రత్యేకంగా యాప్‌ను డిజైన్ చేయనున్నారు. కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ వ్యవస్థ (సీఆర్ఎంఎస్) ద్వారా వినియోగదారులు ఎలాంటి ఉత్పత్తులను ఎక్కువగా ఇష్టపడుతున్నారనే దానిపై ప్రతిరోజూ ఫీడ్ బ్యాక్ తీసుకుంటూ మార్కెటింగ్ సౌకర్యాలను కల్పించనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా కన్సల్టెంట్ నియమించనున్నారు. ఆసక్తి కల్గిన ఏజెన్సీల నుంచి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్ (ఆర్ఎఫ్పీ) కోరుతూ బుధవారం మత్స్యశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి గల ఏజెన్సీలు www.fisheries.ap.gov.in అనే వెబ్సైట్ ద్వారా టెండర్ డాక్యుమెంట్స్ డౌన్లోడ్ చేసుకుని వచ్చే నెలాఖరులోగా apfisheriestender@gmail.comలో దరఖాస్తు చేసుకోవాలని మత్స్యశాఖ కమిషనర్ కె.కన్నబాబు కోరారు. -
రాష్ట్రంలో పంజాబ్ పాత్రికేయుల బృందం పర్యటన
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల ప్రత్యేకతలను పరిశీలించేందుకు పంజాబ్‌కు చెందిన పాత్రికేయుల బృందం రాష్ట్రంలో పర్యటిస్తున్నట్టు ఏపీటీడీసీ ఎండీ కె.కన్నబాబు తెలిపారు. ‘ఏక్ భారత్.. శ్రేష్ఠ భారత్’ కార్యక్రమంలో భాగంగా గత నెల 31 న రాష్ట్రానికి వచ్చిన ఈ బృందం ఈ నెల 6వ తేదీ వరకు వివిధ ప్రాంతాలను సందర్శిస్తుందని చెప్పారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) జలంధర్ శాఖ ఆధ్వర్యంలో వచ్చిన ఈ బృందం తొలుత విశాఖలోని పర్యాటక ప్రదేశాలను, డిండిని సందర్శించిందన్నారు. శనివారం విజయవాడ బెర్మ్ పార్కులో ఈ బృందానికి రాష్ట్రంలో టూరిజం ప్రాజెక్టుల గురించి వివరించినట్టు చెప్పారు. రాష్ట్ర సంస్కృతి, కళలు, వారసత్వ సంపదను పంజాబ్‌లో ప్రచారం చేసేందుకు ఈ పర్యటన దోహదం చేస్తుందని కన్నబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ఉన్న 974 కిలోమీటర్ల సువిశాల తీర ప్రాంతం, నిత్యం ప్రవహించే నదులు, సుందరమైన బ్యాక్ వాటర్స్, కొండలు, అడవులు, పురాతన దేవాలయాలు, బౌద్ధ క్షేత్రాలు వంటి ఎన్నో పర్యాటక ప్రదేశాలు మన సంస్కృతి, వారసత్వాలను చాటిచెబుతాయన్నారు. పీఐబీ జలంధర్ నోడల్ అధికారి రాజేష్ బాలి మాట్లాడుతూ..ఏపీలోని పర్యాటక ప్రదేశాలు, సంస్కృతి, అలవాట్లు మంచి విజ్ఞానాన్ని అందించాయని చెప్పారు. -
ఆక్వా పరిశ్రమకు ఊతం
సాక్షి, అమరావతి: దేశంలోనే మత్స్యసంపద ఉత్పత్తిలో ముందున్న మన రాష్ట్రంలో ఉత్పత్తి మరింత పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆక్వా రంగ సుస్థిరాభివృద్ధి లక్ష్యంగా రెండేళ్లుగా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ప్రభుత్వం.. సాగు నుంచి మార్కెటింగ్ వరకు రైతులకు ఊతం ఇచ్చేందుకు మరిన్ని కార్యక్రమాల అమలుకు సన్నాహాలు చేస్తోంది. ఐదేళ్లలో ఆక్వా ఉత్పత్తిని రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. సాగు విస్తీర్ణం మూడేళ్లలో 48 వేల హెక్టార్ల మేర పెంచాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా రూ.546.97 కోట్లతో ప్రాసెసింగ్, ప్రీ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పి నిర్వహణ బాధ్యతలను ఆక్వా రైతుసంఘాలకే అప్పగించాలని చూస్తోంది. 2020–21లో 46.23 లక్షల మెట్రిక్ టన్నుల (ఎంటీల) ఉత్పత్తిని సాధించగా, 2021–22లో 50.85 లక్షల ఎంటీల ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే 11.36 లక్షల ఎంటీల మత్స్యసంపద ఉత్పత్తి అయింది. పంట పండినచోటే మార్కెటింగ్‌తో పాటు రైతులకు అదనపు ఆదాయం సమకూర్చే లక్ష్యంతో ప్రాసెసింగ్, ప్రీ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం రోజుకు మొత్తం 4,813 ఎంటీల సామర్థ్యంతో 92 ప్రాసెసింగ్ యూనిట్లు, మొత్తం 300 ఎంటీల సామర్థ్యంతో 30 ప్రీ ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయి. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే చేపలు, రొయ్యలను ప్రాసెస్ చేసేందుకు ఇవి సరిపోవడం లేదు. దీంతో పొరుగు రా>ష్ట్రాలకు తరలించాల్సి రావడంతో రైతులు నష్టపోతున్నారు. తోడు సీజన్ మొదలుకాగానే అంతర్జాతీయ మార్కెట్‌ను బూచిగా చూపి వ్యాపారులు తక్కువ ధరలకే కొనుగోలు చేస్తుండడంతో రైతులకు నష్టం వస్తోంది. ఈ పరిస్థితులకు చెక్ పెట్టేందుకు ఆక్వాసాగు ఎక్కువగా ఉన్న తీరప్రాంత జిల్లాల్లో ఒక్కొక్కటి రూ.6.39 కోట్లతో 23 ప్రీ ప్రాసెసింగ్ యూనిట్లు, ఒక్కొక్కటి రూ.40 కోట్ల వ్యయంతో 10 ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయబోతుంది. కనీసం 2 వేల ఎంటీల సామర్థ్యంతో ఏర్పాటవుతున్న వీటిద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా కనీసం 10 వేలమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో 974 కిలోమీటర్ల తీరప్రాంతముంది. 54,500 హెక్టార్లలో ఉప్పునీటి, 1.44 లక్షల హెక్టార్లలో మంచినీటి చెరువుల్లో ఆక్వా సాగవుతోంది. దేశం నుంచి ఎగుమతి అవుతున్న రొయ్యల్లో 70 శాతం, చేపల్లో 38 శాతం వాటా మన రాష్ట్రానిదే. ఆక్వారైతుకు గిట్టుబాటు ధర కల్పనే లక్ష్యం ఆక్వా ఉత్పత్తులకు మంచి ధర లభించడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఆ దిశగానే ఆక్వా సాగవుతున్న జిల్లాల్లో ప్రాసెసింగ్, ప్రీ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని సంకల్పించింది. వీటికి ప్రతిపాదనలు సిద్ధం చేశాం. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే అమలుకు చర్యలు తీసుకుంటాం. – కె.కన్నబాబు, కమిషనర్, మత్స్యశాఖ -
వరదలు: లంక ప్రజలు మరింత అప్రమత్తం
సాక్షి, విజయవాడ: తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానది వరద ఉధృతికి ప్రకాశం బ్యారెజ్ వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నట్లు విపత్తు శాఖ కమిషనర్ కె కన్నబాబు తెలిపారు. బుధవాంర ఆయన మీడియాతో మాట్లాడుతూ... మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రకాశం బ్యారేజ్ ఇన్ ఫ్లో, వుట్ ఫ్లో 7,20,701 లక్షల క్యుసెక్కులుగా నమోదైనట్లు చెప్పారు. అలాగే వంశధార నదికి కూడా వరద ఉధృతి పెరుగుతోందని, దీంతో గొట్టా బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. బుధవారం బ్యారెజ్ ఇన్ ఫ్లో 42,980 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 42,916 క్యూసెక్కులు నమోదైందని తెలిపారు. ఇక ముంపు ప్రాంతాల్లోకి వరద ప్రవాహాం చేరుతున్నప్పుడు ముందస్తు పునరావాస కేంద్రాలను వెళ్లాలని, లోతట్టు ప్రాంత, లంక గ్రామాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కన్నబాబు విజ్ఞప్తి చేశారు. దుర్గగుడి అధికారుల అత్యవసర భేటీ: దుర్గగుడి ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగి పడడంపై గుడి అధికారులు ఈవో సురేష్ బాబు, చైర్మన్ పైలా సోమినాయుడు, దుర్గగుడి ఈడీ భాస్కర్ బుధవారం అత్యవసర సమావేశమయ్యారు. రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉండటంతో సమావేశమైనట్లు తెలిపారు. ఈ నెల 17నుంచి జరిగే దసరా ఉత్సవాలకు ఘాట్ రోడ్డులో భక్తులను అనుమతించాలా లేదా అనే దానిపై అధికారులు ప్రధానంగా చర్చించారు. ఇలాగే వర్షాలు కొనసాగితే ఘాట్ రోడ్డు మీదుగా భక్తులకు అనుమతి ఇవ్వకూడదని అధికారులు నిర్ణయించామని, దీనిపై జిల్లా కలెక్టర్ ఇంతియాజ్‌తో సమావేశం నిర్వహించిన తర్వాత తమ నిర్ణయం ప్రకటిస్తమని అధికారులు తెలిపారు. -
పాలనను వ్యాపారం చేసిన టీడీపీ
ప్రజావ్యతిరేక ప్రభుత్వాన్ని సాగనంపుదాం వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ప్రజలతో మమేకమవ్వాలని పార్టీ శ్రేణులకు పిలుపు అనపర్తి : ప్రజా సమస్యలను గాలికి వదిలేసి రాష్ట్రాన్ని వ్యాపార సంస్థగా నడుపుతున్న తెలుగుదేశం ప్రభుత్వాన్ని సాగనంపడానికి సిద్ధంగా ఉన్న ప్రజలకు తోడుగా ప్రతి కార్యకర్తా, నేతా కంకణబద్ధులు కావాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు పిలుపునిచ్చారు. బుధవారం అనపర్తి వర్తక సంఘం కళ్యాణ మండపంలో కో ఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి అధ్యక్షతన జరిగిన నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడుతు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి విశ్వసనీయత, తెలుగుదేశం ప్రభుత్వం మోసపూరిత హామీలే మనకు గెలుపు గుర్రాలన్నారు. కార్యకర్తలంతా కలసికట్టుగా పని చేస్తే 2019లో విజయం మనదేనని కార్యకర్తలను ఉత్సాహపరిచారు. రాష్ట్రం మొత్తం మీద పూర్తిస్థాయి కమిటీలను ఏర్పాటు చేసి పార్టీని బలోపేతం చేసిన ఒకేఒక్క నియోజకవర్గం అనపర్తి అంటూ డాక్టర్ సూర్యనారాయణరెడ్డిని అభినందించారు. అనపర్తిలో పెచ్చుమీరిన అవినీతి, అరాచకాలు ఆ అనపర్తి నియోజకవర్గంలో అధికార పార్టీ అవినీతి, ఆరాచకాలు పెచ్చుమీరాయని కన్నబాబు విమర్శించారు. నాయకులు, కార్యకర్తలు ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలపై స్పందించాలని, వారికి పార్టీ పూర్తిస్థాయిలో సహకారాన్ని అందిస్తుందని అన్నారు. మరో ముఖ్య అతిథి సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ పార్టీ నుంచి బయటకు వెళ్ళిన నాయకులు పిరికిపందలని విమర్శించారు. గతంలో ఇతర పార్టీల నుంచి వైఎస్సార్ సీపీలోకి వచ్చిన ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశాకే జగన్ పార్టీలోకి తీసుకున్నారని, విలువలున్న ఆయనను ముఖ్యమంత్రిని చేసి రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పాటు పడవలసిన అవసరం మనందరిపై ఉందని అన్నారు. డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ అక్రమ కేసులు పెట్టి, వ్యాపారాలు, ఆస్తులను లక్ష్యంగా చేసుకుని లొంగదీసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలను కూడా లెక్క చేయకుండా పార్టీ పట్ల నమ్మకంతో పని చేస్తున్న కార్యకర్తలు, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రచార కమిటీ జనరల్ సెక్రటరీ రావూరి వెంకటేశ్వరరావు, నీటి సంఘ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కొవ్వూరి త్రినాథరెడ్డి, రాష్ట్ర ఎస్సీసెల్ జాయింట్ సెక్రటరీ మోకా సూరిబాబు, జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ళ కృష్ణారెడ్డి తదితరులు ప్రభుత్వ నిరంకుశ విధానాల్ని దుయ్యబడుతూ ప్రసంగించారు. రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి లంక చంద్రన్న, రాష్ట్ర కమిటీ కార్యవర్గ సభ్యుడు కొల్లాటి ఇజ్రాయేలు, రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి యరకారెడ్డి సత్య తదితర నాయకులతో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.