పాలనను వ్యాపారం చేసిన టీడీపీ | K kannababu takes on TDP Govt | Sakshi
Sakshi News home page

పాలనను వ్యాపారం చేసిన టీడీపీ

Published Thu, Jul 7 2016 3:49 PM | Last Updated on Fri, Aug 10 2018 6:21 PM

K kannababu takes on TDP Govt

ప్రజావ్యతిరేక ప్రభుత్వాన్ని సాగనంపుదాం
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు
ప్రజలతో మమేకమవ్వాలని పార్టీ శ్రేణులకు పిలుపు
 
అనపర్తి : ప్రజా సమస్యలను గాలికి వదిలేసి రాష్ట్రాన్ని వ్యాపార సంస్థగా నడుపుతున్న తెలుగుదేశం ప్రభుత్వాన్ని సాగనంపడానికి సిద్ధంగా ఉన్న ప్రజలకు తోడుగా ప్రతి కార్యకర్తా, నేతా కంకణబద్ధులు కావాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు పిలుపునిచ్చారు.

బుధవారం అనపర్తి వర్తక సంఘం కళ్యాణ మండపంలో కో ఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి అధ్యక్షతన జరిగిన నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడుతు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విశ్వసనీయత, తెలుగుదేశం ప్రభుత్వం మోసపూరిత హామీలే మనకు గెలుపు గుర్రాలన్నారు.

కార్యకర్తలంతా కలసికట్టుగా పని చేస్తే 2019లో విజయం మనదేనని కార్యకర్తలను ఉత్సాహపరిచారు. రాష్ట్రం మొత్తం మీద పూర్తిస్థాయి కమిటీలను ఏర్పాటు చేసి పార్టీని బలోపేతం చేసిన ఒకేఒక్క నియోజకవర్గం అనపర్తి అంటూ డాక్టర్ సూర్యనారాయణరెడ్డిని అభినందించారు.
 
అనపర్తిలో పెచ్చుమీరిన అవినీతి, అరాచకాలు
ఆ అనపర్తి నియోజకవర్గంలో అధికార పార్టీ అవినీతి, ఆరాచకాలు పెచ్చుమీరాయని కన్నబాబు విమర్శించారు. నాయకులు, కార్యకర్తలు  ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలపై స్పందించాలని, వారికి పార్టీ పూర్తిస్థాయిలో సహకారాన్ని అందిస్తుందని అన్నారు. మరో ముఖ్య అతిథి సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ పార్టీ నుంచి బయటకు వెళ్ళిన నాయకులు పిరికిపందలని విమర్శించారు. గతంలో ఇతర పార్టీల నుంచి వైఎస్సార్ సీపీలోకి వచ్చిన ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశాకే జగన్ పార్టీలోకి తీసుకున్నారని, విలువలున్న ఆయనను ముఖ్యమంత్రిని చేసి రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పాటు పడవలసిన అవసరం మనందరిపై ఉందని అన్నారు.
 
డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ అక్రమ కేసులు పెట్టి, వ్యాపారాలు, ఆస్తులను లక్ష్యంగా చేసుకుని లొంగదీసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలను కూడా లెక్క చేయకుండా పార్టీ పట్ల నమ్మకంతో పని చేస్తున్న కార్యకర్తలు, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రచార కమిటీ జనరల్ సెక్రటరీ రావూరి వెంకటేశ్వరరావు, నీటి సంఘ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కొవ్వూరి త్రినాథరెడ్డి, రాష్ట్ర ఎస్సీసెల్ జాయింట్ సెక్రటరీ మోకా సూరిబాబు, జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ళ కృష్ణారెడ్డి తదితరులు ప్రభుత్వ నిరంకుశ విధానాల్ని దుయ్యబడుతూ ప్రసంగించారు.

రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి లంక చంద్రన్న, రాష్ట్ర కమిటీ కార్యవర్గ సభ్యుడు కొల్లాటి ఇజ్రాయేలు, రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి యరకారెడ్డి సత్య తదితర నాయకులతో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement