సీబీఐ వలలో రైల్వే అధికారి, స్కూల్ ప్రిన్సిపాల్
సాక్షి, హైదరాబాద్: మహిళాటీచరు నుంచి రూ.లక్ష నగదు, రూ.2 లక్షల చెక్‌ను తీసుకుంటూ.. రైల్వే స్కూల్ ప్రిన్సిపాల్ నాగేశ్వరరావు, రైల్వే సూపరింటెండెంట్ కె.నర్సింహులు గురువారం సీబీఐ అధికారులకు పట్టుబడ్డారు. సికింద్రాబాద్‌లోని రైల్వే సీబీఎస్సీ స్కూల్లో విజయగౌరి టీచర్‌గా పనిచేస్తున్నారు.
ఆమె ఎస్సీ కులధ్రువీకరణ పత్రంతో అక్రమంగా ఉద్యోగం పొందిందని, ఈ విషయమై రైల్వే విజిలెన్స్ విచారణ జరుపుతున్నదని నాగేశ్వరరావు, నర్సింహులు విజయగౌరిని బెదరించారు. ఈ విషయంలో చర్య తీసుకోకుండా ఉండాలంటే రూ.3లక్షలు లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమాచారం అందుకున్న సీబీఐ అధికారులు గురువారం స్కూల్ వద్ద మాటువేసి విజయగౌరి నుంచి లంచం తీసుకుంటుండగా నాగేశ్వరరావు,నర్సింహులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని అరెస్టుచేశారు.