మృతదేహాల తరలింపులో అంత తొందరేంటి?
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద అక్రమ కేసులకు నిరసనగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పార్థసారథి పిలుపునిచ్చారు. డ్రైవర్ మృతదేహాన్ని పరీక్షించకుండా అక్కడినుంచి తరలించిన విషయం వాస్తవమా కాదా అని ప్రశ్నించారు. ప్రశ్నించే హక్కు ప్రతిపక్షాలకు.. ప్రజలకు ఉండదా అని అడిగారు. మృతదేహాలను త్వరగా వాళ్ల ఇళ్లకు పంపడంలో ఈ ప్రభుత్వం చాలా చొరవ చూపించిందని, దానికి కారణం ఏంటో ప్రభుత్వమే చెప్పాలని విమర్శించారు. ప్రైవేటు ట్రావెల్స్‌లో ప్రయాణించే వారి భద్రత ఈ ప్రభుత్వానికి పట్టదని, నిన్న జరిగిన ప్రమాదంపై ప్రభుత్వం ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఆయన అన్నారు.
కేవలం ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారని అన్నారు. గతంలో ప్రభుత్వాలకు ప్రజాస్వామ్య విలువలు ఉండేవని, ఇలాంటి ఘటనలు జరిగితే ప్రభుత్వాలు విచారణ జరిపి చర్యలు తీసుకునేవని, కానీ ఇప్పటి ప్రభుత్వంలో అవేమీ కనిపించడం లేదని మండిపడ్డారు. డ్రైవర్ మృతదేహానికి పోస్టుమార్టం చేయకపోతే.. ప్రమాదానికి కారణాలు ఎలా తెలుస్తాయని మాత్రమే ఆయన అడిగారని చెప్పారు. అధికారులంటే వైఎస్ రాజశేఖరరెడ్డికి, జగన్‌కు అమితమైన గౌరవం ఉందని, రాజకీయ కుట్రలో అధికారులను టీడీపీ పావుల్లా వాడుకుంటోందని ఆయన అన్నారు. బస్సు ప్రమాదంపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.