'అర్హత లేకుండానే అందలమెక్కాడు.. దించండి'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసన సభ ఇంచార్జీ కార్యదర్శిగా కొనసాగే అర్హత శాసన సభ డిప్యూటీ కార్యదర్శి కే సత్యనారాయణ రావుకు లేదని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి అన్నారు. సత్యనారాయణ అవినీతి, అక్రమాలు, ఆర్థిక నేరాలతోపాటు ఆయన విద్యార్హతలను కూడా ప్రశ్నిస్తూ ఆయన రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కు లేఖ రాశారు. ఓ పక్క అవినీతి అక్రమాలకు పాల్పడిన ఆరోపణలు ఎదుర్కొంటూ.. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతూ సరైన అర్హతలు లేకుండానే ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఇంఛార్జీ సెక్రటరీగా కే సత్యనారాయణ రావు (ఆంధ్రప్రదేశ్ శాసన సభ డిప్యూటీ సెక్రటరీ) కొనసాగుతున్నారని రామకృష్ణారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
ఏ ప్రాతిపదికన కే సత్యనారాయణ రావును ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఇంఛార్జీ సెక్రటరీగా, డిప్యూటీ సెక్రటరీగా కొనసాగిస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. కే సత్యనారాయణరావు ఎన్నో అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డారని, చట్ట విరుద్ధంగా వ్యవహరించారని లేఖలో పేర్కొన్నారు. ఆయనపై ఇప్పటికే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఓ క్రిమినల్ కేసు కూడా ఉందని.. ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యులకు శ్రీవెంకటేశ్వర కో ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీకి చెందిన భూముల విషయంలో అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడ్డారని 2012లో కేసు నమోదైందని చెప్పారు. ఈ కేసులో సత్యనారాయణ ఏ 2గా ఉన్నారని చెప్పారు. అయితే, అరెస్టు నుంచి బయటపడేందుకు హైకోర్టుకు కూడా వెళ్లారని వివరించారు. ఈ కేసులో పోలీసులు చార్జీషీటు కూడా వేశారని, కానీ, ఈ కేసు కోర్టులో విచారణలో ఉండగానే అనూహ్యంగా ప్రభుత్వంలో అత్యున్నత పదవుల్లో కొనసాగుతున్నారని, ఆయన చేసిన అక్రమాల నుంచి తప్పించుకున్నారని ఆరోపించారు.
ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని ఎలా ఆ పదవుల్లో కొనసాగిస్తున్నారని, ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారని ప్రశ్నించారు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి సత్యనారాయణరావుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతోపాటు తన ఆంధ్రప్రదేశ్ శాసన సభ కార్యదర్శిగా పనిచేసేందుకు ఉండాల్సిన అర్హతలు కూడా సత్యనారాయణరావుకు లేవని అన్నారు.
ఈ పదవీ చేపట్టాలంటే కచ్చితంగా లా డిగ్రీ ఉండాలని.. కానీ అది ఆయనకు లేదని గుర్తు చేశారు. అందుకే తాను గతంలో ఆయన విద్యార్హతల గురించి పబ్లిక్ ఇన్పర్మేషన్ ఆఫీసర్ ద్వారా ఎంక్వైరీ చేసే ప్రయత్నం చేసినా బదులు రాలేదని, ఆయనకు కూడా ఆ వివరాలు తెలపలేదని.. దీని ప్రకారం ఆయన డిప్యూటీ సెక్రటరీగా కొనసాగే అర్హతలు లేవనే విషయం తేటతెల్లమవుతుందని.. దీనిపై విచారణ జరిపించి ఆయన విద్యార్హతలు తేల్చాలని గవర్నర్ ను కోరారు.