Kaarthi
-
దేవరతో పోటీ.. బరిలోకి దిగుతున్న హిట్ కాంబినేషన్ సినిమా
కోలీవుడ్ హీరో కార్తీ నటిస్తున్న తాజా చిత్రాల్లో మెయళగన్ ఒకటి. 96 చిత్రం ఫేమ్ ప్రేమ్‌కుమార్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ చిత్రాన్ని 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై జ్యోతిక, సూర్య నిర్మిస్తున్నారు. నటుడు అరవింద్‌సామి ప్రధాన పాత్రను పోషించిన ఇందులో నటి శ్రీదివ్య, స్వాతి కొండే, రాజ్‌కిరణ్, దేవదర్శిని, జయప్రకాశ్, శ్రీరంజనీ, ఇళవరసు, కరుణాకరన్, రైచల్ రిబాకా తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. గోవింద్ వసంత సంగీతాన్ని, మహేంద్రన్ జయరాజు ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రం గ్రామీణ నేపథ్యంలో సాగే కుటుంబ కథా చిత్రంగా ఉంటుందని యూనిట్ వర్గాలు ఇప్పటికే తెలిపారు. అయితే చిత్రంలో జల్లికట్టు సన్నివేశాలు వంటి పలు యాక్షన్ సన్నివేశాలు చోటు చేసుకుంటాయని తెలుస్తోంది. కాగా షూటింగ్‌ను పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న మెయళగన్ చిత్రాన్ని సెప్టెంబర్ 27వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించారు. దీనికి సంబంధించి నటుడు కార్తీ జల్లికట్టు ఎద్దుగా సవారీ చేస్తున్న పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇకపోతే ఇదే తేదీన జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా నటిస్తున్న దేవర చిత్రం తెరపైకి రానుంది. ఈ రెండు చిత్రాలు తెలుగు, తమిళం భాషల్లో విడుదల కానున్నాయి. దీంతో వీటి మధ్య పోటీ నెలకొంటుందన్న టాక్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
అభిమానులతో సూర్య విందు.. ఎందుకో తెలుసా..?
గత ఏడాది డిసెంబర్ నెలలో తమిళనాడును మిచాంగ్ తుపాను ముంచెత్తింది. ఆ సమయంలో సూర్య పిలుపు మేరకు నష్టపోయిన వారికి అండగా నిలిచిన ఫ్యాన్స్ అందరినీ సూర్య కలుసుకున్నారు. భారీ వర్షాల కారణంగా తిరునల్వేలి, తూత్తుకుడి, కన్యాకుమారి సహా దక్షిణాది జిల్లాలు దెబ్బతిన్నాయి. దీంతో చాలామంది సామాన్య ప్రజలు తినేందుకు ఆహారంతో పాటు దుస్తులు లేక తీవ్రమైన అవస్థలు పడ్డారు. ఆ సమయంలో ప్రభుత్వం కూడా తక్షణమే అనేక సహాయకచర్యలు ప్రారంభించింది. సామాన్య ప్రజల ఇబ్బందులను చూసి చలించిన కోలీవుడ్ బ్రదర్స్ సూర్య, కార్తీలు వెంటనే రూ. 10 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు. తుపాను తగ్గే వరకు ఆ ప్రాంతాల్లో నిత్యం అన్నదాన కార్యక్రమాలను చేపట్టారు.. ఇవన్నీ చేయాలంటే సరైన వర్కర్స్ కావాలి.. అప్పుడు సూర్య తన ఫ్యాన్స్‌కు పిలుపునిచ్చారు. దీంతో రంగంలోకి దిగిన ఆయన అభిమానులు తుపాను తగ్గేవరకు పలు సేవలు చేశారు. అభిమానులు చేసిన సేవను గుర్తించిన సూర్య.. వారందరీని ఒక్కసారి కలుసుకోవాలని ఆహ్వానించి ఒక పార్టీ ఏర్పాటు చేశారు. చెన్నైలోని త్యాగరాయర్ నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలులో, చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లో తుపాను కారణంగా నష్టపోయిన ప్రజల కోసం పనిచేసిన సూర్య అభిమానుల సంఘంలోని సభ్యులందరినీ స్వయంగా సూర్య కాల్ చేసి పిలిచారు. వారందరికి శాఖాహార విందును ఆయన ఏర్పాటు చేశారు. తన అభిమానులకు స్వయంగా సూర్యనే వడ్డించడం విశేషం. అలాగే వారితో కలిసి ఫోటో దిగుతూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు నటుడు సూర్య. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం సూర్య 'కంగువా'లో నటిస్తున్నారు. శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సూర్య ఆరు భిన్నమైన అవతారాల్లో కనిపించనున్నట్లు సమాచారం. ఐమ్యాక్స్, 3డీ వెర్షన్లోనూ ఇది అందుబాటులో ఉండనుంది. దిశా పఠానీ కథానాయికగా నటిస్తుండగా.. బాబీ దేవోల్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. జగపతి బాబు, యోగిబాబు, కోవై సరళ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవి కానుకగా ఇది విడుదల కానుంది. -
'సుల్తాన్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు
-
సాయేషా కోరికేంటో తెలుసా?
తమిళసినిమా: కోలీవుడ్‌లో కథానాయకిగా ఎదగాలని ఆశపడుతున్న బాలీవుడ్ బామల్లో నటి సాయేషాసైగల్ ఒకరు. ప్రఖ్యాత సినీ కుటుంబానికి చెందిన ఈ బ్యూటీ మొదట్లోనే దక్షిణాదిపై దృష్టిసారించింది. అలా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన సాయేషా ఇప్పుడు కోలీవుడ్‌కే ప్రాధాన్యతనిస్తానంటోంది. ఇక్కడ తొలి చిత్రం వనమగన్ చిత్రం ఈమెకు మంచి పేరు తెచ్చి పెట్టింది. నిజానికి సాయేషా నటించిన ఆ ఒక్క చిత్రమే ఇప్పటికి తెరపైకి వచ్చింది. అయితే ప్రస్తుతం మూడు చిత్రాల్లో నటిస్తోంది. అందులో కార్తీకి జంటగా నటించిన కడైకుట్టి సింగం వచ్చే నెల తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఆ తరువాత విజయ్‌సేతుపతితో రొమాన్స్ చేసిన జుంగా చిత్రం, ఆపై ఆర్యతో జత కట్టిన గజనీకాంత్ చిత్రం అంటూ వరుసగా విడుదలకు సిద్ధం అవుతున్నాయి. ఈ మూడు చిత్రాలకు ప్రేక్షకుల మధ్య భారీ అంచనాలే ఉన్నాయి. జుంగా చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో సాయేషా నటనను, ఆమె సహకారాన్ని చిత్ర యూనిట్ తెగ మెచ్చేకున్నారు. సాయేషా కూడా జుంగా చిత్రంలో నటించడం మంచి అనుభవం అని పేర్కొంది. ఒక భేటీలో తను పేర్కొంటూ తాను తమిళ చిత్రాలకే ప్రాధాన్యత నిస్తున్నానని చెప్పింది. అదే విధంగా హీరోయిన్ పాత్రకు ప్రాముఖ్యత ఉన్న కథా చిత్రాల్లో నటించాలని కోరుకుంటున్నానని చెప్పింది. మరో విషయం ఏమిటంటే తాను చిన్న వయసు నుంచే నాట్యంలో శిక్షణ పొందానని తెలిపింది. అందుకే సినిమాల్లో డాన్స్ మూమెంట్స్ ఎంత కఠినంగా ఉన్నా సులభంగా చేసేస్తానని చెప్పింది. అదే విధంగా పూర్తి నృత్యభరిత కథా పాత్రలో నటించాలన్నది తన కోరిక అని పేర్కొంది. ఉదాహరణకు తెలుగు చిత్రం మయూరి తరహాలో నాట్యానికి ప్రాధాన్యత ఉన్న చిత్రంలాంటిది చేయాలని ఆశపడుతున్నట్లు చెప్పింది. ఈ సుందరి త్వరలో ముంబైలో డాన్స్ స్కూల్‌ను నెలకొల్పడానికి సన్నాహాలు చేస్తోందట. దానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తానంటోంది. -
అన్నయ్యతో కలిసి నటించాలి
తమిళసినిమా: అన్నయ్య సూర్యతో కలిసి నటించాలనుందని కార్తీ పేర్కొన్నారు. నటుడు సూర్య తాజాగా తన 2డీ ఎంటర్టెయిన్మెంట్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం కడైకుట్టి సింగం. ఇందులో కార్తీ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఆయనకు జంటగా ముంబై బ్యూటీ సాయేషాసైగల్, ప్రియ భవానీశంకర్ కథానాయికలుగా నటిస్తున్నారు. సత్యరాజ్, సూరి, భానుప్రియ, శ్రీమాన్, సరవణన్, ఇళవరసు, మారిముత్తు, జాన్‌విజయ్ ముఖ్య పాత్రలను పోషిస్తున్న ఈ చిత్రానికి పసంగ పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. డి.ఇమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియో అవిష్కరణ సోమవారం ఉదయం స్థానిక రాయపేటలోని సత్యం థియేటర్లో జరిగింది. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు కార్తీ మాట్లాడుతూ దర్శకుడు పాండిరాజ్ ప్లాన్‌గా చిత్రాన్ని పూర్తి చేశారని చెప్పారు. ఇందులో 28 మంది ప్రముఖ నటీనటులను నటించారని, అందరికీ ప్రాముఖ్యత ఉండేలా దర్శకుడు పాత్రలను తీర్చిదిద్దడం తనకే అశ్చర్యం కలిగించిందన్నారు. ఈ చిత్రం నగరంలో పని చేసేవారందరిని గ్రామాలకు వచ్చి వ్యవసాయం చేయిస్తుందనే అభిప్రాయాన్ని కార్తీ వ్యక్తం చేశారు. డీ.ఇమాన్ సంగీతంలో తాను నటించిన తొలి చిత్రం కడైకుట్టి సింగం అని తెలిపారు. ఆయన మంచి పాటలను అందించారని చెప్పారు. అన్నయ్య నిర్మించే చిత్రంలో తాను హీరోగా నటిస్తానని ఊహించలేదన్నారు. అన్నయ్యతో కలిసి నటించాలని ఉందని అన్నారు. తనకు అక్క అంటే చాలా ఇష్టం అని షూటింగ్ నుంచి అలసిపోయి ఇంటికి వస్తే మంచి కాఫీ చేసి ఇస్తుందన్నారు. కార్యక్రమంలో నటుడు శివకుమార్, సూర్య, సత్యరాజ్, సూరి, శ్రీమాన్, నటి సాయేషాసైగల్, ప్రియ భవానీశంకర్, 2డీ ఎంటర్టెయిన్మెంట్ సంస్థ సహ నిర్మాత రాజశేఖర్ కర్పూర పాండియన్ పాల్గొన్నారు. -
ప్రభుదేవా డైరెక్షన్లో కార్తీ
కొరియోగ్రాఫర్‌గా, నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా కూడా సక్సెస్ సాధించిన సౌత్ స్టార్ ప్రభుదేవా. కొరియోగ్రాఫర్‌గా కెరీర్ ప్రారంభించిన ప్రభుదేవా.. తర్వాత నటుడిగా, ఆ తరువాత దర్శకుడిగా దక్షిణాదిలో ఆకట్టుకున్నాడు. అదే జోష్‌లో బాలీవుడ్లో అడుగుపెట్టిన ప్రభు, రీమేక్ సినిమాలతో టాప్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఇటీవల కాలంలో ప్రభుదేవా డైరెక్ట్ చేసిన హిందీ సినిమాలు ఆశించిన స్ధాయిలో విజయం సాధించలేకపోయాయి. దీంతో తిరిగి సౌత్ బాట పట్టిన ప్రభుదేవా మరోసారి ఇక్కడే తనను తాను రుజువు చేసుకోడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఓ సౌత్ సినిమాలో హీరోగా నటిస్తున్న ప్రభుదేవా, దర్శకుడిగా కూడా సౌత్ సినిమానే ఎంపిక చేసుకున్నాడు. తమిళ యంగ్ హీరో కార్తీ హీరోగా ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే కార్తీకి కథ కూడా వినిపించిన ప్రభుదేవా త్వరలోనే ఆ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నాడు. -
కార్తీ 'కొంబన్'కు కొత్త చిక్కులు!