టూరిజం బస్సులో పొగలు..
బొల్లారం/అనంతపురం, న్యూస్‌లైన్: రాష్ట్రంలో బుధవారం రెండు చోట్ల బస్సు ప్రమాదాలు ప్రయాణికుల్ని కలవరానికి గురి చేశాయి. హైదరాబాద్ నుంచి షిర్డీకి బయలుదేరిన టూరిజం బస్సు (ఏపీ23వై 2179) కొద్ది సేపటికే ప్రమాదానికి గురైంది. బస్సులో ఎడమ పక్క నుంచి పొగలు రావడాన్ని ఒక ప్రయాణికుడు గుర్తించి డ్రైవర్లు అహ్మద్, వెంకటేశ్వర్లను అప్రమత్తం చేశారు. వెంటనే వారు బస్సును నిలిపివేసిన వెంటనే ఎనిమిది మంది ప్రయాణికులు దిగిపోయారు. బ్యాటరీ బాక్సు నుంచి పొగలు రావడాన్ని గుర్తించిన డ్రైవర్లు, దానిపై నీళ్లు, మట్టి కుమ్మరించి మంటలు చెలరేగకుండా నివారించారు.
మరోపక్క అనంతపురం ఆర్టీసీ బస్టాండ్‌లో కదిరి డిపో బస్సు(ఏపీ28 జెడ్ 4947)లో డ్రైవర్ లక్ష్మయ్య సెల్ఫ్ బటన్ నొక్కగానే.. షార్ట్ సర్క్యూట్ అయ్యి ఇంజిన్ మంటలు రేగాయి. బస్సులో ఉన్న 25 మంది ప్రయాణికులు భయాందోళనతో కిందకు దిగి పరుగులు తీశారు. అనంతరం ఆర్టీసీ సిబ్బంది అప్రమత్తమై మంటలను ఆర్పేశారు. బాయినెట్ కప్పును తీసివేసి డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించారని, ఆ సమయంలో ఆయన చేతులకు స్వల్ప గాయాలయ్యాయని ఆర్ఎం జి. వెంకటేశ్వరరావు చెప్పారు.