kadiri government hospital
-
స్నేహితుడితో కలిసి భార్యపై లైంగికదాడి
కదిరి అర్బన్: కట్టుకున్న భార్య కాళ్లు, చేతులు కట్టేసి.. స్నేహితుడితో కలిసి అత్యాచారం చేశాడో భర్త. అంతటితో ఆగకుండా అట్ల కాడను కాల్చి ఆమె మర్మాంగాలపై వాతలు పెట్టాడు. అనంతపురం జిల్లా కదిరి మండలంలోని సోమేష్ నగర్లో మంగళవారం ఈ ఘటన వెలుగు చూసింది. రూరల్ సీఐ నిరంజన్‌రెడ్డి కథనం ప్రకారం.. తలుపుల మండలం సిద్దిగూరుపల్లికి చెందిన 30 ఏళ్ల మహిళకు నాలుగేళ్ల క్రితం సోమేష్ నగర్‌కు చెందిన మల్లేశ్వర్‌తో వివాహమైంది. దంపతులిద్దరూ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. మల్లేశ్వర్ తన భార్యపై అనుమానం పెంచుకుని వేధించసాగాడు. నవంబర్ 29న మద్యం తాగి స్నేహితుడు కుమార్‌తో కలిసి ఇంటికి వచ్చిన మల్లేశ్వర్ భార్య కాళ్లు, చేతులను మంచానికి కట్టేసి స్నేహితుడు కుమార్‌తో కలిసి అత్యాచారానికి తెగబడ్డాడు. ఆ తర్వాత అట్ల కాడ కాల్చి ఆమె మర్మాంగాలపై వాతలు పెట్టాడు. ఘటన అనంతరం బాధితురాలు పుట్టింటికి వెళ్లి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. వారు బిడ్డను తీసుకుని తలుపుల పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా.. అత్యాచారం జరిగిన ప్రాంతం తమ పరిధిలోకి రాదని.. కదిరి రూరల్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని తలుపుల పోలీసులు సూచించారు. దీంతో బాధితురాలు మంగళవారం కదిరి రూరల్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. బాధితురాలిని కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. భర్త, అతని స్నేహితుడిపై ఐపీసీ 342, 376, 109, రెడ్‌విత్ 34 సెక్షన్ల కింద కేసు నమెదు చేశారు. ఈ అకృత్యానికి పాల్పడిన ఇద్దరూ పరారీలో ఉన్నారు. కాగా నిందితుడు మల్లేశ్వర్ గతంలో తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం చేసి... జైలు శిక్ష అనుభవించినట్లు పోలీసులు తెలిపారు. -
అమ్మా.. ఎందుకిలా చేశావ్..?
అనంతపురం: కాన్పు కోసం కదిరి ప్రభుత్వాస్పత్రికి వచ్చిన ఓ మహిళ మగబిడ్డకు జన్మనివ్వగానే శిశువును అక్కడే వదిలి ఎటో వెళ్లిపోయింది. దీంతో శిశువును ఎవరికి అప్పగించాలో తెలియక ఆస్పత్రి వర్గాలు సతమతమవుతుండగానే శ్వాస అందక కళ్లు కూడా తెరవని పసికందు శాశ్వతంగా కన్నుమూశాడు. మంజుల అనే మహిళ తన తల్లిని వెంటబెట్టుకుని కడుపునొప్పి అంటూ మంగళవారం రాత్రి 9 గంటలకు స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి వచ్చింది. డ్యూటీ వైద్యులు పరీక్షించి ఏడు నెలల గర్భవతి అని చెప్పి ప్రసూతి వార్డుకు పంపారు. అక్కడ అరగంటకే పురిటినొప్పులు రావడంతో ఆమె మగ బిడ్డను ప్రసవించింది. అదే రోజు రాత్రి 10 గంటలకు సాధారణ ప్రసవం కావడంతో ఇంటికి వెళ్లి దుస్తులు తెమ్మని తన తల్లికి మంజుల చెప్పింది. అలా తల్లిని సాగనంపుతూ వార్డు బయటకు వచ్చిన మంజుల తల్లితో పాటూ ఎటో వెళ్లిపోయింది. వారు ఎంతసేపటికీ రాకపోయేసరికి ఆస్పత్రి వర్గాలు కంగారుపడ్డాయి. బుధవారం ఉదయం విచారణ జరిపించారు. ఆస్పత్రి రికార్డులో కదిరి సమీపంలోని కుమ్మరవాండ్లపల్లి అని, తన భర్త రాజేష్ అని రాయించడంతో వైద్యసిబ్బంది ద్వారా అక్కడ కూడా విచారణ చేపట్టారు. అయితే మంజుల అనే ఆమె ఎవరూ లేదని తేలడంతో చిరునామా తెలియక సతమతమయ్యారు. సాధారణంగా 2.25 కిలోల బరువు ఉండాల్సి ఉండగా శిశువు కేవ లం 1.5 కిలోల బరువు ఉన్నట్లు హెడ్నర్స్ వసలాదేవి తెలిపారు. శిశువుకు పాల కోసం బత్తలపల్లి ఆర్డీటీ లేదా, అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించాలని నిర్ణయించామన్నా రు. మరోవైపు చైల్డ్‌లైన్ వారు కూడా వచ్చి వీలైతే శిశువును తమ సంరక్షణలో ఉంచుకునేందుకు ప్రయత్నం చేశారు. ఆలోగానే శ్వాస అందక శిశువు మృతి చెందాడు. -
బైక్‌ను ఢీకొన్న ఆటో.. ముగ్గురికి గాయాలు
తలుపుల: అనంతపురం జిల్లా తలుపుల మండలం కొరుగుడ్డుపల్లి వద్ద ఆదివారం సాయంత్రం ద్విచక్ర వాహనాన్ని ఆటో ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కదిరి వైపు వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి వచ్చిన ఆటో ఢీకొంది. ఆటో డ్రైవర్ వన్నం రాజ, ద్విచక్ర వాహనంపై వెళ్తోన్న చౌడప్ప, శ్రీనివాస్ గాయపడ్డారు. ముగ్గురినీ కదిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో చౌడప్ప పరిస్థితి విషమంగా ఉంది.