kaidi No 150
-
అభిమానుల ఆగ్రహం..థియేటర్ ధ్వంసం
వేమూరు(గుంటూరు): పదేళ్ల అనంతరం మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నంబర్ 150 చిత్రంలో ఒకానొక సందర్భంలో కొల్లూరు పేరు వినిపిస్తుంది. అసలే చిరంజీవిపై అభిమానం... పైగా తమ అభిమాన హీరో నోటి వెంట తమ ఊరిపేరు వినిపించడం. సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని కొల్లూరు గ్రామస్తులు ఉవ్విళ్లూరారు. అర్ధరాత్రి సినిమా చూపిస్తామని చెప్పి టిక్కెట్లు అమ్మి, తీరా తెల్లవారుజాము వరకు సినిమా ప్రదర్శించకపోవడంతో అభిమానులకు చిర్రెత్తుకొచ్చింది. వారి ఆగ్రహానికి థియేటర్ స్క్రీన్ చిరిగిపోయింది. కుర్చీలు ముక్కలయ్యాయి. తలుపులు పగిలిపోయాయి. గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు.. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నంబర్ 150 చిత్రం విడుదలైన స్థానిక శ్రీనివాస టాకీస్ నిర్వాహకులు, చిత్రం కొనుగోలుదారుల నుంచి వేరే వ్యక్తులు ఫ్యాన్స్ కోసం బెనిఫిట్ షోను రూ.70 వేలకు కొనుగోలు చేసి టికెట్ల విక్రయాలు చేపట్టారు. చిరంజీవి సినిమా మొదటి ఆట చూడాలన్న అభిమానుల ఉత్సుకతను సొమ్ము చేసుకునేందుకు అర్ధరాత్రి రెండు గంటలకే చిత్ర ప్రదర్శన ఉంటుందని చెప్పి టికెట్ల విక్రయాలు చేపట్టారు. టిక్కెట్లు కొనుగోలు చేసిన అభిమానులు తీరా లోపలికి వెళ్లగా, చిరంజీవి చిత్రం బదులు వేరే డబ్బింగ్ చిత్ర ప్రదర్శన ప్రారంభించారు. దీంతో ఆగ్రహం చెందిన అభిమానులు ఆందోళనకు దిగారు. దీంతో థియేటర్ నిర్వాహకులు ఆ సినిమా ప్రదర్శన నిలిపివేశారు. చిరంజీవి చిత్ర ప్రదర్శనకు సంబంధించిన డిజిటల్ లాక్ చేరడం ఆలస్యమైందంటూ కాలం గడిపారు. తెల్లవారు జామున నాలుగున్నర వరకూ అభిమానులు ఓపిగ్గా ఎదురుచూశారు. ఈలోగా ఇతర ప్రాంతాల్లో చిత్ర ప్రదర్శన ప్రారంభమైందని అక్కడి అభిమానులు, మిత్రులు సెల్ఫోన్ల ద్వారా సందేశాలివ్వడంతో ఇక్కడి అభిమానులు సహనం కోల్పోయి అదనపు కుర్చీలు, బల్లలు, ధియేటర్ తలుపులు, ఫ్యాన్లు ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా థియేటర్లో టపాసులు పేల్చుతూ, కుర్చీలను స్క్రీన్ పైకి విసురుతూ పూర్తిగా చించివేశారు. థియేటర్ వద్ద బందోబస్తులో ఉన్న పోలీసు సిబ్బంది థియేటర్ ధ్వంసం గురించి ఎస్ఐ అద్దంకి వెంకటేశ్వరరావుకు సమాచారం అందించగా, ఆయన సిబ్బందితో రంగప్రవేశం చేసి అభిమానులపై లాఠీ చార్జి చేసి చెదరగొట్టారు. ఈ సంఘటనతో రూ.లక్షల్లో ఆస్తి నష్టం సంభవించినట్టు నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిర్వాహకుల ఫిర్యాదు ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. -
థియేటర్‌పై ‘ఖైదీ’ అభిమానుల దాడి
-
థియేటర్‌పై ‘ఖైదీ’ అభిమానుల దాడి
గుంటూరు : మెగా ఫ్యాన్స్ అభిమానం హద్దు మీరింది. తమ అభిమాన హీరో సినిమా ప్రదర్శన ఆలస్యం కావడంతో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ థియేటర్‌పై దాడికి దిగారు. ఈ ఘటన గుంటూరు జిల్లా కొల్లూరులో చోటుచేసుకుంది. వీవీ వినాయక్ దర్శకత్వంలో చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 చిత్రం బెనిఫిట్ షో వేస్తామని శ్రీనివాస థియేటర్ యాజమాన్యం తెలిపింది. అయితే బుధవారం తెల్లవారుజాము వరకూ బెనిఫిట్ షో వేయకపోవడంతో అభిమానులు రెచ్చిపోయారు. థియేటర్లోని కుర్చీలతో పాటు స్క్రీన్‌ను ధ్వంసం చేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రంగప్రవేశం చేసి లాఠీఛార్జ్ చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఖైదీ నెంబర్ 150 చిత్రం ఇవాళ (బుధవారం) ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. -
‘హండ్రెడ్ డేస్ ఆడే సినిమా నీదే అన్నయ్య’
హైదరాబాద్: చాలా ఏళ్ల తర్వాత మరోసారి వెండితెరపై వెలిగేందుకు మెగాస్టార్ చిరంజీవి తన 150వ చిత్రం ఖైదీ నెంబర్ 150తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం విడుదల గడువు దగ్గరపడుతున్నకొద్ది ఈ చిత్రంపై మరింత ఆసక్తిని పెంచే అంశాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన తొలి ప్రచార చిత్రం నుంచి ఇప్పటి వరకు చక్కర్లు కొడుతున్న గాసిప్స్ అన్నీ కూడా అభిమానులను ఊపేస్తున్నాయి. అలాంటిది తాజాగా మరోసారి చిరు అభిమానులు పండగ చేసుకునేలా ఏకంగా ఆయన అభిమానులు ఓ ప్రత్యేక గీతాన్ని రూపొందించారు. ప్రముఖ గాయకుడు హేమచంద్రతో ఈ గీతాన్ని పాడించడంతో దానికి మరింత క్రేజ్ ఏర్పడింది. ‘జై చిరంజీవా.. జై చిరంజీవా.. రావా! సై అంటు రావా, చిందులేయవా, మాకోసం రావా.. అంటూ మూతపడిన థియేటర్సే మోతే మోగాలా.. ఈ సీడ్ మూవీస్‌లో కూడా ఫుల్ బోర్డు పెట్టాలా అని సాగుతూ ఆర్టీసీ రోడ్డు, బెజవాడ సర్కిల్ వార్డు.. తెలంగాణ మొత్తం వేచి చూడాలా..’ అంటూ సాగే ఈ పాటకు అద్భుతమైన మ్యూజిక్ తోడై ఇప్పుడు యూట్యూబ్‌లో తెగ హల్ చల్ చేస్తోంది. అంతేకాదు.. చిరు సినిమాలే లేక 100 రోజులు ఆడేరోజులు పోయాయని, అలా మళ్లీ ఆడేసినిమా నీదే అన్నయ్యా అంటూ, బుకింగ్ కౌంటర్ల వద్ద బోర్ కొడుతుందంటూ తమ అభిమానాన్ని ఈ పాటలో చాటుకున్నారు. ఈ గీతానికి సత్యసాగర్ పొలం సంగీతం, సాహిత్యం అందించారు. ఈ పాటను ఇప్పటికే 84,219 మంది చూడగా దాదాపు 3000మంది చాలా బాగుందంటూ లైక్ కొట్టేశారు. -
'భోగి' రోజునే చిరు వస్తున్నాడు
తూర్పుగోదావరి: అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతూ మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న 150వ చిత్రం 'ఖైదీ నెంబర్ 150'కి సంబంధించి తాజా అప్ డేట్స్ వచ్చాయి. చిత్ర దర్శకుడు వీవీ వినాయక్ సినిమా విడుదల రోజును ప్రకటించారు. సంక్రాంతి సందర్భంగా భోగి రోజున సినిమాను విడుదల చేస్తామని వినాయక్ చెప్పారు. ఈ సినిమాతో మెగాస్టార్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. అటు చిరు అభిమానులతోపాటు మొత్తం ప్రేక్షకులంతా ఈ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. అందుకు తగినట్లుగానే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వి.వి.వినాయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ పతాకంపై మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. బుధవారం రాజమహేంద్రవరం పుష్కర ఘాట్‌లో విద్యాగణపతిని సందర్శించిన వీ వినాయక్ అనంతరం మీడియాతో మాట్లాడారు. భోగి రోజున విడుదలయ్యే ఈ చిత్రం ఒక్క అభిమానులనే కాకుండా ప్రతి ఒక్కరినీ అలరించేలా ఉంటుందని వివరించారు.