
‘హండ్రెడ్ డేస్ ఆడే సినిమా నీదే అన్నయ్య’
హైదరాబాద్: చాలా ఏళ్ల తర్వాత మరోసారి వెండితెరపై వెలిగేందుకు మెగాస్టార్ చిరంజీవి తన 150వ చిత్రం ఖైదీ నెంబర్ 150తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం విడుదల గడువు దగ్గరపడుతున్నకొద్ది ఈ చిత్రంపై మరింత ఆసక్తిని పెంచే అంశాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన తొలి ప్రచార చిత్రం నుంచి ఇప్పటి వరకు చక్కర్లు కొడుతున్న గాసిప్స్ అన్నీ కూడా అభిమానులను ఊపేస్తున్నాయి. అలాంటిది తాజాగా మరోసారి చిరు అభిమానులు పండగ చేసుకునేలా ఏకంగా ఆయన అభిమానులు ఓ ప్రత్యేక గీతాన్ని రూపొందించారు.
ప్రముఖ గాయకుడు హేమచంద్రతో ఈ గీతాన్ని పాడించడంతో దానికి మరింత క్రేజ్ ఏర్పడింది. ‘జై చిరంజీవా.. జై చిరంజీవా.. రావా! సై అంటు రావా, చిందులేయవా, మాకోసం రావా.. అంటూ మూతపడిన థియేటర్సే మోతే మోగాలా.. ఈ సీడ్ మూవీస్‌లో కూడా ఫుల్ బోర్డు పెట్టాలా అని సాగుతూ ఆర్టీసీ రోడ్డు, బెజవాడ సర్కిల్ వార్డు.. తెలంగాణ మొత్తం వేచి చూడాలా..’ అంటూ సాగే ఈ పాటకు అద్భుతమైన మ్యూజిక్ తోడై ఇప్పుడు యూట్యూబ్‌లో తెగ హల్ చల్ చేస్తోంది. అంతేకాదు.. చిరు సినిమాలే లేక 100 రోజులు ఆడేరోజులు పోయాయని, అలా మళ్లీ ఆడేసినిమా నీదే అన్నయ్యా అంటూ, బుకింగ్ కౌంటర్ల వద్ద బోర్ కొడుతుందంటూ తమ అభిమానాన్ని ఈ పాటలో చాటుకున్నారు. ఈ గీతానికి సత్యసాగర్ పొలం సంగీతం, సాహిత్యం అందించారు. ఈ పాటను ఇప్పటికే 84,219 మంది చూడగా దాదాపు 3000మంది చాలా బాగుందంటూ లైక్ కొట్టేశారు.