పార్టీని నిర్లక్ష్యం చేస్తే ప్రత్యామ్నాయం చూసుకుంటా
- పార్టీ సమన్వయ కమిటీ భేటీలో నేతలకు చంద్రబాబు స్పష్టీకరణ
- పురపాలక ఎన్నికలపై నేడు నిర్ణయం.. 21న పొలిట్‌బ్యూరో భేటీ
సాక్షి, అమరావతి: పార్టీ కార్యక్రమాల నిర్వహణపై నేతలు నిర్లక్ష్యం గా వ్యవహరిస్తే ప్రత్యామ్నాయం చూసుకుంటానని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రతినెలా పార్టీపరంగా నిర్వహించాల్సిన సమావేశాలు, కార్యక్రమాలపట్ల శ్రద్ధ వహించటంతోపాటు పనితీరు మెరుగుపరుచుకోకపోతే ఇబ్బంది పడతారని నేతలను హెచ్చరించారు. టీడీపీ రాష్ట్ర సమన్వయ కమిటీ సమావేశం విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం జరిగింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్, ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు, మంత్రులు, తదితరులు పాల్గొన్నారు. సమావేశ వివరాల్ని కళా వెంకట్రావు వెల్లడించారు. ఆయన వెల్లడించిన వివరాలతోపాటు సమావేశానికి హాజరైనవారి నుంచి సేకరించిన వివరాల ప్రకారం.. పనితీరు బాగా లేనివారికి ఏ ఎన్నికల్లో సీట్లు ఇవ్వనని సీఎం స్పష్టం చేశారు.
నవంబర్ 1 నుంచి సభ్యత్వ నమోదు
టీడీపీ సభ్యత్వ నమోదుతోపాటు జనచైతన్యయాత్రల్ని నవంబర్ 1 నుంచి 30 వరకు నిర్వహించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 55 లక్షల సభ్యత్వం చేర్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సభ్యత్వ నమోదు, జనచైతన్యయాత్రల నిర్వహణపై చర్చించేందుకు 21న పార్టీ పొలిట్‌బ్యూరో గుంటూరుజిల్లా ఉండవల్లిలోని బాబు నివాసంలో భేటీ కానుంది. 22 నుంచి 24 వరకు పార్టీ జిల్లా విస్తృతస్థాయి సమావేశాలు, 26, 27 తేదీల్లో నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహిస్తారు. రాష్ట్రంలో 11 కార్పొరేషన్లతోపాటు పురపాలక సంఘాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. పాత ఓటర్ల జాబితా ప్రకారం జనవరిలో, కొత్త ఓటర్ల జాబితా ప్రకారం మార్చిలో ఎన్నికలు నిర్వహించగలమని పురపాలక మంత్రి పి. నారాయణ చెప్పారు.
ఎమ్మెల్సీ ఎన్నికలపై లోకేశ్ చర్చలు
పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికలపై సమావేశంలో చర్చించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీయే గెలవాలని బాబు నేతలకు నిర్దేశించారు. కాగా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీటు ఆశిస్తున్న పలువురు అభ్యర్థులతో లోకేశ్ చర్చించారు.