అధికారులమంటూ ఏలూరు హైవేపై దోపిడి
ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడు మండలం కలపర్రు జాతీయ రహదారిపై దుండగులు మరోసారి తెగబడ్డారు. ఆర్టీఏ అధికారుల ముసుగులో వచ్చిన దుండగులు .... ఓ లారీ డ్రైవర్‌ను కత్తితో పొడిచి నగదుతో పరారయ్యారు. కోల్కటా నుంచి చెన్నై వెళ్తున్న లారీని అర్థరాత్రి బైక్‌లతో వెంబడించిన అయిదుగురు గుర్తు తెలియని వ్యక్తులు దుగ్గిరాల సమీపంలోకి రాగానే లారీని ఆపారు.
డ్రైవర్ సందీప్‌ను కిందకు దింపి విచక్షణారహితంగా కత్తులతో దాడి చేశారు. అతని వద్ద ఉన్న రూ.25వేల నగదును దోచుకెళ్లారు. వెనుకాలే వస్తున్న అదే కంపెనీకి చెందిన మరో లారీ డ్రైవర్ రక్తపు మడుగులో పడివున్న సందీప్‌ను గమనించి పోలీసులకు సమాచారమిచ్చాడు. తీవ్రంగా గాయపడిన సందీప్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటనా స్థలం నుంచి క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేసినట్టు ఏలూరు త్రీ టౌన్ సీఐ తెలిపారు.