యూపీలో ఘోర రైలు ప్రమాదం
సాక్షి, లక్నో : ఉత్తర్ ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ ఖతౌలి వద్ద కళింగ ఉత్కల్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిన ఘటనలో ఇప్పటివరకూ 23 మంది మరణించారు. పెద్దసంఖ్యలో ప్రయాణీకులకు గాయాలయ్యాయి. ప్రమాదంపై రైల్వే మంత్రి సురేష్ ప్రభు విచారణకు ఆదేశించారు. ప్రమాదానికి కారణమైన లోపాలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు చేపడతామన్నారు. శనివారం సాయంత్రం 5.50 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఆరు బోగీలు పట్టాలు తప్పాయి. ఘటనా స్థలానికి మెడికల్ వ్యాన్స్, వైద్య సిబ్బంది చేరుకున్నాయని చెప్పారు.
I am personally monitoring situation.Hv instructed senior officers to reach site immediately and ensure speedy rescue and relief operations https://t.co/OCpgUGhg5y
— Suresh Prabhu (@sureshpprabhu) 19 August 2017
సహాయ కార్యక్రమాలపై తాను స్వయంగా పర్యవేక్షిస్తున్నానని, సహాయ చర్యలను వేగవంతం చేయాలని రైల్వే బోర్డు ఛైర్మన్‌ను ఆదేశించామన్నారు. ఘటనా స్థలానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకుని సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యాయి. ఇప్పటివరకూ 50 మంది ప్రయాణీకులను కాపాడినట్టు అధికారులు తెలిపారు. ఒడిశాలోని పూరి నుంచి ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌కు ట్రైన్ వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. మరోవైపు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాగా, మృతుల కుటుంబాలకు రూ.3.5 లక్షలు, తీవ్రగాయాలైన వారికి రూ.50 వేలు ఎక్స్‌గ్రేషియాగా రైల్వే మంత్రి సురేష్ ప్రభు ప్రకటించారు.