Kaltisara
-
తమిళనాడులో కల్తీ సారాకు 18 మంది బలి
సాక్షి, చెన్నై: తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లా కరుమాపురం గ్రామంలో కల్తీ సారా తాగిన 18 మంది బుధవారం మరణించారు. మరో 90 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో పది మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మృతులలో ప్రవీణ్, సురేష్, శేఖర్, మోహన్, జగదీశ్, సుబ్రమణియన్, మణి ఉన్నారు. మరో ముగ్గురు సాయంత్రం మృతి చెందారు. ఈ సమాచారంతో కల్తీ సారా, సారా సేవించిన వారంతా ఆస్పత్రులకు పరుగులు తీశారు. ప్రస్తుతం కళ్లకురిచ్చి ప్రభుత్వ ఆస్పత్రిలో సారా సేవించిన వారు 90 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో పది మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని జిప్మర్ ఆస్పత్రికి తరలించారు. అయితే, కల్తీ సారా తాగి మరణించినట్టుగా వైద్య పరీక్షల్లో తేలలేదని కళ్లకురిచ్చి కలెక్టర్ శ్రావణ్ కుమార్ స్పష్టం చేశారు. కాగా ఘటనపై విచారణకు ఆదేశించిన ప్రభుత్వం జిల్లా ఎస్పీ సమయసింగ్ మీనాపై సస్పెన్షన్ వేటు వేసింది. అలాగే కలెక్టర్ శ్రావణ్‌కుమార్‌ను బదిలీ చేసింది. 18 ప్రత్యేక వైద్య బృందాలను చెన్నై నుంచి కళ్లకురిచి్చకి పంపించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆ జిల్లాలోని ఎక్సైజ్ విభాగం ఉన్నతాధికారులందరిపై వేటు వేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. -
వంద రోజుల ప్రణాళిక
మహబూబ్‌నగర్‌క్రైం : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో నాటుసారా, కల్తీ కల్లు విక్రయాలను అరికట్టడంతో పాటు మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీ అమలు, సమయపాలనను పరిశీలించేందుకు 100 రోజుల ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ డిప్యూటీ కమిషనర్ జయసేనారెడ్డి వెల్లడించారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ ఆదేశాల మేరకు ఈ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. మహబూబ్‌నగర్‌లోని డీసీ కార్యాలయంలో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రణాళిక వివరాలు వెల్లడించారు. ప్రతీరోజూ.. ప్రతీ స్టేషన్ ఉమ్మడి జిల్లాలో గుడుంబ నియంత్రణ, కల్తీ కల్లు నియంత్రణ, బెల్టు దుకాణాలను అదుపు చేయడంపై ఈ వంద రోజుల్లో ప్రత్యేకంగా దృష్టి సారించనున్నామని డీసీ తెలిపారు. ఈ ప్రణాళికను ఉమ్మడి జిల్లాలో కఠినంగా అమలు చేస్తామని.. ప్రతీ రోజు, ప్రతీ స్టేషన్ ఆధ్వర్యాన ఒక కార్యక్రమం చేపడుతామన్నారు. ప్రణాళికలో తొలి 25రోజుల పాటు ‘ఏ’ గ్రేడ్ గ్రామాల్లో తనిఖీలు, ఆ తర్వాత 25రోజుల పాటు ‘బీ’ గ్రేడ్ గ్రామాలు, మరో 25 రోజులు ‘సీ’ గ్రేడ్ గ్రామాల్లో తనిఖీలు చేశాక చివరి 25రోజులు అన్ని గ్రామాల్లో క్రాస్ తనిఖీలు ఉంటాయని తెలిపారు. ఈ తనిఖీలో స్థానిక పోలీస్ స్టేషన్ సిబ్బంది కాకుండా ఇతర స్టేషన్ల చెందిన సిబ్బంది పాల్గొంటారని చెప్పారు. రాబోయో 25రోజుల్లో జిల్లాలో 104తనిఖీలు, 111మంది బైండోవర్లు, 134సార్లు పరిశీలన 97శాతం కల్తీ కల్లు, నాటుసారాను కట్టడి చేయనున్నామని వివరించారు. కాగా, గతంలో బైండోవర్ అయిన వ్యక్తులు మళ్లీ అవుతున్నారా అనే అంశాన్ని సిబ్బంది ప్రత్యేకంగా పరిశీలిం చాలని, మద్యం దుకాణాలు సమయపాలన, పర్మిట్ రూం నిబంధనలు అమలుచేస్తు న్నాయా, లేదా అని చూడడంతో ఎమ్మార్పీ ఉల్లంఘనపై నిఘా ఉంచాలని ఆదేశించారు. ఫిర్యాదులకు అవకాశం జిల్లాలో ఎక్కడైనా సారా తయారీ, కల్తీ కల్లు అమ్మకాలతో పాటు మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీ, సమయపాలన ఉల్లంఘించినట్లు తెలిస్తే ఎవరైనా టోల్‌ప్రీ నంబర్ 18004252523కు ఫోన్ చేయొచ్చని డీసీ జయసేనారెడ్డి తెలిపారు. అంతేకాకుండా వ్యక్తిగతంగా ఫిర్యాదు చేయాలనుకుంటే 94409 02282( మహబూబ్‌నగర్ డీసీ) 94409 02607(మహబూబ్‌నగర్ ఈఎస్) 94409 02606 (జోగుళాంబ గద్వాల, వనపర్తి ఈఎస్), 94409 02613 (నాగర్‌కర్నూల్ ఈఎస్)కు ఫిర్యాదు చేయొచ్చని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జోగుళాంబ గద్వాల, వనపర్తి ఇన్చార్జి ఈఎస్ విజయ్‌భాస్కర్, ఎస్ఐ శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
యూపీలో ‘కల్తీ సారా’కు మరణశిక్షే!
లక్నో: కల్తీ సారా అమ్మి అమాయక ప్రజల మరణానికి కారకులయ్యేవారికి మరణశిక్ష విధించే బిల్లును ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ శుక్రవారం ఆమోదించింది. యూపీ ఎక్సైజ్(సవరణ) చట్టం–2017 ప్రకారం కల్తీ సారా వల్ల మరణాలు సంభవిస్తే దాని తయారీతో సంబంధమున్న వారికి మరణశిక్ష లేదా యావజ్జీవంతో పాటు రూ.5లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ జరిమానా విధించవచ్చు. కల్తీ సారాతో అంగవైకల్యం సంభవిస్తే సారా తయారీదారుకు గరిష్టంగా పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తారు. రూ.5 లక్షల వరకూ జరిమానా విధించవచ్చు. ఇటీవలి కాలంలో కల్తీసారాతో వరుస మరణాలు సంభవించడంతో సెప్టెంబర్‌లో ఎక్సైజ్ చట్టానికి సవరణలు చేసి యూపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. -
కల్తీ సారా తాగి 9 మందికి అస్వస్థత
కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గుమ్మాళ్లపల్లిలో కల్తీసారా తాగి 9 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇందులో ఒకరు బుధవారం ఆస్పత్రిలో మృతి చెందారు. మహారాష్ట్రకు చెందిన ఎనగందుల పోశం, మల్లక్క, నిమ్మలగూడంలో ఆత్రం సత్యవార్, ఆత్రం సునీల్, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఎర్రోళ్ల లస్మయ్య, ఒడిపిలవంచకు చెందిన బండి సమ్మయ్య, రాములు, మరో ఇద్దరు గ్రామంలోని సమ్మక్క అనే మహిళ వద్ద సారా తాగారు. ఇందులో సునీల్, సత్యవార్ సోమవారం సారా తాగగా, మిగిలిన వారు మంగళవారం సాయంత్రం సారా తాగారు. తాగిన కొంత సమయానికే వారు వాంతులు, విరేచనాలకు లోనయ్యారు. పోలీసులు వెంటనే బాధితులను మండల కేంద్రం లోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఇందులో ఎలగందుల పోశం, మల్లక్క, ఎర్రోళ్ల లస్మయ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఎంజీఎం, పరకాల ఆస్పత్రులకు తరలించారు. ఈ క్రమంలో ఆదిలాబాద్ జిల్లా సోమన్ పల్లివాసి ఏర్రోళ్ల లస్మయ్య(45) పరకాల ఆస్పత్రిలో చనిపోయాడు. సత్యవార్ పరిస్థితి విషమంగా ఉంది. హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వెం టిలేటర్‌పై చికిత్స పొందుతున్నట్లు సమాచారం. -
మృత్యుసారా
హోలీ సందర్భంగా అప్పటి వరకు చందాలు వసూలు చేశారు. డప్పు దరువుల నడుమ ఆనందంగా డ్యాన్స్‌లు వేశారు. మధ్యమధ్యలో వెళ్లి సారా తాగి వచ్చారు. అదే వారిపాలిట శాపమైంది. ఐదుగుర్ని బలిగొని, ఆరుగుర్ని ఆస్పత్రుల పాలుజేసి గిరిజనుల జీవితాలతో చెలగాటమాడింది. వ్యవసాయ కూలీ పనులు చేసుకునే ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు కల్తీసారా బారిన పడి మృతిచెందడంతో కూసుమంచి మండలం పాలేరు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. దిక్కుతోచని స్థితిలో మృతుల పిల్లలు, బంధువులు రోదిస్తున్న తీరు కన్నీరు పెట్టిస్తోంది. ఆనందంగా హోలీ పండగకు సిద్ధమవుతున్న వారి బతుకుల్లో కల్తీసారా కలకలం రేపింది. రెక్కాడితేగానీ డొక్కాడని వారి బతుకులను ఛిన్నాభిన్నం చేసింది. ఓ కుటుంబంలో తల్లి, ఓ కుటుంబంలో తండ్రి ఇలా ఇంటికిపెద్దదిక్కులైన వారు చనిపోవడంతో పిల్లలు దిక్కులేని వారయ్యారు. మృతులలో గిరిజనులు, వ్యవసాయ కూలీ పనులు చేసుకొని పొట్టపోసుకునే వారు ఉండడంతో ఆ కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారింది. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉండటం కలిచివేసింది. పాలేరు గ్రామానికి చెందిన పుసులూరి రాజయ్య (50) అనే ఆయిల్ వ్యాపారి సారా తయారు చేసి గ్రామంలో విక్రయించాడు. ఈ సారాను రాజయ్యతో పాటు గిరిజనులు రెండురోజులుగా తాగుతున్నారు. రాజయ్య(50) శుక్రవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు అతనిని ఖమ్మం తరలించగా శనివారం ఉదయం మృతిచెందాడు. అతను మృతిచెందిన కొద్ది సేపటికే పాలేరు తండా (భోజ్యాతండా)కు చెందిన అంగోత్ సీత (30) అనే మహిళ స్పృహ తప్పిపడిపోయింది. ఆమెనూ స్థానికులు కూసుమంచిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించటంతో ఖమ్మం తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందింది. ఇదే తండాకు చెందిన బోడ సుజాత (28), బానోత్ లక్ష్మి (50), బాణోత్ బాలాజీ (35) కూడా అస్వస్థతకు గురయ్యారు. వీరిని హూటాహుటిన ఖమ్మం ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ సుజాత, లక్ష్మి మృతిచెందారు. వీరితో పాటు పాలేరుకు చెందిన బత్తుల నాగేశ్వరరావు (45) కూడా మరణించాడు. మరికొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దిక్కుతోచని స్థితిలో కుటుంబాలు.. కల్తీ సారా తాగి మృతిచెందిన వారంతా వ్యవసాయ కూలీలే. రెక్కల కష్టంతో కుటుంబాలను పోషిస్తున్నారు. వీరి మరణంతో ఆ కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో పడ్డాయి. వీరిలో ఆంగోత్ సీతను భర్త వదిలేశాడు. కూలీ పనులకు వెళ్తూ కుమార్తె రేణుకను ఆమె పోషిస్తోంది. రేణుక కూసుమంచిలో ఇంటర్ చదువుతోంది. ఈమెకు ఇటీవలే వివాహం నిశ్చమయింది. తల్లి మృతితో ఆమె దిక్కులేనిదైంది. మరో మృతురాలు సుజాతకు నాలుగేళ్ల కుమార్తె ఉంది. తల్లి మృతి విషయం తెలియక ఆ చిన్నారి అమాయక చూపులు చూస్తుండటం అక్కడున్న వారికి కంటనీరు తెప్పించింది. మిగిలిన మృతులు లక్ష్మి, నాగేశ్వరరావుకు ముగ్గురు పిల్లల చొప్పున ఉన్నారు. వీరంతా ఏకాకులుగా మిగిలారు. గ్రామంలో ఒకేరోజు ఐదుగురు మృతిచెందడంతో శనివారం ఊరుఊరంతా మూగబోయింది. పోలీసుల అదుపులో బాధ్యులు.. మృతుడు రాజయ్య కుమారుడు శ్రీకాంత్‌ను, ఆల్కాహాల్ విక్రయించిన మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతుడు రాజయ్య మూడురోజుల క్రితం అరలీటర్ మిథానాల్ను ట్యాంకర్ డ్రైవర్ నుంచి కొనుగోలు చేసి తెచ్చాడు. దాన్ని సారాలా తయారు చేసి తాను తాగడంతో పాటు ఇతరులకు విక్రయించాడు. ఈ సారాయే రాజయ్య ప్రాణాలు తీయడంతో పాటు ఇంతటి ఘోరానికి కారణమైంది. దుర్ఘటనపై పూర్తిస్థాయి విచారణ: కలెక్టర్ పాలేరు దుర్ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ శ్రీనివాసశ్రీనరే శ్ పేర్కొన్నారు. పాలేరులో కల్తీ సారాతాగి శనివారం మృతిచెందిన వారి కుటుంబాలను కలెక్టర్, ఎస్పీ ఏవీ రంగనాథ్‌తో కలిసి పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. కల్తీసారా ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తామన్నారు. మిథైల్ ఆల్కాహాల్ సేవించిన పలువురు మృతిచెందగా, అస్వస్థులైన పలువురు ఆస్పత్రుల్లో ఉన్నారన్నారు. ఇంకా ఎవరైనా అస్వస్థతకు గురైతే వెంటనే ఆస్పత్రుల్లో చేర్పించాలని ఆదేశించామన్నారు. గ్రామంలో ఆరు అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచామన్నారు. వైద్యశిబిరాన్నీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇంటింటికి తిరుగుతూ అస్వస్థలు ఎవరైనా ఉంటే వైద్యసేవలు అందించాలని డీఎంహెచ్ఓను ఆదేశించామన్నారు. స్పిరిట్ వ్యాపారులపై కఠిన చర్యలు: ఎస్పీ రంగనాథ్ పాలేరు కేంద్రంగా కొందరు ఆయిల్స్‌తో పాటు స్పిరిట్‌నూ విక్రయిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అటువంటి వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఏవీ రంగనాథ్ అన్నారు. మిథైల్ ఆల్కాహాల్ తాగడం వల్లే ప్రాణనష్టం జరిగిందన్నారు. ఈ ఘటనకు బాధ్యుడైన మృతుడు రాజయ్య కుమారున్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు. తన తండ్రి మిథైల్ ఆల్కాహాల్‌ను ట్యాంకర్ డ్రైవర్ నుంచి కొనుగోలు చేసి సారాగా తయారు చేశాడని రాజయ్య కుమారుడు శ్రీకాంత్ కలెక్టర్, ఎస్పీల సమక్షంలో ఒప్పుకున్నాడు. ఆ సారాను విక్రయించినట్లు అంగీకరించాడు. మిథైల్ ఆల్కాహాలే కారణం: డాక్టర్లు శుక్రవారం సాయంత్రం పాలేరులో నిలిపివున్న ట్యాంకర్లో నుంచి మిథైల్ ఆల్కాహాల్ (పర్షియల్ డయాడ్) అనే రసాయనాన్ని స్థానికులు తీసుకున్నారు. చూడటానికి అచ్చం సారా, స్పిరిట్‌లా ఉండే ఈ రసాయనాన్ని తాగే మృతిచెంది ఉంటారని డాక్టర్లు భావిస్తున్నారు. ఈ రసాయనాన్ని మందుల తయారీకి ఉపయోగిస్తారని తెలిపారు. ప్రభుత్వ వైద్యుడు గంగరాజు బాధితులను పరీక్షించారు. మిథైల్ ఆల్కాహాల్ తాగినట్లు తెలిపారు. సారా తాగడం వల్ల మృతిచెందలేదు: విజయ్‌కుమార్, ఎక్సైజ్ సీఐ కల్తీసారా తాగడం వల్ల మృతిచెందలేదు..రసాయనిక పదార్థాలు తాగడం వల్లే మృతిచెందారని ఎక్సైజ్ సీఐ విజయ్‌కుమార్ తెలిపారు. బాణోత్ లక్ష్మి, వడ్త్యా సుజాత మృతదేహాలను ఆయన సందర్శించారు. హైదరాబాద్‌లోని కెమికల్ ఫ్యాక్టరీకి పర్షియల్ డయాడ్ అనే రసాయన పదార్థాన్ని తరలిస్తున్న లారీ పాలేరులో ఆగింది. అందులో ఉన్నది సారాగా భావించి తాగడం వల్లే మృతిచెందారని అన్నారు. జిల్లా కేంద్ర ఆస్పత్రిలో... జిల్లాకేంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను జిల్లా కలెక్టర్ శ్రీనివాసశ్రీనరేశ్, ఎస్పీ రంగనాథ్ శనివారం రాత్రి పరామర్శించారు. మందు ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు. ఎవరి వద్ద కొనుగోలు చేశారో బాధితులను అడిగి తెలుసుకున్నారు. వారి వెంట అర్బన్ తహశీల్దార్ రాజామహేందర్రెడ్డి, డీసీహెచ్ఎస్ ఆనందవాణి, మెడికల్ సూపరటెండెంట్ సుబ్బయ్య తదితరులు ఉన్నారు.