మృత్యుసారా | Mrtyusara | Sakshi
Sakshi News home page

మృత్యుసారా

Published Sun, Mar 16 2014 2:58 AM | Last Updated on Fri, Sep 28 2018 7:14 PM

మృత్యుసారా - Sakshi

మృత్యుసారా

 హోలీ సందర్భంగా అప్పటి వరకు చందాలు వసూలు చేశారు. డప్పు దరువుల నడుమ ఆనందంగా డ్యాన్స్‌లు వేశారు. మధ్యమధ్యలో వెళ్లి సారా తాగి వచ్చారు. అదే వారిపాలిట శాపమైంది. ఐదుగుర్ని బలిగొని, ఆరుగుర్ని ఆస్పత్రుల పాలుజేసి గిరిజనుల జీవితాలతో చెలగాటమాడింది. వ్యవసాయ కూలీ పనులు చేసుకునే ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు కల్తీసారా బారిన పడి మృతిచెందడంతో కూసుమంచి మండలం పాలేరు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. దిక్కుతోచని స్థితిలో మృతుల పిల్లలు, బంధువులు రోదిస్తున్న తీరు కన్నీరు పెట్టిస్తోంది.
 
ఆనందంగా హోలీ పండగకు సిద్ధమవుతున్న వారి బతుకుల్లో కల్తీసారా కలకలం రేపింది. రెక్కాడితేగానీ డొక్కాడని వారి బతుకులను ఛిన్నాభిన్నం చేసింది. ఓ కుటుంబంలో తల్లి, ఓ కుటుంబంలో తండ్రి ఇలా ఇంటికిపెద్దదిక్కులైన వారు చనిపోవడంతో పిల్లలు దిక్కులేని వారయ్యారు. మృతులలో గిరిజనులు, వ్యవసాయ కూలీ పనులు చేసుకొని పొట్టపోసుకునే వారు ఉండడంతో ఆ కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారింది. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉండటం కలిచివేసింది.

 పాలేరు గ్రామానికి చెందిన పుసులూరి రాజయ్య (50) అనే ఆయిల్ వ్యాపారి సారా తయారు చేసి గ్రామంలో విక్రయించాడు. ఈ సారాను రాజయ్యతో పాటు గిరిజనులు రెండురోజులుగా తాగుతున్నారు. రాజయ్య(50)  శుక్రవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు అతనిని ఖమ్మం తరలించగా శనివారం ఉదయం మృతిచెందాడు. అతను మృతిచెందిన కొద్ది సేపటికే పాలేరు తండా (భోజ్యాతండా)కు చెందిన  అంగోత్ సీత (30) అనే మహిళ  స్పృహ తప్పిపడిపోయింది.

ఆమెనూ స్థానికులు కూసుమంచిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించటంతో ఖమ్మం తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందింది. ఇదే తండాకు చెందిన  బోడ సుజాత (28), బానోత్ లక్ష్మి (50), బాణోత్ బాలాజీ (35) కూడా అస్వస్థతకు గురయ్యారు. వీరిని హూటాహుటిన  ఖమ్మం ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ సుజాత, లక్ష్మి మృతిచెందారు. వీరితో పాటు పాలేరుకు చెందిన బత్తుల నాగేశ్వరరావు (45) కూడా మరణించాడు. మరికొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
 దిక్కుతోచని స్థితిలో కుటుంబాలు..
 

కల్తీ సారా తాగి మృతిచెందిన వారంతా వ్యవసాయ కూలీలే. రెక్కల కష్టంతో కుటుంబాలను పోషిస్తున్నారు. వీరి మరణంతో ఆ కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో పడ్డాయి. వీరిలో ఆంగోత్ సీతను భర్త వదిలేశాడు. కూలీ పనులకు వెళ్తూ కుమార్తె రేణుకను ఆమె పోషిస్తోంది. రేణుక కూసుమంచిలో ఇంటర్ చదువుతోంది. ఈమెకు ఇటీవలే వివాహం నిశ్చమయింది. తల్లి మృతితో ఆమె దిక్కులేనిదైంది. మరో మృతురాలు సుజాతకు నాలుగేళ్ల కుమార్తె ఉంది. తల్లి మృతి విషయం తెలియక ఆ చిన్నారి అమాయక చూపులు చూస్తుండటం అక్కడున్న వారికి కంటనీరు తెప్పించింది. మిగిలిన మృతులు లక్ష్మి, నాగేశ్వరరావుకు ముగ్గురు పిల్లల చొప్పున ఉన్నారు. వీరంతా ఏకాకులుగా మిగిలారు. గ్రామంలో ఒకేరోజు ఐదుగురు మృతిచెందడంతో శనివారం ఊరుఊరంతా మూగబోయింది.  
 

పోలీసుల అదుపులో బాధ్యులు..
 

మృతుడు రాజయ్య కుమారుడు శ్రీకాంత్‌ను, ఆల్కాహాల్ విక్రయించిన మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతుడు రాజయ్య మూడురోజుల క్రితం అరలీటర్ మిథానాల్‌ను ట్యాంకర్ డ్రైవర్ నుంచి కొనుగోలు చేసి తెచ్చాడు. దాన్ని సారాలా తయారు చేసి తాను తాగడంతో పాటు ఇతరులకు విక్రయించాడు. ఈ సారాయే రాజయ్య ప్రాణాలు తీయడంతో పాటు ఇంతటి ఘోరానికి కారణమైంది.

 దుర్ఘటనపై పూర్తిస్థాయి విచారణ: కలెక్టర్
 

పాలేరు దుర్ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ శ్రీనివాసశ్రీనరే శ్ పేర్కొన్నారు.    పాలేరులో కల్తీ సారాతాగి శనివారం మృతిచెందిన వారి కుటుంబాలను కలెక్టర్, ఎస్పీ ఏవీ రంగనాథ్‌తో కలిసి పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. కల్తీసారా ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తామన్నారు. మిథైల్ ఆల్కాహాల్ సేవించిన పలువురు మృతిచెందగా, అస్వస్థులైన పలువురు ఆస్పత్రుల్లో ఉన్నారన్నారు. ఇంకా ఎవరైనా అస్వస్థతకు గురైతే వెంటనే ఆస్పత్రుల్లో చేర్పించాలని ఆదేశించామన్నారు. గ్రామంలో ఆరు అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచామన్నారు. వైద్యశిబిరాన్నీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇంటింటికి తిరుగుతూ అస్వస్థలు ఎవరైనా ఉంటే వైద్యసేవలు అందించాలని డీఎంహెచ్‌ఓను ఆదేశించామన్నారు.

 స్పిరిట్ వ్యాపారులపై కఠిన చర్యలు: ఎస్పీ రంగనాథ్

 పాలేరు కేంద్రంగా కొందరు ఆయిల్స్‌తో పాటు స్పిరిట్‌నూ విక్రయిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అటువంటి వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఏవీ రంగనాథ్ అన్నారు. మిథైల్ ఆల్కాహాల్ తాగడం వల్లే ప్రాణనష్టం జరిగిందన్నారు. ఈ ఘటనకు బాధ్యుడైన మృతుడు రాజయ్య కుమారున్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు. తన తండ్రి మిథైల్ ఆల్కాహాల్‌ను ట్యాంకర్ డ్రైవర్ నుంచి కొనుగోలు చేసి సారాగా తయారు చేశాడని రాజయ్య కుమారుడు శ్రీకాంత్ కలెక్టర్, ఎస్పీల సమక్షంలో ఒప్పుకున్నాడు. ఆ సారాను విక్రయించినట్లు అంగీకరించాడు.

 మిథైల్ ఆల్కాహాలే కారణం: డాక్టర్లు

 శుక్రవారం సాయంత్రం పాలేరులో నిలిపివున్న ట్యాంకర్‌లో నుంచి మిథైల్ ఆల్కాహాల్ (పర్షియల్ డయాడ్) అనే రసాయనాన్ని స్థానికులు తీసుకున్నారు. చూడటానికి అచ్చం సారా, స్పిరిట్‌లా ఉండే ఈ రసాయనాన్ని తాగే మృతిచెంది ఉంటారని డాక్టర్లు భావిస్తున్నారు. ఈ రసాయనాన్ని మందుల తయారీకి ఉపయోగిస్తారని తెలిపారు. ప్రభుత్వ వైద్యుడు గంగరాజు బాధితులను పరీక్షించారు. మిథైల్ ఆల్కాహాల్ తాగినట్లు తెలిపారు.

 సారా తాగడం వల్ల మృతిచెందలేదు: విజయ్‌కుమార్, ఎక్సైజ్ సీఐ

 కల్తీసారా తాగడం వల్ల మృతిచెందలేదు..రసాయనిక పదార్థాలు తాగడం వల్లే మృతిచెందారని ఎక్సైజ్ సీఐ విజయ్‌కుమార్ తెలిపారు. బాణోత్ లక్ష్మి, వడ్త్యా సుజాత మృతదేహాలను ఆయన సందర్శించారు. హైదరాబాద్‌లోని కెమికల్ ఫ్యాక్టరీకి పర్షియల్ డయాడ్ అనే రసాయన పదార్థాన్ని తరలిస్తున్న లారీ పాలేరులో ఆగింది. అందులో ఉన్నది సారాగా భావించి తాగడం వల్లే మృతిచెందారని అన్నారు.
 

జిల్లా కేంద్ర ఆస్పత్రిలో...

 జిల్లాకేంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను జిల్లా కలెక్టర్ శ్రీనివాసశ్రీనరేశ్, ఎస్పీ రంగనాథ్ శనివారం రాత్రి పరామర్శించారు. మందు ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు. ఎవరి వద్ద కొనుగోలు చేశారో బాధితులను అడిగి తెలుసుకున్నారు. వారి వెంట అర్బన్ తహశీల్దార్ రాజామహేందర్‌రెడ్డి, డీసీహెచ్‌ఎస్ ఆనందవాణి, మెడికల్ సూపరటెండెంట్ సుబ్బయ్య తదితరులు ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement