Kalwakurthy Ethipothala Project
-
కల్వకుర్తి ప్రమాదానికి బాధ్యత ఎవరిది..?
సాక్షి, హైదరాబాద్: కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్లో జరిగిన ప్రమాదం చాలా దారుణమని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కల్వకుర్తి లిప్ట్ ఇరిగేషన్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 3.20లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తోంది. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల నిన్న పంపులు బ్లాస్ట్ అయ్యాయి. సీఎం కేసీఆర్ పాలమూరు ప్రజలకు క్షమాపణ చెప్పాలి. కల్వకుర్తికి 400 మీటర్ల దూరంలో పాలమూరు- రంగారెడ్డి చేపడితే ప్రమాదం ఏర్పడుతుంది. ఇదే విషయాన్ని 2016 జూన్ 20న ఎక్స్పర్ట్ కమిటీ నివేదిక ఇచ్చింది. (నీట మునిగిన ‘కేఎల్ఐ’ మోటార్లు) మేం ఇదే విషయాన్ని అసెంబ్లీ వేదికగా చెప్పిన కేసీఆర్ పెడచెవిన పెట్టారు. మీరు కట్టే ప్రాజెక్టులకు నీళ్లు రావు. జేబుల్లోకి కమీషన్లు మాత్రమే వెళ్తాయి. కల్వకుర్తి ప్రమాదానికి బాధ్యత ఎవరిది..? ఇరిగేషన్ శాఖ సీఎం వద్దే ఉంది. వేల కోట్ల నష్టం వాటిల్లేలా చేసిన సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలి. దీని మీద జ్యుడిషియరీ కమిషన్ వేయాలి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. అక్కడకు పరిశీలించడానికి వెళ్లిన కాంగ్రెస్ బృందాన్ని పోలీసులు అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం' అని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. -
జూన్‌కు సరళాసాగర్ సిద్ధం
సాక్షి, హైదరాబాద్ : భారీగా వచ్చి చేరిన వరద కారణంగా గండి పడ్డ సరళాసాగర్ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో సిద్ధం చేసేందుకు ఆరు నెలలు పట్టే అవకాశం ఉంది. జూన్ ఖరీఫ్ సీజన్ ఆరంభమయ్యే నాటికి నీటి నిల్వకు అనుగుణంగా నీటిపారుదల శాఖ మరమ్మతులు చేయనున్నారు. అప్పటివరకు రింగ్‌బండ్ నిర్మాణం చేసి, దీనికింద ఉన్న ఆయకట్టుకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నీరందించనున్నారు. మూడు రోజుల కిందట సరళాసాగర్‌కు స్పిల్‌వేకు ఎడమ వైపు కట్టకు భారీ గండి పడిన విషయం తెలిసిందే. ఈ కారణంగా 80మీటర్ల మేర కట్ట నిర్మాణం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. దీనికి దారితీసిన కారణాలు ఇప్పటికీ తెలియలేదు. కట్టకు బొరియలు ఏర్పడటంలో నీరు అందులోకి చేరి ఉంటుందని, పూర్తిస్థాయి నీటి నిల్వలు చేరడంతో ఒత్తిడికి కట్ట తెగిపోయి ఉంటుందని అంచనా. అయితే కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా తరలించే నీటితో సరళాసాగర్ కుడి, ఎడమ కాల్వల కింద 4,500 ఎకరాల మేర ఆయకట్టుకు నీరందించాల్సి ఉంది. ఆయకట్టుకు నీటిని అందించేలా రింగ్‌బండ్, సమాంతర కాల్వను తవ్వాలని ఇంజనీర్లు నిర్ణయించారు. ప్రాజెక్టుపై ఉన్న ఒక స్లూయిస్ ద్వారా కాల్వలకు 60 క్యూసెక్కుల నీటిని తరలించవచ్చని ఇంజనీర్లు చెబుతున్నారు. ప్రస్తుతానికి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నీటిని తరలించి, అనంతరం తెగిన 80 మీటర్ల కట్ట నిర్మాణాన్ని పటిష్టంగా నిర్మాణం చేయాలని నిర్ణయించారు.ప్రస్తుతం పూర్తి స్థాయి కట్ట నిర్మాణం చేయాలంటే, అంచనాలు రూపొందించి, ప్రభుత్వ అనుమతి తీసుకొని, మళ్లీ డ్రాయింగ్స్ సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ జరగడానికి మరో నెల, రెండు నెలల గడువు పట్టే అవకాశం ఉంది. తెగిన కట్ట నిర్మాణానికి కనీసంగా రూ.6 కోట్ల నుంచి రూ.7 కోట్లు మేర ఖర్చవుతుందని అంచనా. -
ట్రయల్‌రన్‌కు సిద్ధమవుతున్న జొన్నలబొగుడ
పెద్దకొత్తపల్లి: కేఎల్ఐ పథకంలో రెండవ లిప్టు జొన్నలబొగుడ మోటార్ల ట్రయల్ రన్‌కోసం ప్రాజెక్టు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. గత 15ఏళ్ల నుంచి రిజర్వాయర్ పనులు కొనసాగుతుండటంతో ఎంతో కాలంగా రైతులు ఎదురుచూస్తున్న సాగునీరు అందించేందుకు అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. రెండు రోజుల్లో మొదటి మోటారును రన్ చేయించి రిజర్వాయర్‌లోకి 2.8టీఎంసీల నీటిని నింపేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. సర్జిపుల్ సంపు వద్ద పనులు పూర్తి కావడం వల్ల సింగోటం రిజర్వాయర్ ద్వారా నీటిని పంపులోకి వదిలారు. మోటారు రన్ అయిన వెంటనే రిజర్వాయర్‌లోకి ఎత్తిపోసేందుకు కృషి చేస్తున్నారు. విద్యుత్ పనులు పూరై్తనట్లు అధికారులు తెలిపారు. మోటారు రన్ కాకపోవడంతో రెండు రోజుల నుంచి అక్కడే మకాం వేసి సాంకేతిక లోపాలను సరి చేస్తున్నారు. జొన్నలబొగుడ నుంచి గుడిపల్లి రిజర్వాయర్ ద్వారా నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, అచ్చంపేట నియోజకవర్గాల్లోని లక్షా 50వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు అధికారులు కాలవలో ఉన్నచెట్లను తొలగిస్తున్నారు. ఈ నెల చివరి వరకు మోటార్లను పరి చేయించి సాగునీరు నింపుతామని సీఈ ఖగేందర్ తెలిపారు.