సాక్షి, హైదరాబాద్ : భారీగా వచ్చి చేరిన వరద కారణంగా గండి పడ్డ సరళాసాగర్ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో సిద్ధం చేసేందుకు ఆరు నెలలు పట్టే అవకాశం ఉంది. జూన్ ఖరీఫ్ సీజన్ ఆరంభమయ్యే నాటికి నీటి నిల్వకు అనుగుణంగా నీటిపారుదల శాఖ మరమ్మతులు చేయనున్నారు. అప్పటివరకు రింగ్‌బండ్ నిర్మాణం చేసి, దీనికింద ఉన్న ఆయకట్టుకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నీరందించనున్నారు. మూడు రోజుల కిందట సరళాసాగర్‌కు స్పిల్‌వేకు ఎడమ వైపు కట్టకు భారీ గండి పడిన విషయం తెలిసిందే. ఈ కారణంగా 80మీటర్ల మేర కట్ట నిర్మాణం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. దీనికి దారితీసిన కారణాలు ఇప్పటికీ తెలియలేదు. కట్టకు బొరియలు ఏర్పడటంలో నీరు అందులోకి చేరి ఉంటుందని, పూర్తిస్థాయి నీటి నిల్వలు చేరడంతో ఒత్తిడికి కట్ట తెగిపోయి ఉంటుందని అంచనా.
అయితే కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా తరలించే నీటితో సరళాసాగర్ కుడి, ఎడమ కాల్వల కింద 4,500 ఎకరాల మేర ఆయకట్టుకు నీరందించాల్సి ఉంది. ఆయకట్టుకు నీటిని అందించేలా రింగ్‌బండ్, సమాంతర కాల్వను తవ్వాలని ఇంజనీర్లు నిర్ణయించారు. ప్రాజెక్టుపై ఉన్న ఒక స్లూయిస్ ద్వారా కాల్వలకు 60 క్యూసెక్కుల నీటిని తరలించవచ్చని ఇంజనీర్లు చెబుతున్నారు. ప్రస్తుతానికి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నీటిని తరలించి, అనంతరం తెగిన 80 మీటర్ల కట్ట నిర్మాణాన్ని పటిష్టంగా నిర్మాణం చేయాలని నిర్ణయించారు.ప్రస్తుతం పూర్తి స్థాయి కట్ట నిర్మాణం చేయాలంటే, అంచనాలు రూపొందించి, ప్రభుత్వ అనుమతి తీసుకొని, మళ్లీ డ్రాయింగ్స్ సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ జరగడానికి మరో నెల, రెండు నెలల గడువు పట్టే అవకాశం ఉంది. తెగిన కట్ట నిర్మాణానికి కనీసంగా రూ.6 కోట్ల నుంచి రూ.7 కోట్లు మేర ఖర్చవుతుందని అంచనా.
Comments
Please login to add a commentAdd a comment