‘కృష్ణా’లో మళ్లీ కిరికిరి
పాలమూరు, డిండి, కల్వకుర్తి ప్రాజెక్టులపై తెలంగాణ వివరణ కోరిన కృష్ణా బోర్డు
♦ ఏపీ ఫిర్యాదులే కారణం
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నది జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య మళ్లీ అగ్గి రాజుకుంటోంది. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా చేపడుతున్న పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలతో పాటు, కల్వకుర్తి నీటి కేటాయింపుల పెంపు, అదనంగా వాటర్ గ్రిడ్‌కు 20 టీఎంసీల నీటి కేటాయింపుపై ఏపీ అభ్యంతరాలు లేవనెత్తుతుండటం, దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేయడం వివాదాన్ని రేపుతోంది. ఏపీ ఫిర్యాదుల నేపథ్యంలో కదిలిన కృష్ణా యాజమాన్య బోర్డు కొత్తగా చేపడుతున్న పథకాలకు నీటిని ఎక్కడి నుంచి ఏ రీతిన వాడుకుంటారో తమకు స్పష్టం చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై జవాబిచ్చేందుకు తెలంగాణ కసరత్తు చేస్తోంది.
ఇప్పటికే వివరణ ఇచ్చినా...
ఏపీ అభ్యంతరాలు, ఫిర్యాదులపై ఇప్పటికే తెలంగాణ వివరణ ఇచ్చింది. నిజానికి కృష్ణా జలాల్లో బచావత్ అవార్డు మేరకు ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీల కేటాయింపులున్నాయి. ఈ నీటి వినియోగంలో ప్రాజెక్టు వారీ కేటాయింపులు జరిపినా ప్రస్తుతం అవేవీ పూర్తికాలేదు. దీంతో తమకు జరిపిన కేటాయింపులను రాష్ట్ర పరిధిలో ఎక్కడైనా వాడుకుంటామని చెబుతూ అదే రీతిని అనుసరిస్తుంది. దీనిపై ఏపీ పలుమార్లు అభ్యంతరాలు లేవనెత్తినా చివరికి జూన్ రెండో వారంలో కేంద్ర జల వనరుల శాఖ నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ విధానాన్ని అంగీకరించింది. ఉమ్మడి ఏపీకి క్యారీ ఓవర్ కింద ఇచ్చిన 150 టీఎంసీలు, శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో పూడిక కారణంగా వాడుకోలేకపోతున్న 170 టీఎంసీలు, పట్టిసీమలో భాగంగా ఉమ్మడి ఏపీకి ఇచ్చిన 45 టీఎంసీల్లో దక్కే వాటాల నీటితోనే పాలమూరు, డిండిలను చేపట్టామని, కల్వకుర్తి సామర్థ్యాన్ని పెంచామని చెబుతూ వచ్చింది. వాటర్ గ్రిడ్‌కు కృష్ణా జలాల్లో కేటాయించిన 19.59 టీఎంసీలను సైతం గంపగుత్తగా ఇచ్చిన వాటాల్లోంచే వాడుకుంటున్నామంది.
తాజాగా మళ్లీ ఫిర్యాదులు...
ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు వివరణలు ఇచ్చినా, దీనిపై ఏపీ మళ్లీ బోర్డుకు ఫిర్యాదు చేసింది. కొత్త ప్రాజెక్టులకు నీటిని ఎక్కడి నుంచి తీసుకుంటారో, వాటికి బోర్డు అనుమతి ఉందో లేదో వివరణ తీసుకోవాలని బోర్డుపై ఒత్తిడి తెస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి బోర్డు సభ్య కార్యదర్శి ఆర్కే గుప్తా తెలంగాణకు లేఖ రాశారు. ‘పాలమూరు, డిండి, కల్వకుర్తి నీటి కేటాయింపుల పెంపు, వాటర్ గ్రిడ్‌కు చేసిన కేటాయింపులపై మీరింతవరకు వివరణ ఇవ్వలేదు. ఈ ప్రాజెక్టులకు నీటిని రాష్ట్రానికి ఉన్న కేటాయింపుల్లోంచే వాడుకుంటారా? లేక ఇంకా ఎక్కడి నుంచి ఇస్తారో తెలపండి’ అని లేఖలో కోరారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం మేరకు ఇరు రాష్ట్రాలు కొత్త ప్రాజెక్టులను చేపడితే బోర్డు అనుమతి పొందాల్సి ఉంటుందని లేఖలో గుర్తు చేశారు.