kamal hasan reddy
-
కుటుంబం జలసమాధి : వీడిన మిస్టరీ
సాక్షి, కరీంనగర్ : పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి బావ సత్యనారాయణరెడ్డి, సోదరి రాధ, మేన కోడలు వినయశ్రీ కారుతో సహా అల్గునూర్ శివారులో కాకతీయ కాలువలో పడి మృతి చెందిన కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. వీరిది ఆత్మహత్య అని కరీంనగర్ సీపీ కమలాసన్‌రెడ్డి సోమవారం ప్రకటించారు. ఈ కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. ఈ క్రమంలో సత్యనారాయణరెడ్డి సీడ్స్ అండ్ ఫర్టిలైజర్ షాప్‌లో పోలీసులకు సూసైడ్ నోట్ లభించింది. సూసైడ్ నోట్ పరిశీలన అనంతరం అది స్వయంగా సత్యనారాయణరెడ్డి రాసిందేనని నిర్ధారణకు వచ్చారు. దీంతో నాలుగు నెలల తర్వాత ఈ కేసు మిస్టరీ వీడింది.(చదవండి : కుటుంబం జలసమాధి : కొనసాగుతున్న విచారణ) కాగా, ఈ ఏడాది జనవరి 27న కరీంనగర్‌లోని బ్యాంక్ కాలనీలోని వారి ఇంటి నుంచి సత్యనారాయణరెడ్డి తన భార్య రాధ, కుమార్తె వినయశ్రీలతో కలిసి కారులో బయలుదేరారు. అయితే అదే రోజు వారి కారు అల్గునూరు వద్ద కాకతీయ కాలువలో పడిపోయింది. అప్పటి నుంచి వీరి ఆచూకీ కనిపించకుండా పోయింది. అయితే ఈ ఘటన జరిగిన ఇరవై రోజుల తర్వాత కరీంనగర్ నుంచి గన్నేరువరం బయలుదేరిన ఓ బైక్ అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. అ ప్రమాదంలో మహిళ నీటిలో కొట్టుకుపోవడంతో.. ఆమె గాలింపు కోసం కాలువలోకి విడుదలను నిలిపివేశారు. ఈ క్రమంలోనే కాలువలో నీటి ప్రవాహం తగ్గడంతో సత్యనారాయణరెడ్డి కారు కనిపించింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. ఈ ఘటనపై మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ.. తమకు ఎలాంటి అనుమానాలు లేవని, ఆత్యహత్య చేసుకునేందు ఇబ్బందులు కూడా వారికి లేవని వెల్లడించిన సంగతి తెలిసిందే. -
ఇండోనేషియా బృందానికి బస: జమీల్‌కు పాజిటివ్
సాక్షి, కరీంనగర్ : కరీంనగర్లో పర్యటనకు వచ్చిన ఇండోనేషియా వాసులకు ఆశ్రయం ఇచ్చిన మహమ్మద్ జమీల్ అహ్మద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వైద్య పరీక్షల కొరకు నగరంలోని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. అయితే పరీక్షల్లో జమీల్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. కాగా ఇండోనేషియా నుంచి కరీంనగర్‌కి వచ్చిన 9మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారైన విషయం తెలిసిందే. ఇండోనేషియా బృందానికి బస ఏర్పాటు చేసిన జమీల్ అహ్మద్ కొన్ని రోజుల పాటు పోలీసులకు దొరకుండా తప్పించుకుని తిరిగారు. ఈ క్రమంలోనే శనివారం రాత్రి అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వైరస్ సోకిందన్న అనుమానంతో వైద్య పరీక్షలుకు తరలించారు. మరోవైపు జమీల్‌పై అధికారులు ఆసుపత్రిలోనే విచారణ జరుపుతున్నారు. (వందేళ్లకో మహమ్మారి..) అదేవిధంగా కరీంనగర్లో జనతా కర్ఫ్యూను నగర సీపీ కమలాసన్‌రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్వచ్ఛందంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితమై ‘జనతా కర్ప్యూ’కి సహకరిస్తున్నారని తెలిపారు. రోడ్ల మీదికి ఎవరూ రాకుండా పోలీసులు పహారా కాస్తున్నారని చెప్పారు. ఇండోనేషియాకు చెందిన తొమ్మిది మందికి ఆశ్రయం కల్పించి కరోనా పాజిటివ్ తెచ్చుకున్న కరీంనగర్‌కు చెందిన మహమ్మద్ జమీల్ అహ్మద్‌ను శనివారం రాత్రి పట్టుకున్నామని ఆయన వెల్లడించారు. అతన్ని బైండోవర్ చేశాక మూడు రోజులుగా తప్పించుకుని తిరిగాడని కమలాసన్‌రెడ్డి తెలిపారు. జమీల్‌కు కరోనా లక్షణాలు కనిపించడంతో ఉండడంతో ఆసుపత్రికి తరలించి ఐసోలేషన్ వార్డుకు తరలించామని సీపీ కమలాసన్‌రెడ్డి తెలిపారు. (జనతా కర్ఫ్యూ: లైవ్ అప్డేట్స్) చదవండి: ఇంట్లో ఉండకపోతే.. ఆస్పత్రిలో వేస్తారు! చదవండి: రామగుండంలో ‘కరోనా’ దడ! -
కమలాకర్ వర్సెస్ కమలాసన్
సాక్షి, కరీంనగర్ : అధికార పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే ఒకరైతే... మరొకరు డీఐజీ ర్యాంక్‌లో కమిషనర్‌గా పనిచేస్తున్న పేరున్న ఐపీఎస్ అధికారి. ఇద్దరూ తమ తమ బాధ్యతల్లో ప్రజల మన్ననలు పొందుతున్న వారే. ఎక్కడ ఎవరి అహం దెబ్బతిందో తెలియదు గానీ... గత కొంతకాలంగా వారి మధ్య అంతరం పెరిగింది. కరీంనగర్ నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన గంగుల కమలాకర్‌కు, దాదాపు మూడేళ్లుగా కరీంనగర్ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్న కమలాసన్‌రెడ్డికి మధ్య నడుస్తున్న కోల్డ్‌వార్ ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. కరీంనగర్ హెడ్‌క్వార్టర్ ఎమ్మెల్యేగా ఉన్న తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని కమలాకర్ భావిస్తుండగా, శాంతిభద్రతల సమస్యలు ఉత్పన్నం కాకుండా చూస్తూనే... వివిధ అంశాలపై ప్రజల్లో చైతన్యం కల్గిస్తూ ప్రభుత్వ ఆదేశాల మేరకు పనిచేస్తున్నట్లు కమిషనర్ కమలాసన్‌రెడ్డి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల కొత్తపల్లి మండలం, చింతకుంటలో గత ఆదివారం పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో చోటు చేసుకున్న సంఘటనతో సమస్య తీవ్రమైంది. ‘పెట్రోల్’ మంట రాజేసిన పింఛన్ల సభ అధికారులు తన ఇంటికి నెంబర్లు కేటాయిండం లేదని రెండు లీటర్ల పెట్రోల్ క్యాన్‌తో చింతకుంట సభలో ఓ మహిళ వేదిక మీదికి వచ్చి పెట్రోల్ మీద పోసుకొనేందుకు ప్రయత్నించగా, ఎమ్మెల్యే గన్మెన్లు అప్రమత్తమై నిలువరించారు. అప్పటికే పెట్రోల్ ఎమ్మెల్యే, ఇతర నాయకులపై కూడా పడడాన్ని ఆయన తీవ్రంగా పరిగణించారు. తనకు భద్రత కల్పించడంలో పోలీసులు ఉద్ధేశపూర్వకంగా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ డీఐజీ ప్రమోద్‌కుమార్‌కు తన అసంతృప్తిని తెలియజేసినట్లు సమాచారం. పింఛన్ల సభ జరుగుతుంటే కనీస భద్రత ఏర్పాటు చేయలేదని, సభకు పెట్రోల్ క్యాన్‌తో ఓ మహిళ వచ్చి, వేదిక ఎక్కుతున్నా అడ్డుకునే పోలీసులు లేకుండా పోవడాన్ని తప్పుపట్టారు. కొత్తపల్లి ఎస్ఐ, ఇద్దరు బ్లూకోల్ట్స్ కానిస్టేబుళ్లు సభకు వచ్చి, వేరే బందోబస్తుకు వెళ్లిపోతే ఎమ్మెల్యేకు పోలీసుల భద్రత అవసరం లేదా అని ప్రశ్నించినట్లు సమాచారం. విషయం తెలిసిన వెంటనే కమిషనర్ కమలాసన్‌రెడ్డి స్వయంగా ఎమ్మెల్యేకు ఫోన్ చేసి, జరిగిన సంఘటనపై విచారం వ్యక్తం చేశారు. కొత్తపల్లి ఎస్ఐని తక్షణమే అక్కడి నుంచి తొలగించి, కమిషనరేట్‌కు అటాచ్డ్ చేశారు. అయితే పెట్రోల్‌తో మహిళ సభావేదిక మీదికి వచ్చినప్పుడు ఏదైనా అనుకోని సంఘటన జరిగి ఉంటే పరిస్థితి ఏమయ్యేదని భావిస్తున్న ఎమ్మెల్యే చల్లబడడం లేదు. అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచేనా? గత సంవత్సరం చివరలో జరిగిన శాసనసభ ఎన్నికల సమయంలోనే కమిషనర్‌కు ఎమ్మెల్యేకు మధ్య సఖ్యత లోపించినట్లు సమాచారం. ఎమ్మెల్యే కుటుంబానికి చెందిన ఓ హోటల్లో పోలీసులు తనిఖీలు జరపడం, ఇతరత్రా సంఘటనలతో పొరపొచ్చాలు ఏర్పడినట్లు తెలుస్తోంది. ఎన్నికల కమిషన్, ఉన్నత స్థాయి అధికారుల ఆదేశాల మేరకు ఎన్నికల సమయంలో కట్టుదిట్టంగా వ్యవహరించామే తప్ప ఎమ్మెల్యే, ఇతర నేతల గురించి కాదని పోలీసులు సమర్థించుకుంటున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్లో బీజేపీకి మెజారిటీ రావడంపై కూడా గంగుల అసంతృప్తికి కారణంగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో చింతకుంట సంఘటన ఇద్దరి మధ్య మంటలు రాజేసింది. ఎస్ఐ సమాచార లోపమే కారణమా..? ఆదివారం చింతకుంటలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నేతృత్వంలో పింఛన్ల సమావేశం జరుగుతుందనే విషయాన్ని ఎస్ఐ స్వరూప్‌రాజ్ తమకు తెలియజేయలేదని ఉన్నతాధికారులు చెబుతున్నారు. కరీంనగర్ రూరల్ సర్కిల్లోని కొత్తపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఎమ్మెల్యే పింఛన్ల సభ ఉన్న విషయం తనకు సమాచారం లేదని రూరల్ సీఐ శశిధర్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఎస్ఐ స్వరూప్‌రాజ్ తనతోపాటు ఇద్దరు కానిస్టేబుళ్లతో కలిసి సభకు పోయి, తరువాత శాతవాహన యూనివర్సిటీలో ఏదో ధర్నా సమాచారం వస్తే అక్కడికి వెళ్లినట్లు చెబుతున్నారని, ఈ విషయాలేవీ తనకు గానీ, ఏసీపీకి గానీ తెలియవని ఆయన స్పష్టం చేశారు. పోలీస్ కమిషనర్ కమలాసన్‌రెడ్డిని ఈ విషయంపై ప్రశ్నించగా... ఎమ్మెల్యే సభ గురించి ఎస్ఐ పై అధికారులకు చెప్పక, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా విషయం తెలిసిన వెంటనే కొత్తపల్లి ఎస్ఐ బాధ్యతల నుంచి స్వరూప్‌రాజ్‌ను తొలగించి, జరిగిన సంఘటనపై విచారణకు ఆదేశించామని చెప్పారు. ఎమ్మెల్యే కమలాకర్‌తోపాటు ప్రజాప్రతినిధులు అందరికీ పూర్తి స్థాయిలో రక్షణ కల్పిస్తున్నామని, సమాచారలోపంతో ఈ సంఘటన జరిగినట్లు ఆయన చెప్పారు. ఎమ్మెల్యేకు పెరిగిన భద్రత చింతకుంటలో ఆదివారం జరిగిన సంఘటన వివాదాస్పదం కావడంతో పోలీస్ అధికారులు తక్షణ చర్యలు తీసుకున్నారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌తోపాటు ప్రజా ప్రతినిధులందరికీ భద్రతను పెంచారు. ఎస్బీ విభాగాన్ని అలర్ట్ చేశారు. ఎమ్మెల్యే కార్యక్రమాల సమాచారం పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు తెలియజేయకపోవడంపై ఎస్బీ ఇన్స్పెక్టర్, సిబ్బందిపై కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా జరిగిన సంఘటనపై ఎమ్మెల్యే కమలాకర్ పోలీస్ ఉన్నతాధికారులు, ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. మునిసిపల్ ఎన్నికల వేళ వివాదం రాజుకోకుండా నష్ట నివారణ చర్యలు కూడా మొదలైనట్లు సమాచారం. -
ఎల్బీ స్టేడియంలో శాంతియాగం
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల7న హైదరాబాద్‌కు రానున్న నేపథ్యంలో ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు బీజేపీ రాష్ట్రకమిటీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఎల్బీ స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా విజయవంతం కావాలని కోరుతూ గురువారం ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారె డ్డి ఆధ్వర్యంలో శాంతి యజ్ఞం, సుదర్శన యాగం నిర్వహించారు. ఈ సందర్భంగా మ్మెల్యే మాట్లాడుతూ ప్రధాని సభకు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు తరలివస్తున్నారన్నారు. వీఐపీ వాహనాలకు బాబు జగ్జీవన్‌రామ్ చౌరస్తా వరకు అనుమతి ఉంటుందన్నారు. వాహనాల పార్కింగ్ైకై నిజాం కళాశాల మైదానం, మహబూబియా పాఠశాల, పబ్లిక్ గార్డెన్ ప్రాంతాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. వేదికను పూర్తిగా డిజిటల్ పరిజ్ఞానంతో తీర్చిదిద్దుతున్నట్లు వివరించారు. అనంతరం నగర అధ్యక్షులు వెంకట్‌రెడ్డి, డీసీపీ కమల్‌హాసన్ రెడ్డితో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
ప్రదీప్ దొరికినట్లు ఎక్కడా సమాచారం లేదు
హైదరాబాద్ : ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ భార్య సుప్రియ హత్య కేసులో రెండో నిందితుడు ప్రదీప్ దొరికినట్లు తమకు ఎక్కడా సమాచారం అందలేదని డీసీపీ కమలాహాసన్రెడ్డి స్పష్టం చేశారు. ప్రదీప్ అరెస్ట్ అంటూ మీడియాలో కథనాలు వెల్లువెత్తడంపై శుక్రవారం కమలాహాసన్రెడ్డి స్పందించారు. ప్రదీప్ అరెస్ట్ అవాస్తవమని ఆయన పేర్కొన్నారు. అయితే అక్రమ సంబంధం అన్న అనుమానంతోనే భార్య సుప్రియను ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ రామకృష్ణ హత్య చేశాడని వెల్లడించారు. భార్యను హత్య చేసిన రామకృష్ణ... ఆమె మృతదేహన్ని వికారాబాద్ అటవీ ప్రాంతంలో పూడ్చి పెట్టిన సంగతి తెలిసిందే. అందుకు అతడి స్నేహితుడు ప్రదీప్ సహాయ సహకారాలు అందించినట్లు పోలీసుల విచారణలో రామకృష్ణ తెలిపాడు. దీంతో అతడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. కాగా ప్రదీప్‌ను పోలీసులు అదుపులో తీసుకున్నారంటూ మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి. దీంతో డీసీపీ కమలాహాసన్రెడ్డి పైవిధంగా స్పందించారు.