కమల ప్రక్షాళన
సాక్షి, చెన్నై: రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యూహాలకు అనుగుణంగా అడుగుల వేగాన్ని పెంచేందుకు మక్కల్ నీది మయ్యం నేత కమలహాసన్ సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా పార్టీ కార్యవర్గాల్లో సమూల మార్పుల దిశగా ముందుకు సాగే పనిలో పడ్డారు. గ్రామస్థాయి నుంచి బలోపేతం లక్ష్యంగా కమిటీల విస్తృత ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. విశ్వనటుడు కమల్ మక్కల్ నీది మయ్యంను ప్రకటించి ఏడాదిన్నర కాలం అవుతోంది. ఆపార్టీ పురుడు పోసుకున్న ఏడాదిలోనే లోక్‌సభ ఎన్నికలు రావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఒంటరినే బరిలో అభ్యర్థులను కమల్ నిలబెట్టారు. టార్చ్‌లైట్ చిహ్నంతో రాష్ట్రవ్యాప్తంగా ముందుకు సాగిన కమల్‌కు కనీస ఓటు బ్యాంక్‌తో కొంత మేరకు వెలుగును రాబట్టుకోగలిగారు. డిపాజిట్లు గల్లంతైనా ఓటు
బ్యాంక్ అన్నది తనకు ఉందని చాటుకున్నారు. కొన్ని చోట్ల ఆశాజనకంగా ఓట్లు రావడంతో అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలన్న కాంక్షతో ముందుకు సాగుతున్నారు. అందుకే రాజకీయ వ్యూహ కర్త ప్రశాంత్ కిషోర్ సలహాలకు అనుగుణంగా ముందుకు సాగేందుకు సిద్ధమైనట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. ఆయన వ్యూహాలకు అనుగుణంగా అడుగుల వేగాన్ని పెంచేందుకు నిర్ణయించిన కమల్ముందుగా పార్టీలో ప్రక్షాళనకు సిద్ధమయ్యారు. రాష్ట్ర స్థాయి కమిటీ జోలికి వెళ్లకుండా ముందుగా గ్రామస్థాయి నుంచి బలోపేతానికి సిద్ధమయ్యారు. ఇందు కోసం జిల్లాల వారీగా కార్యవర్గాల్లో మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టారు.
జిల్లాల వారీగా..
చెన్నైలో జరిగిన పార్టీ కార్యవర్గం భేటీ మేరకు కొత్త వ్యూహాలకు పదునుపెట్టే పనిలో కమల్ నిమగ్నమయ్యారు. ప్రశాంత్ కిషోర్ రచించి ఇచ్చినట్టుగా పేర్కొంటున్న అంశాల మేరకు కొత్త మార్పులతో కార్యవర్గాల ఏర్పాటుకు కమల్‌హాసన్ సిద్ధమయ్యారు. ఆమేరకు జిల్లా స్థాయిలో ఒక అధ్యక్షుడు, ముగ్గురు కార్యదర్శులు, ఆరుగురు సంయుక్త కార్యదర్శులు, ఒక ఇన్చార్జ్, నలుగురు సభ్యులతో పదిహేను మందితో కార్యవర్గాల ఏర్పాటుకు ఆయన నిర్ణయించారు. ఆ మేరకు ఇక, ఆయా జిల్లాల వారీగా సమావేశాలను ఏర్పాటు చేసి కార్యవర్గాలను ప్రకటించబోతున్టు్ట సమాచారం. కార్యవర్గ రూపు రేఖలు, గ్రామ స్థాయి నుంచి చేపట్టాల్సిన కార్యక్రమాల మీద దృష్టి పెట్టి, ఇక, విస్తృతంగా దూసుకెళ్లేందుకు నిర్ణయించారు