
క్రేజీ హీరోయిన్‌కు సినిమాలే సినిమాలు
లైకాలో నయన్ ఖోఖో. ఏమిటి అర్థం కాలేదా? అయితే రండి చూద్దాం. నేడు క్రేజీ హీరోయిన్ అంటే నయనతార. ఈ మధ్య లేడీ ఓరియయెంటెడ్ చిత్రాల హీరోయిన్ గా మారిన నయనతార సినీ కెరీర్ మూడు పువ్వులు ఆరు కాయలుగా వికసిస్తోంది. ప్రస్తుతం శివకార్తికేయన్‌కు జంటగా వేలైక్కారన్ చిత్రాన్ని, అధర్వతో ఇమైకా నోడిగళ్ చిత్రాలలో నటిస్తోంది. కలెక్టర్‌గా అరం అనే హీరోయిన్ సెంట్రిక్ కథా చిత్రాన్ని పూర్తి చేసిన నయన తన మాతృభాష మలయాళంలో ఒక చిత్రం చేస్తున్నారు.
అదే విధంగా తెలుగులో ఒక భారీ చిత్రం చేయనున్నారు. తాజాగా లైకా సంస్థలో ఒక చిత్రం చేయడానికి సంసిద్ధతను వ్యక్తం చేశారని తాజా సమాచారం. సూపర్‌స్టార్ హీరోగా 2.ఓ, కమలహాసన్ హీరోగా స్వీయ దర్శకత్వంలో శభాష్‌నాయుడు చిత్రాన్ని చేస్తున్నారు. ఉదయనిధి స్టాలిన్ హీరోగా ఇప్పుడై వెల్లుమ్ చిత్రాన్ని లైకా సంస్థ నిర్మిస్తుంది. ఈ సంస్థ తాజాగా నయనతార ప్రధాన పాత్రలో చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తోంది.
దీని గురించి ఆ సంస్థ నిర్వాహకుడు రాజు మహాలింగం మాట్లాడుతూ.. నూతన దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ చెప్పిన కథ చాలా బాగా నచ్చిందన్నారు. ఇది పూర్తిగా బ్లాక్ కామెడీ చిత్రంగా ఉంటుందని తెలిపారు. ఇందులో నటి నయనతార ప్రధాన పాత్రను పోషించనున్నారని అన్నారు. ఒక ముఖ్య పాత్రలో యోగిబాబు నటిస్తారని చెప్పారు. అనిరుధ్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాకి ఖోఖో అనే టైటిల్ ను నిర్ణయించినట్లు తెలిపారు. త్వరలోనే చిత్రాన్ని ప్రారంభించనున్నట్లు ఆయన చెప్పారు.