బేణీవాల్ బర్తరఫ్‌పై దుమారం
ఇది రాజకీయ కక్ష సాధింపేనన్న కాంగ్రెస్, ఎన్సీపీ
అంతా రాజ్యాంగ బద్ధమేనన్న మోడీ సర్కార్
న్యూఢిల్లీ: మిజోరాం గవర్నర్ పదవినుంచి కమలాబేణీవాల్ బర్తరఫ్‌పై తీవ్రమైన దుమారం చెలరేగింది. రాజకీయ కక్షసాధింపుకోసమే ఆమెను పదవినుంచి తప్పించారంటూ ప్రతిపక్షం నరేంద్రమోడీ సర్కార్‌ను విమర్శించగా, విమర్శలను ప్రభుత్వం తిప్పికొట్టింది. బేణీవాల్ బర్తరఫ్‌లో ఎలాంటి రాజకీయాలూ లేవని, తీవ్రమైన ఆరోపణల కారణంగానే ఆమెను తప్పించవలసి వచ్చిందని స్పష్టంచేసింది. గతంలో గుజరాత్ గవర్నర్‌గా పనిచేసి, బదిలీపై మిజోరాంలో బాధ్యతలు నిర్వహిస్తున్న కమలా బేణీవాల్ పదవీకాలం మరో రెండు నెలల్లో ముగుస్తున్న తరుణంలో ఆమెను బుధవారం రాత్రి ప్రభుత్వం బర్తరఫ్ చేసింది.
మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆ రాష్ట్రానికి గవర్నర్‌గా పనిచేసిన బేణీవాల్‌కు, మోడీకి పొసిగేదికాదు. కాగా, బేణీవాల్‌ను రాజకీయకక్షతోనే తొలగించారని, దీనితో రాజ్యాంగబద్ధమైన గవర్నర్ వ్యవస్థపైనే దాడి జరిగిందని మాజీ కాంగ్రెస్ నేత వీరేంద్ర కటారియా వ్యాఖ్యానించారు. పుదుచ్చేరి గవర్నర్‌గా కటారియా గతనెలలోనే పదవీచ్యుతుడయ్యారు. బేణీవాల్‌ను తొలగించదలచుకుంటే, ఆమెను ఎందుకు బదిలీ చేశారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అజయ్ మాకెన్ ప్రశ్నించారు.